Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

భారీ వర్షంలోనూ….

29 గ్రామాలు కాదు.. 26 జిల్లాల అభివృద్ధి కావాలంటూ నినాదాలు
విశాఖ గర్జనతోనైనా బాబు, పవన్‌లకు కనువిప్పు కలగాలి

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: వికేంద్రీకరణ కోసం జోరువానలోనూ ఉత్తరాంధ్ర గర్జించింది. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని కోరుతూ ఉత్తరాంధ్ర ప్రజలు తమ పోరాట స్ఫూర్తిని ఉవ్వెత్తున చాటారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన జనంతో విశాఖ జన సంద్రమైంది. ఒకవైపు జోరు వాన, మరోవైపు ఉత్తరాంధ్ర ప్రజల గర్జన తోడై, ‘జై విశాఖ.. జైజై విశాఖ…’ అన్న నినాదాలు ప్రతిధ్వనించాయి. విశాఖలోని ఎల్‌ఐసీ బిల్డింగ్‌ దగ్గర అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి బీచ్‌ రోడ్డులోని వైఎస్‌ఆర్‌ విగ్రహం వరకు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు, జోరు వర్షంలోనూ రెండున్నర గంటలపాటు భారీ ఎత్తున ర్యాలీ చేశారు. ‘దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్ర ప్రజలపై అమరావతి యాత్రల పేరుతో దండయాత్రలు చేస్తే ఉప్పుపాతరేస్తాం’ అంటూ ర్యాలీలో ఉత్తరాంధ్ర ప్రజలు గర్జించారు. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఏర్పాటైన జేఏసీ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో ప్రజా ప్రతినిధులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు, యువజన సంఘాల నేతలు పాల్గొని విశాఖే పరిపాలనా రాజధానిగా చేయాలని నినదించారు. అక్కడ వైఎస్‌ఆర్‌ విగ్రహానికి నేతలు నివాళి అర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ లజపతిరాయ్‌ మాట్లాడుతూ వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి కోసం న్యాయంగా చేస్తున్న తమ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకాలని కోరారు. ఇప్పటికే మూడుసార్లు మన రాష్ట్రాన్ని విభజించారని, మళ్లీ అమరావతే ఏకైక రాజధాని అయితే, భవిష్యత్తులోనూ ఈ పరిస్థితి పునరావృతమవుతుందని హెచ్చరించారు. ఈ సభలో జేఏసీ కో కన్వీనర్‌ దేవుడు తదితర నేతలతో పాటు, శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌చార్జ్‌ వైవీ సుబ్బారెడ్డి, నగర మేయర్‌ హరి వెంకట కుమారి, రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌, బూడి ముత్యాలనాయుడు, కారుమూరి నాగేశ్వరరావు, బుగ్గన రాజేంద్రనాధ్‌, జోగి రమేశ్‌, ఆర్కే రోజా, మేరుగు నాగార్జున, విడదల రజని, మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్‌, కొడాలి నాని, పేర్ని నాని, ధర్మాన కృష్ణదాస్‌, కురసాల కన్నబాబు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేధావులు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు పెద్దఎత్తున పాల్గొని తమ గళాన్ని గట్టిగా వినిపించారు. జోరు వానలోనూ కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
పోరాడి చద్దాం: తమ్మినేని
ఈ ప్రాంతం ఇంతకాలంగా పాలనాపరమైన వివక్షతకు గురవ్వడం వల్లే వెనుకబాటుతనానికి గురైంది. ఉద్యమాలకు పురిటిగడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం నాడు ఉద్యమాలు జరిగితే.. ఈరోజు మళ్లీ మన బతుకుల బాగు కోసం విశాఖే పరిపాలనా రాజధానిగా ఉండాలని ఉద్యమి స్తున్నాం. ఆకలి మంటలతో చచ్చే బదులు పోరాడి చద్దాం. మొలతాడు కట్టిన ప్రతి పురుషుడు, తాళి ఉన్న ప్రతి మహిళ, మీసం ఉన్న ప్రతి యువకుడు కదనరంగంలోకి దిగాలి.
జగన్‌ ఉండగా మనకెందుకు భయం: మంత్రి ధర్మాన
మన ప్రాంతానికి ఉద్యోగాలు రాకుండా, ఉపాధి లేకుండా, పరిశ్రమలు రాకుండా చేసినందుకు, 130 ఏళ్ల నుంచి వస్తున్న వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా ఉత్త రాంధ్ర ప్రజలు ఈరోజు గర్జించారు. భవిష్యత్తులో మరింత గట్టిగా రాజకీయ పోరాటం చేద్దాం. ఉపాధ్యా యులు, న్యాయవాదులు, మేధావులు మన స్థానిక వాదాన్ని బలంగా దేశం అంతటికీ వినిపించేలా తీసుకెళ్లాలి. జగన్‌ ఉండగా మనకెందుకు భయం.
త్వరలో విశాఖ నుంచే పాలన : వైవీ సుబ్బారెడ్డి
అన్ని ప్రాంతాలను సమగ్రాభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ సంకల్పిస్తే అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని, ఆ ప్రాంతంలో తమ భూముల రేట్లు పెంచుకుని దోచుకోవాలని టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు చూస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయం మేరకు మూడు రాజధానుల నిర్మాణం చేసుకుందాం. విశాఖ నుంచే జగన్‌ త్వరలో పరిపాలన సాగిస్తారు. పాదయాత్ర పేరుతో ఈ ప్రాంతంపై దండయాత్ర చేస్తున్న వారు, ఆ దండ యాత్రకు మద్దతిస్తున్న టీడీపీ, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌లను నిలదీయాలి. మీ ప్రాంతంలో శాసన రాజధాని ఏర్పాటు చేస్తే మేం అడ్డుపడటం లేదు, మరి మీరెందుకు విశాఖ పరిపాలనా రాజధానికి అడ్డు పడుతున్నారని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి.
420 చంద్రబాబు: కొడాలి నాని
హైదరాబాద్‌లో జరిగినట్టే, రాష్ట్ర సంపదనంతా ఒకే చోట అమరావతిలో ఖర్చు చేశాక, మిగతా ప్రాంతాల్లో ఉద్యమాలు వస్తే దానికి ఎవరు బాధ్యులు. ప్రజల మద్దతు ఎవరికి ఉందో విశాఖ గర్జన చూశాక అయినా, చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు తెలుసుకోవాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img