Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

బ్యాంకుల పారుబకాయిలు రూ.10 లక్షల కోట్లపైనే

అసోచామ్‌, క్రిస్టల్‌ సర్వేలో వెల్లడి

న్యూదిల్లీ : 2021 ఆర్థిక సంవత్సరం చవరి నాటికి దేశంలోని వివిధ బ్యాంకులకు చెందిన నిరర్దక ఆస్తుల విలువ రూ. 10 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. ఈ మేరకు భారత పరిశ్రమల సమాఖ్య అసోచామ్‌, క్రిస్టిల్‌ అనే రేటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా ‘రీ ఇన్ఫోర్సింగ్‌ ది కోడ్‌’ అనే పేరుతో నిర్వహించిన తాజా అధ్యయనాన్ని మంగళవారం వెల్లడిరచాయి. ఈ అధ్యయనం ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో చిన్న చిన్న లోన్లు తీసుకున్న వారు, అందులోనూ ప్రత్యేకించి ఎంఎస్‌ఎంఈ, రిటైల్‌ రంగాలకు చెందిన వారి నుంచి ఈ మొండి బకాయిలు పెరుగనున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో నాన్‌ ఫర్మార్మింగ్‌ అసెట్‌ (ఎన్‌పీఏ) 8.5-9 శాతానికి పెరుగుతాయని అంచనా వేసింది. ఇది కొన్ని సంవత్సరాల కిందటితో పోల్చి చూస్తే చాలా భిన్నంగా ఉందని తెలిపింది. ఎంఎస్‌ఎంఈలకు చిన్న రుణగ్రహీతల కోసం ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పునర్నిర్మాణ పథక మారిటోరియం, అత్యవసర క్రెడిట్‌ లైన్‌ హామీ పథకం ఎన్‌పీఏలను ఎక్కువగా పెరగకుండా నిరోధించినప్పటికీ, గతంలో ఆస్తులను తనఖా పెట్టి లోన్లు పొందిన చిన్న చిన్న సంస్థలు కరోనా మహమ్మారి నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు గురికావడం, ఆస్తుల విలువ ఒత్తిడికి లోనవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు ఆ సర్వేలో తెలిపింది. కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పటికీ కొనసాగుతున్న దశలో ఎన్‌పీఏలు పెరుగకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవడం అసంభవమేనని అధ్యయనం తెలిపింది. ఏదేమైనా 2018 నుంచి బ్యాంకుల్లో గరిష్ట స్థాయి ఎన్‌పీఏలు నమోదవడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఉద్ధేశ పూర్వక ఎగవేత దారుల విషయంలో అప్పటికి రుణదాతలకు అనుకూలం కాని నిబంధనలు మారుస్తూ , ఆస్తి రిజల్యూషన్‌ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎక్కువ సంఖ్యలో ఉద్దేశపూర్వక రుణాల ఎగవేతదారులను గుర్తించి వారి నుంచి రికవరీ చేయడానికి అవకాశం లభించింది. ఇది ఎన్‌పీఏ విషయంలో మెరుగైన రికవరీకి దోహదపడినట్టు ఆ అధ్యయనం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img