Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

భారాలపై నిరసన

నేడు లెఫ్ట్‌ ఆందోళనలు

రాష్ట్రవ్యాప్త నిరసనలను జయప్రదం చేయండి
రామకృష్ణ విజ్ఞప్తి

విశాలాంధ్రబ్యూరో`కర్నూలు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా ప్రజలపై భారాలు మోపుతున్నాయని, ఇందుకు నిరసనగా 28న(గురువారం) 10 వామపక్షపార్టీల అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. సీఆర్‌ భవన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. పెట్రోల్‌, డీజీల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర సరుకులను సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడిరదని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు, ఆస్తిపన్నులు, చెత్తపన్నులు విపరీతంగా పెంచారని రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రప్రభుత్వం ఎయిడెడ్‌ పాఠశాలలను మూసివేసే ప్రయత్నం చేస్తున్నదని, ఇప్పటికే కాకినాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారని చెప్పారు. ‘మాకు అమ్మఒడి వద్దు, బూట్లు, బెల్టులు వద్దు. మా పాఠశాలలు మూసివేయ వద్దు’ అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారన్నారు. ఎయిడెడ్‌ పాఠశాలలకు చెందిన ఖరీదైన భూములపై జగన్‌ దృష్టిపడటంతోనే ఇటువంటి కార్యక్రమం చేపట్టారన్నారు. రాష్ట్రప్రభుత్వం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిందని, కనీసం జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలతో కలసి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని రామకృష్ణ హెచ్చరించారు. ఎయిడెడ్‌ పాఠశాలల రద్దుపై అన్ని రాజకీయపార్టీలు, విద్యార్థి సంఘాలతో రాష్ట్రప్రభుత్వం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహి ంచాలని డిమాండు చేశారు. అందరి అభిప్రాయాలను పరిశీలించి…నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కేసీఆర్‌ ఆంధ్రలో పార్టీపెడతానని అంటున్నారని, ఆయన పార్టీ పేరు ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రసమితి పేరుతో ఆంధ్రలో పార్టీ పెడతాననడాన్ని ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై నిత్యం సమస్యలు సృష్టించే కేసీఆర్‌…ఏపీలో పార్టీ ఎలా పెడతారని ప్రశ్నించారు. కేసీఆర్‌ పగటి కళలు మానుకోవాలని, ఆంధ్రులు పిచ్చోళ్లు కాదన్నారు. ఈనెల 28న వామపక్షపార్టీల అధ్వర్యంలో చేపట్టే నిరసనలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలన్నారు. ఏపీ చేతివృత్తి సంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌ కె.రామాంజనేయులు, సీపీఐ కర్నూలు జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, సహాయ కార్యదర్శి ఎస్‌ఎన్‌ రసూల్‌ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img