Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

బెజవాడ జనసంద్రం

. కదం తొక్కిన కామ్రేడ్లు
. పులకించిన నగరం
. కిలోమీటర్ల పొడవునా సాగిన ప్రదర్శన
. నినాదాలతో హోరెత్తిన నగర వీధులు
. పాలకుల విధానాలను ఎండగట్టిన పార్టీ శ్రేణులు

బెజవాడ నగరాన్ని ఓ అద్భుతం కనువిందు చేసింది. అరుణతారలు ఎగిరినట్లుగా… జనం నెత్తురు మరిగినట్లుగా… పేదల సత్తువ ఉరిమినట్లుగా… కొండనైనా కొట్టగల దమ్ముతో… ఎత్తిపట్టిన ఎర్రజెండాను విజయవాడ తనివితీరా ముద్దాడిరది. సర్కారు రంగును బయటపెడుతూ… జనాగ్రహం ఉబికిందా అన్నట్టుగా ప్రజాశక్తి మెరుపుకత్తులను మేళవిస్తూ దూసుకొచ్చింది. కనీవినీ ఎరుగని రీతిలో… ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత గొప్పగా భారత కమ్యూనిస్టుపార్టీ ఓ మహాప్రదర్శనను నిర్వహించింది. డప్పుల దరువుల దండోరాలతో… వామపక్షాలను ఏకం చేయాలన్న ఏకైక పిలుపుతో… కదంతొక్కిన కష్టజీవులు…ఎర్రజెండా రెపరెపల నడుమ… ఎదిరించి పోరాడే సత్తాను… రొమ్మువిరిచి… ఎలుగెత్తిచాటారు. కమ్యూనిస్టు శ్రేణుల్లో ఊహించని ఉత్సాహాన్ని నింపారు.
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : అరుణపతాక రెపరెప లతో విజయవాడ నగరం పులకించిపోయింది. ఉద్యమాల పురిటిగడ్డ మరోమారు ఎరుపెక్కింది. వేలాదిమంది రెడ్‌ షర్ట్‌ వలంటీర్లు కదం తొక్కుతూ ముందుకు సాగారు. మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మొక్కవోని పట్టుదలతో ముందుకు నడిచారు. సీపీఐ 24వ జాతీయ మహాసభల సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఈ భారీ ప్రదర్శనను నగర ప్రజానీకం ఆసక్తితో తిలకించింది. తప్పట్లు, తాళాలు, డప్పు వాయిద్యాలు, విప్లవగేయాలతో ప్రదర్శన ఎంతో కోలాహలంగా ముందుకు సాగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సీపీఐ, అనుబంధ ప్రజా సంఘాల కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా ప్రదర్శనలో పాల్గొన్నారు. సీపీఐ జిందాబాద్‌, విప్లవం వర్థిల్లాలి, ఎరుపులోన మెరుపుంది, పోరాడే శక్తి ఉందంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్లకార్డులతో ప్రదర్శనలో పాల్గొన్నారు. తమ తమ జిల్లాల బ్యానర్లను చేబూని ఉక్కు క్రమ శిక్షణతో వరుస క్రమంలో ముందుకు సాగారు. యువకులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, చివరకు చిన్నపిల్లలు సైతం పెద్ద సంఖ్యలో ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వందలాది మహిళలు ఎర్ర అంచు తెల్లచీరలు, యువ మహిళలు ఎర్ర సల్వార్‌, తెల్ల పైజామా ధరించారు. వేలాది మంది ఎర్రచొక్కాలు ధరించి పాల్గొనడంతో కనుచూపుమేర ఎరుపుమయమైంది. ఆరు కిలోమీటర్ల పొడవునా ప్రదర్శన సాగింది. బీఆర్‌టీఎస్‌ రోడ్డు చివర పండ్ల మార్కెట్‌ దగ్గర నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన జీఎస్‌ రోడ్డు గుండా సత్యనారాయణపురం, ముత్యాలంపాడు, గవర్నమెంటు ప్రెస్‌ సెంటర్‌, సింగ్‌నగర్‌ ప్లైఓవర్‌ మీదుగా డాబా కొట్ల సెంటర్‌ వద్ద మలుపు తిరిగి అమరజీవి చండ్ర రాజేశ్వరరావు మైదానం (మాకినేని బసవపున్నయ్య స్టేడియం)కు చేరుకుంది. కేరళ, తమిళనాడు, విశాఖపట్నం, వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌, తిరుపతి నుంచి ప్రత్యేక రైళ్ల ద్వారా సీపీఐ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి రైళ్లు, బస్సులు, లారీలు, కార్లు, తదితర వందలాది వాహనాల్లో కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే విజయవాడ నగర వీధులు కిక్కిరిసిపోయాయి. నగరంలో ఏ వీధి చూసినా కామ్రేడ్ల సందడే కనిపించింది. సద్ది అన్నం, పులిహోర, చపాతీలు వంటి స్వగృహ వంటలను మూటగట్టుకుని అనేకమంది మహిళలు ఉదయాన్నే నగరానికి చేరుకోవడం పార్టీపై వారి నిబద్ధతకు నిదర్శనంగా కనిపించింది. అలాగే కొంతమంది మహిళలు పసిబిడ్డలను చంకనెత్తుకొని, నెత్తిన సద్ది మూట పెట్టుకుని విప్లవ నినాదాలతో ప్రదర్శనలో హుషారుగా పాల్గొనడం యువతకు స్ఫూర్తినిచ్చింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారు రోడ్ల పక్కన కూర్చుని భోజనాలు చేసి మరీ ప్రదర్శనలో కొనసాగుతూ పార్టీపై తమకున్న అంకితభావాన్ని చాటారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి గిరిజనులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ప్రదర్శన అగ్రభాగాన వేలాదిమంది యువ రెడ్‌షర్ట్‌ వలంటీర్లు, యువ మహిళలు అరుణ పతాకాలతో ముందుకు సాగగా, ఆ తర్వాత వేలల్లో జనసేవాదళ్‌ కార్యకర్తలు కదంతొక్కారు. వారి వెనుక వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, కార్యకర్తలు వరుస క్రమంలో ప్రదర్శనలో పాల్గొన్నారు. మహిళలు దాదాపు 120 అడుగుల అతిపెద్ద బ్యానర్‌ను పట్టుకుని ’అప్‌ అప్‌ సోషలిజం…డౌన్‌ డౌన్‌ క్యాపిటలిజం’ అంటూ ప్రదర్శనలో పాల్గొనడం చూపరులను ఆకర్షించింది. ప్రదర్శన అగ్రభాగాన సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా, జాతీయ నాయకులు డాక్టర్‌ కె.నారాయణ, అతుల్‌ కుమార్‌ అంజన్‌, వినయ్‌ విశ్వం, పల్లవ్‌సేన్‌ గుప్త్తా, అమర్‌జిత్‌ కౌర్‌, బాలచందర్‌ కాంగో, ఎంపీ సంతోశ్‌ కుమార్‌, అనీ రాజా, చాడ వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏపీ పార్టీ సహాయ కార్యదర్శులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జేవీఎస్‌ఎన్‌ మూర్తి, రాష్ట్ర నాయకులు అక్కినేని వనజ తదితరులు నడవగా…నగర ప్రజానీకం రోడ్డుకు రెండువైపులా పెద్దసంఖ్యలో నిలబడి దారి పొడవునా పూలు చల్లుతూ స్వాగతం పలికారు. సింగ్‌నగర్‌ రింగు వద్ద సీపీఎం నాయకులు సౌహార్థ్ర స్వాగతం పలికి సంఫీుభావం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img