Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

బెంగళూరు మళ్లీ మునక

భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం

. ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
. కొట్టుకుపోయిన వాహనాలు
. కూలిన మెట్రో రైలు ప్రహరీ గోడ
. ఏడు కార్లు ధ్వంసం
. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం
. నదులను తలపించిన రోడ్లు

బెంగళూరు : కర్ణాటకపై ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. గతనెల కురిసిన వర్షాలకు జరిగిన నష్టాల నుంచి పూర్తిగా కోలుకోక ముందే మరోసారి రాజధాని నగరాన్ని వానలు ముంచెత్తాయి. రాత్రి కురిసిన వర్షానికి బెంగళూరు అతలాకుతలమైంది. మహానగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులన్నీ నదులను, చెరువులను తలపించాయి. కుండపోత వల్ల మెట్రో రైలు ప్రహరీ గోడ కూలి ఏడు కార్లు, అనేక బైకులకు నష్టం వాటిల్లింది. దీంతో తమకు పరిహారం ఇవ్వాలని వాహనదారులు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. నాసిరకం కట్టడం కారణంగానే గోడ కూలిందని ఆరోపించారు. రద్దీగా ఉండే శివాజీనగర్‌ పరిసరాలను వర్షం ముంచెత్తింది. కార్లు, బైకులు నీటిలో కొట్టుకుపోయాయి. రామానగర జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకోగా ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టుపక్కల నివాస, వాణిజ్య ప్రాంతాలకు వర్షాలతో నష్టం జరిగింది. అయితే ఇటీవల చేపట్టిన ఆక్రమణల తొలగింపుతో నష్టం కాస్త తగ్గిందని అధికారి ఒకరు తెలిపారు. కొన్ని చోట్ల చెట్లు కూలిపోగా మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోగా స్థానికులు ఇబ్బంది పడ్డారు. 70 ఎంఎంల వర్షపాతం అనేకచోట్ల నమోదు అయిందని అధికారులు తెలిపారు. హెచ్‌ఆర్‌ఎస్‌ లేఅవుట్‌ వద్ద 200 కుటుంబాలు చిక్కుకున్నాయి. వారి ఇళ్లు, అపార్ట్‌మెంట్లు నీటమునిగాయి. దక్షిణ బెంగళూరులోని బిలేఖహళ్లి వద్దనున్న అనుగ్రహ లేఅవుట్‌లోని కాలనీ మొత్తం జలదిగ్బంధంలో ఉంది. నగరంలోని తూర్పు భాగాల్లో 12 గంటల పాటు వర్షం కురవగా అనేక ప్రాంతాలు నదులను తలపించాయి. శుక్రవారం కూడా ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని ఐఎండీ సూచించింది. కొన్ని రోజులుగా నగరాన్ని వర్షాలు ముంచెత్తుతూనే ఉన్నాయి. వర్షాల ధాటికి ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img