Friday, April 19, 2024
Friday, April 19, 2024

భారతావనికే గౌరవ చిహ్నం విశాఖ ఉక్కును కాపాడుకుందాం

ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టడమే మోదీ లక్ష్యం
రాజకీయ విభేదాలు పక్కన పెట్టి ఉక్కు పరిరక్షణ ఉద్యమం
సీపీఐ పాదయాత్ర ముగింపు, బహిరంగ సభలో బినయ్‌ విశ్వం పిలుపు
లాభాల్లో ఉంటే అమ్మేస్తారా? : కె.నారాయణ
మా పోరు ఆగదు : కె.రామకృష్ణ

విశాలాంధ్ర ` గాజువాక/కూర్మన్నపాలెం : విశాఖ ఉక్కు కర్మాగారం భారతావనికే గౌరవ చిహ్నమని, ఎన్ని పోరాటాలు చేసైనా… దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై వుందని సీపీఐ రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ కార్యదర్శి బినయ్‌ విశ్వం అన్నారు. ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీసే ప్రయత్నాలలో భాగంగానే ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో మోదీ సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ, కార్పొరేట్లకు దాసోహమై ఆస్తుల అమ్మకానికి పాల్పడుతూ గౌరవచిహ్నాలన్నింటినీ చెరిపేస్తున్నారని ఆక్షేపించారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, పెంచిన విద్యుత్‌ చార్జీల రద్దు, మూడు వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు కోసం సిపిఐ అధ్వర్యంలో జరిగిన పాదయాత్ర మంగళవారంనాడు విశాఖపట్నంలో ముగిసింది. అనంత పురం, శ్రీకాకుళం జిల్లాల్లో వేర్వేరుగా ప్రారంభమైన పాదయాత్రలు విశాఖకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్త ప్రచార పాద యాత్ర ముగింపు సందర్భంగా గాజువాక పారిశ్రామిక ప్రాంతం జింక్‌ గేటు నుండి కూర్మన్నపాలెం కూడలి వరకూ పాదయాత్ర నిర్వహిం చారు. వందలాది మందితో జరిగిన భారీ ప్రదర్శన అనంతరం కూర్మన్నపాలెం కూడలిలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బినయ్‌ విశ్వం ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. స్వతంత్ర భారతదేశంలో కనీవినీ ఎరుగని రీతిలో దేశంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, మతోన్మాద, విచ్ఛిన్నకర విధానాలు అమలవుతున్నాయని విమర్శించారు. అందులో భాగంగానే విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తూ ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. మొత్తం ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టడమే మోదీ లక్ష్యమన్నారు. వ్యూహాత్మక పెట్టుబడులు అంటే ప్రభుత్వ రంగ ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టడమా అని బినయ్‌ విశ్వం ప్రశ్నించారు. అంబానీ, అదానీలకు సేవచేయడం తప్ప కేంద్రానికి ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. వాజ్‌పేయి హయాంలోనే ప్రైవేటీకరణకు బీజం పడిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, లాభాల్లో ఉంటే తప్ప ప్రైవేటువ్యక్తులు ప్రభుత్వ ఆస్తులను ఎందుకు కొంటారని నిలదీశారు. విశాఖ ఉక్కుకు చెందిన అత్యంత అమూల్యమైన భూమిపై ఆశతోనే ఈ ప్రైవేటీకరణ జరుగుతోందన్నారు. పోరాటం చేసి దీన్ని ఆపకపోతే హిందూస్థాన్‌ జింక్‌కు పట్టిన గతే విశాఖ ఉక్కుకు కూడా పడుతుందని హెచ్చరించారు. తప్పుడు పద్ధతులతో అమ్మితే ఊరుకోమని హెచ్చరించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని బీజేపీ దెబ్బతీస్తున్నదని అన్నారు. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి, ఉక్కుపరిరక్షణకు అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలని కోరారు. దేశ సంపదను కాపాడుకునే దిశగా కదం తొక్కుదామని పిలుపు నిచ్చారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు చారిత్రక నిర్మాణమన్నారు. లాభాల్లో ఉన్నదాన్ని అమ్మాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ప్రజల చేస్తున్న పోరాటంలో ఉక్కు సంకల్పం గొప్పదన్నారు. కేంద్రంలో నిర్మలాసీతారామన్‌ మాటలు, సమర్ధించే వాదనలు సరికాదని ఖండిరచారు. 