Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

బీజేపీ మద్దతుతోనే హింస

. మణిపూర్‌ ట్రైబల్‌ ఫోరం ఆరోపణ
. సిట్‌ విచారణ
. గిరిజనులకు భద్రత కల్పనకు వినతి
. మైతేయిలకు ఎస్టీ హోదా ప్రతిపాదన లేదు: బీజేపీ ఎమ్మెల్యే పిటిషన్‌
. నేడు సుప్రీంకోర్టు విచారణ

న్యూదిల్లీ: మణిపూర్‌లో మయితే వర్గీయులకు ఎస్టీ హోదా కల్పన వ్యవహారం ఆ రాష్ట్రంలో హింసకు దారితీసింది. దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్రంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతుతోనే రాష్ట్రంలో హింస జరిగిందని ఆరోపిస్తూ మణిపూర్‌ ట్రైబల్‌ ఫోరం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)ను దాఖలు చేసింది. అయితే మెయితే వర్గీయులకు ఎస్టీ హోదా కల్పనకు ప్రతిపాదనలే లేవంటూ మణిపూర్‌ హైకోర్టు మార్చి 27న ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానంలో బీజేపీ ఎమ్మెల్యే దింగాంగ్లుంగ్‌ గాంగ్మే సవాల్‌ చేస్తూ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్లను సీజేఐ చంద్రచూడ్‌, జస్టిస్‌ నరసింహా, జస్టిస్‌ పార్దివాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారించనుంది.
‘రాష్ట్రంలో దాడులకు అధికార ఇండియన్‌ పీపుల్స్‌ పార్టీ, బీజేపీ సంపూర్ణ మద్దతుంది. కేంద్రప్రభుత్వం కూడా మద్దతిచ్చింది. ప్రబలంగా ఉన్న వర్గానికి మద్దతిస్తూ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా అలౌకిక అజెండా ప్రకారం దాడులకు ప్రణాళికలు రూపొందించింది. ఆధిపత్య వర్గీయులు 30 మంది గిరిజనులను చంపేశారు. మరో 132 మందిని గాయపర్చారు కానీ ఒక్క ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు కాలేదు. పోలీసులదీ వారి పక్షమే కాబట్టి వారు ప్రేక్షక పాత్ర వహించారు. ఈ హత్యలపై దర్యాప్తు కూడా జరపలేదు.అందుకే అసోం మాజీ డీజీపీ హరేకృష్ణ డేకా నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసి మేఘాలయ రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ మాజీ చైర్మన్‌, ప్రధాన న్యాయమూర్తి తింలియాంన్‌థాంగ్‌ వైపేయి పర్యవేక్షణలో విచారణ జరిపించి గిరిజనులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. గిరిజనులపై దాడులు చేసిన వారిని ఉపేక్షించొద్దు. గిరిజన ప్రాంతాలైన న్యూ లంబులేన్‌, చెకోన్‌, గేమ్స్‌ విలేజ్‌, పైటే వెంగ్‌, లంఫెల్‌, లంగోల్‌, మంత్రిపుఖ్రీ, చింగ్‌మైరోంగ్‌, దుల్హాలేన్‌, లంఘబాల్‌ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు తక్షణమే భద్రత కల్పించాలని కేంద్ర బలగాలకు ఆదేశాలివ్వాలని, ఘర్షణల్లో ధ్వంసమైన చర్చీల నిర్మాణానికి సూచనలు చేయాలని కోరుతున్నాం’ అని న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. ఈ పిల్‌ను న్యాయవాది సత్యమిత్ర దాఖలు చేశారు.
ఇదిలావుంటే మయితే వర్గీయలుకు షెడ్యూల్డ్‌ తెగ (ఎస్టీ) హోదాపై మణిపూర్‌ హైకోర్టు ఆదేశా లను సవాల్‌ చేస్తూ హిల్‌ ఏరియా కమిటీ చైర్మన్‌, బీజేపీ ఎమ్మెల్యే గాంగ్మే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మయితేల చేర్పింపుకు సంబంధించి కేంద్రప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదన పెండిరగ్‌లో లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదనను కేంద్రానికి పంపలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మయితేలను ఎస్టీ హోదాపై నిర్ణయించేది రాష్ట్రమేనని, ఇటువంటి సిఫార్సులను పంపేలా రాష్ట్రాన్ని ఎవరూ బలవంతం చేయలేరని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే మయితే వర్గీయుల ధిక్కరణ పిటిషన్‌ నేపథ్యంలో తమకు నోటీసులు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన వేరొక పిటిషన్‌ కూడా దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img