Friday, April 19, 2024
Friday, April 19, 2024

బొగ్గు రవాణా కోసం వ్యాగన్ల మరమ్మతులకు రూ.150 కోట్లు ఖర్చు..

న్యూదిల్లీ : విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గును సకాలంలో సరఫరా చేసేందుకు గత నాలుగు నెలలకు పైగా పాడైన, శిథిలమైన దాదాపు 2 వేల వ్యాగన్ల మరమ్మతులకు రైల్వేలు 150 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. జనవరిలో 9,982 వ్యాగన్లు దెబ్బతిన్నాయని, మే 2 నాటికి వాటి సంఖ్య 7,803కి తగ్గిందని వివరించింది. దేశంలో బొగ్గు డిమాండ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో సకాలంలో సరఫరా చేసేందుకు రైల్వేలు 2,179 వ్యాగన్లకు మరమ్మతులు చేయగలుగుతున్నాయని తెలిపాయి. ఒక్కో వ్యాగన్‌ను మరమ్మతు చేసేందుకు జాతీయ రవాణా సంస్థకు దాదాపు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. బొగ్గును దిగుమతి చేయడానికి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఉపయోగించే ప్రైవేటు కాంట్రాక్టర్లు జేసీబీలతో మనుషులతో దిగుమతికి ప్రత్యామ్నాయం చేయడం ప్రారంభించినప్పటి నుంచి వ్యాగన్లకు నష్టం వాటిల్లడం మంత్రిత్వ శాఖకు ఆందోళన కలిగించిందని ఆ వర్గాలు సూచించాయి. ‘జేసీబీలు వ్యాగన్ల లోపలి భాగాలను ఢీకొట్టి వాటిని తీవ్రంగా దెబ్బతీశాయి. గతంలో మనుషులతో దిగుమతి చేయగా, ఇప్పుడు జేసీబీల ద్వారా చేస్తుండడంతో పాడైన వ్యాగన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మేము వాటిని వేగంగా మరమ్మతులు చేస్తున్నాం. బొగ్గు కోసం వనరులను ఉపయోగిస్తున్నాం’ అని ఒక అధికారి తెలిపారు. కాగా ఈ మరమ్మతులు భారీవి, చిన్నపాటివి, స్థానికంగా నిర్వహించేలా మూడు రకాలుగా ఉంటాయి. దాదాపు 2,179 వ్యాగన్లను మరమ్మతు చేయడానికి రైల్వేలకు రూ.150 కోట్ల కంటే ఎక్కువ ఖర్చవుతుందని అంచనా వేశారు. జనవరి 1 నాటికి 9,982 వ్యాగన్లు పాడైపోయినట్లు చూపించగా, జనవరి 6 నాటికి వాటి సంఖ్య 10,687కి పెరిగిందంటే జనవరిలోనే ఇంత నష్టం వాటిల్లిందని గణాంకాలు చెబుతున్నాయి. జనవరి 11న దెబ్బతిన్న వ్యాగన్ల సంఖ్య 9,839 కాగా, జనవరి 21న 9,097. ఫిబ్రవరి 11 నాటికి 7,267కి తగ్గగా, మే 2 నాటికి 7,531కి పెరిగిందని వివరించింది. ఇలాంటి వ్యాగన్ల మరమ్మతుల కోసం రైల్వే ఐదు కొత్త మరమ్మతు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్‌ సంక్షోభం, బొగ్గు రవాణా కోసం ఒత్తిడి తీవ్రమవడంతో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా ప్రభావితం కాకుండా మరమ్మతులు చేయడానికి రైల్వేలు ముందుకు వచ్చాయి. అయితే, పరిస్థితిని సమీక్షించడానికి ఇటీవల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈసీవోఆర్‌, ఈసీఆర్‌, డబ్ల్యూసీఆర్‌, ఎస్‌ఈసీఆర్‌ వంటి జోన్‌ల అధికారులు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు తరలింపు సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. బొగ్గు క్షేత్రాల వద్ద నిల్వ అందుబాటులో లేకపోవడంతో బొగ్గు ఎగుమతి కోసం వేచి ఉన్న వ్యాగన్ల టర్నోవర్‌ సమయం ఏడు రోజుల నుంచి 15-20 రోజులకు పెరిగిందని ఆ వర్గాలు చెబుతున్నాయి. బొగ్గును తరలించడానికి రైల్వేలు దాదాపు 40 నుంచి 50 దెబ్బతిన్న వ్యాగన్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన పరిస్థితి ఉన్నట్లు వివరించాయి. బొగ్గు రైలులో సాధారణంగా 84 వ్యాగన్లు ఉంటాయి. బొగ్గు రేక్‌ల కదలికను వేగవంతం చేయడానికి, రైల్వేలు రేక్‌ల నిర్వహణ వ్యవధిని కూడా 2,500 కి.మీ పెంచినట్లు అధికారులు తెలిపారు. అంటే ప్రతి 7,500 కి.మీ తర్వాత పాడైపోయిన, శిథిలమైన రేక్‌లకు ఇంతకుముందు మరమ్మతులు చేసిన వాటిని ఇప్పుడు 10 వేల కిలోమీటర్ల తర్వాత గ్యారేజీకి పంపినట్లు అధికారులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో విద్యుత్‌ సంక్షోభం నేపథ్యంలో బొగ్గు రేక్‌ల రవాణా కోసం భారతీయ రైల్వే ఇప్పటివరకు దాదాపు 40 రైళ్లను రద్దు చేసింది. జాతీయ రవాణా సంస్థ తన రోజువారీ బొగ్గు రేక్‌ల (సరుకు రైలు) సగటు లోడ్‌ను రోజుకు 400కు పైగా పెంచిందని, ఇది గత ఐదేళ్లలో అత్యధికమని అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. అయితే దీని వల్ల ప్రయాణికుల రైళ్లు రద్దు, అలాగే ఆలస్యమయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img