Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

బ్రిటన్‌ ప్రధాని ట్రస్‌ రాజీనామా

లండన్‌: యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (బ్రిటన్‌) ప్రధానమంత్రి లిజ్‌ట్రస్‌ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ట్రస్‌ ప్రధానమంత్రిత్వ పదవి ప్రారంభమైన కొద్దిరోజులకే ‘మూడునాళ్ల ముచ్చట’గా ముగిసింది. ఎలిజబెత్‌ రాణి`2కి 10రోజుల సంతాపదినాలను తీసేస్తే, తన ఆర్థికమంత్రి క్వాసి క్వార్టెంగ్‌ని పదవి నుండి తొలగించడానికి దారి తీసిన ట్రస్‌ రాజకీయ కార్యక్రమ విస్ఫోటనానికి ముందు కేవలం వారం రోజులు మాత్రమే అధికారంలో ఉన్నారు. మొత్తంగా ప్రధానమంత్రిగా ఎన్నికైన తరువాత కేవలం 45రోజులు మాత్రమే ఆమె అధికారంలో కొనసాగారు.
‘‘నేను ఒక యోధురాలిని… వైదొలిగే దాన్ని కాదు’’ అని అన్న 24 గంటల్లోపే ట్రస్‌ తన రాజీనామా ప్రకటించారు. ట్రస్‌తో భావసారూప్యత గల వ్యక్తిగా చూడబడిన క్వార్టెంగ్‌, వచ్చే 6 మాసాల్లో 6,700 కోట్ల డాలర్లతో ఇంధన పథకం ధరను వివరిస్తూ ‘మినీ బడ్జెట్‌’ను ప్రకటించారు. అయితే నిధుల సమీకరణ చర్యలు మాత్రం ఆయన వద్ద లేవు. దాంతో రాజకీయ అగ్గిరాజుకొని ఆయన పదవీచ్యుతికి దారి తీసింది.
ట్రస్‌ బ్రిటన్‌ ఎన్నికల్లో 81,326 మంది కన్జర్వేటీవ్‌ సభ్యుల ఓట్లతో విజయం సాధించారు. ఆమె ప్రత్యర్థి భారత సంతతికి చెందిన రిషి సునాక్‌కు 60,399 ఓట్లు వచ్చాయి.
తన ఆర్థిక కార్యక్రమం మార్కెట్లో ప్రకంపనలు సృష్టించినందున, తన నియామకం ఆరు వారాల అనంతరం తన కన్జర్వేటీవ్‌ పార్టీలో విభజన చోటు చేసుకున్నందున ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత నెల ప్రకటించిన విధ్వంసకర ఆర్థిక ప్రణాళిక ఆర్థిక గందరగోళాన్ని, రాజకీయ సంక్షోభాన్ని సృష్టించింది. బ్రిటన్‌ చరిత్రలో అతి తక్కువకాలం ప్రధానిగా ఉన్న వ్యక్తి ట్రస్‌.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img