222 రోజులు నిర్విరామంగా సాగుతున్న దీక్షలపై కేంద్రం స్పందించక పోవడం శోచనీయం అన్నారు. నాణ్యత, లాభాల్లో విశాఖ స్టీల్‌ అగ్రగామిగా వుందని చెప్పిన కేంద్ర మంత్రి దీని అమ్మకానికి ఎలా ఒడిగడుతున్నారని అన్నారు. ఇద్దరు వ్యక్తులు తలచుకుంటే ఇట్టే సమసిపోయే సమస్య ఇది అని అన్నారు. తెలుగు బిడ్డ, సాధించగల సమర్ధుడు, శాసించే స్థాయిలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక్క మాట చెబితే ఉద్యమం ఆగిపోతుందని చెప్పారు. అలాగే మరో వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. యువకుడైన సీఎం జగన్‌ నాయకత్వంలో అన్ని రాజకీయ పక్షాలు కలసి వెళ్లగలిగితే విశాఖ ఉక్కు పరరిక్షణ సాధ్యమయ్యే వ్యవహారమన్నారు. ప్రత్యేక హోదా ఊసేలేదని, పౖెెగా రెండో మోసం విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ అని మండి పడ్డారు. వీటిని సరిదిద్దకపోతే తెలుగు ప్రజలను మోసం చేసిన వారిగా చరిత్ర హీనులుగా మిగిలిపోతారని నిందించారు. సీఎం జగన్‌ దిల్లీలో ఒక మాట, విశాఖలో ఒక మాట చెపితే ప్రజలు విశ్వసించబోరని, వైసీపీ ఎంపీలందరినీ తీసుకువెళ్లి మోదీ ముందు ధర్నా చేయించాలని డిమాండ్‌ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలు పోరాటాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడాలన్నారు. విశాఖ ఉక్కు కోసం పోరాటం చేస్తున్నామన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ 13 జిల్లాల్లో కూడా పాదయాత్రలు చేసింది సీపీఐ మాత్రమే అన్నారు. 222 రోజులుగా పోరాటం జరుగుతోందన్నారు. ఇక్కడ విశాఖ ఉక్కుపై పోరాటం చేస్తుంటే పక్కన గంగవరం పోర్టును ప్రయివేటు వాళ్లకే అప్పగిస్తారా? అని ప్రశ్నించారు. 1800 ఎకరాల భూమి విలువ కేవలం రూ.640 కోట్లా? ఇది దోపిడీ కాదా? అని నిలదీశారు. దోపిడి జరుగుతోంది.. లక్షలు కోట్లు దేశ సంపద కార్పొరేట్‌ శక్తులకు అప్పగిస్తున్నారు. ఇది సరికాదని మోదీ సర్కారు చర్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 27న భారత్‌ బంద్‌కు వైసీపీ, టీడీపీ సహా అన్ని పక్షాలు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా దేశ రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టాలని పిలుపు నిచ్చారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ విశాఖతోపాటు ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక అతిపెద్ద పరిశ్రమ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అన్నారు. పలు పోరాటాల ద్వారా విశాఖ ఉక్కును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర్ర ప్రజలపై వుందని అన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు సిద్ధమవుతోందని అన్నారు. ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు డి.ఆదినారాయణ మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పోరాటాల ద్వారా వచ్చిందని, దీనికోసం 32 మంది ప్రజలు తమ ప్రాణాలను బలిదానం చేశారని గుర్తు చేశారు. ఇప్పటికే 8 వేల మంది ఉక్కు నిర్వాసితులకు ఉపాధి లేక దయనీయ స్థితిలో తమ జీవితాలను గడుపుతున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమగా వుంటేనే నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య, పి.హరినాథరెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏజే స్టాలిన్‌, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జేవీ ప్రభాకర్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, నగర కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఏ.విమల, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పొత్తిక సత్యనారాయణ, కసిరెడ్డి సత్యనారాయణ, కె.సత్యాంజనేయ, ఎల్లేటి శ్రీనివాస్‌రావు, టి.కనకరాజు, సీపీఐ విజయనగరం జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి సనపల నరసింహులు, ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, అల్లు బాబూరావు, ఏపీ మహిళా సమాఖ్య నాయకులు బూసి పరమేశ్వరి, ఎంఏ బేగమ్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాజాన దొరబాబు, రైతు సంఘం నాయకులు రావు జగ్గారావు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్లు జె.అయోధ్యరాము, జి.వెంకటరావు, కె.సత్యనారాయణ, పోరాట కమిటీ నాయకులు జి.బోసుబాబు, మంత్రి రాజశేఖర్‌, ఎల్లిపోగుల మస్తానప్ప, విళ్లా రామమోహన్‌కుమార్‌, వరసాల శ్రీనివాసరావు, దొమ్మేటి అప్పారావు, పి.పెద్దిరాజు, డీఎన్‌ రెడ్డి, ఎ.మసేన్‌రావు, జె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img