Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బీజేపీ మత విద్వేషాలు

. నియంత పాలన దిశగా దేశం
. రాఘవులు, రామకృష్ణ విమర్శ

విశాలాంధ్ర`మంగళగిరి/తాడేపల్లి: అంబేద్కర్‌ రాజ్యాంగానికి తూట్లు పొడిచి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. మత వైషమ్యాలతో మతసామరస్యాన్ని నాశనం చేస్తున్నదని మండిపడ్డారు. సీపీఐ, సీపీఎం ప్రచారభేరి బహిరంగ సభ గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం సాయంత్రం జరిగింది. సీపీఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సీపీఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వై.కమలాకర్‌ అధ్యక్షత వహించారు. బీవీ రాఘవులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, మతసామరస్యం, సమాఖ్య స్ఫూర్తిని బీజేపీ దెబ్బతీస్తోందని మండిపడ్డారు. సీబీఐ, ఈడీ దాడులతో ప్రతిపక్షాల నోరు నొక్కుతోందని ఆరోపిం చారు. దేశ సంపదను కొద్దిమంది కుబేరులకు దోచిపెడుతోందన్నారు. ఇటువంటి బీజేపీ 2024లో తిరిగి అధికారం చేపడితే దేశ ఐక్యతను కాపాడటం కష్టతరమవుతుందని రాఘవులు హెచ్చరించారు. ఎన్నికలు కూడా ఉండవని, నియంతృత్వం రాజ్యమేలుతుందని చెప్పారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని, ఇది సరైన విధానం కాదన్నారు. దేశంలో ప్రతిపక్షాలు ఉండ కూడదని బీజేపీ కోరుకుంటుందని, ప్రతిపక్షాలు ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందన్న విషయాన్ని బీజేపీ గ్రహించాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులు, విశాఖ ఉక్కు తదితర విషయాల్లో రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించకూడదని విజ్ఞప్తి చేశారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ విషకౌగిలి నుంచి బయటపడాలని హితవు పలికారు. బీజేపీ పక్షాన ఉండాల్లో…రాష్ట్ర ప్రజల పక్షాన ఉండాలో తేల్చుకోవాలని ఆ పార్టీలకు సూచించారు.
రామకృష్ణ మాట్లాడుతూ తొమ్మిదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం దేశానికి ఏమి చేసిందని ప్రశ్నించారు. ప్రజల మధ్య చీలిక తేవడం, హిందూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం తప్ప ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ధరల తగ్గింపు, ఉద్యోగాల సృష్టి, రైతు ఆదాయం రెట్టింపు, వెనక్కి తెస్తామన్న నల్లధనం హామీలు అమలు చేయలేదని గుర్తు చేశారు. మోదీ అధికారం చేపట్టే నాటికి దేశానికి రూ.47 లక్షల కోట్ల అప్పు ఉంటే నేడు రూ.150 లక్షల కోట్లకు పెరిగిందని విమర్శించారు. బ్యాంకులకు లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన బడాబాబులపై ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఏమి చర్యలు తీసుకున్నారని రామకృష్ణ నిలదీశారు. మోదీ హయాంలో అత్యంత దారిద్య్ర దేశంగా భారత్‌ నిలిచిందని ఆరోపించారు. అదానీ ఆర్థిక కుంభ కోణాలపై జేపీసీ విచారణకు ఎందుకు భయపడుతు న్నారని ప్రశ్నించారు. నాలుగేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని విమర్శించారు. లక్షల కోట్లు అప్పు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు నిర్మించలేదని, పరిశ్రమ స్థాపించలేదని, పైగా రాజకీయ కక్ష సాధింపుతో ఉన్న పరిశ్రమలను పారిపోయేలా చేస్తోందని మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందన్నారు. దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. లౌకిక, ప్రజాతంత్రశక్తులు ఒకే వేదికపైకి వచ్చి బీజేపీ, వైసీపీని గద్దెదించాలని రామకృష్ణ పిలుపునిచ్చారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ వాక్‌ స్వాతంత్య్రం కోసం ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఉద్ఘాటించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబురావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి రాజధాని లేకుండా చేశాయని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక, పారిశ్రామిక, రాజకీయ రంగాలను నాశనం చేస్తున్న తరుణంలో మరో స్వాతంత్య్ర ఉద్యమానికి సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో కమ్యూనిస్టుల అధ్వర్యంలో సాధించుకున్న భూములలో నివాసం ఉంటున్న పదివేల మంది పేదలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. తొలిత సీపీఎం మైనార్టీ నాయకులు షంషేర్‌ ఖాన్‌కు నివాళులర్పించారు. సీపీఐ మంగళగిరి నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య ఆహ్వానం పలకగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్‌.చెంగయ్య వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు జాలాది జాన్‌బాబు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, బొర్రా మల్లికార్జునరావు, పిల్లలమర్రి నాగేశ్వరరావు, నందం బ్రహ్మేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ, సీపీఎం నాయకులు ఎం.రవి, ఈమని అప్పారావు, జేవీ రాఘవులు, జవహర్‌, జొన్నా శివశంకర్‌, బాలరాజు, జి.వెంకటరెడ్డి, బి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img