Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మంకీపాక్స్‌పై అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం..మార్గదర్శకాలు జారీ

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 50దేశాల్లో మంకీపాక్స్‌ వైరస్‌ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మనదేశంలో మంకీపాక్స్‌ తొలికేసు నమోదడంతో.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల వివరాలు సేకరించాలని.. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ఈ వైరస్‌ గురించి అధికారులతో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో మంకీపాక్స్‌ టెస్టులు చేయాలని ఆదేశించారు. పూణె వైరాలజీ ల్యాబ్‌ నుంచి టెస్టింగ్‌ కిట్లను తెప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కిట్లు రాగానే ట్రయల్‌ రన్స్‌ ప్రారంభించనున్నారు. కరోనా ఆర్టీపీసీఆర్‌ టెస్టుల లాగానే మంకీపాక్స్‌ టెస్టులు చేయనున్నట్టు వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.తెలంగాణలో మంకీపాక్స్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు. ఈ వైరస్‌ వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అంతర్జాతీయ ప్రయాణికులు జ్వరం, జలుబు ఉన్న వాళ్లతో సన్నిహితంగా ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎలుకలు, వన్యప్రాణులు, ఉడుతలు ఇతర జీవులకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించిన, కేసు నమోదైన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగినవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.మంకీపాక్స్‌పై ఏమైనా అనుమానాలు ఉంటే 9030227324 నంబరుకు వాట్సప్‌ ద్వారా సమాచారాన్ని పంపవచ్చు. నేరుగా కాల్‌ చేయాలనుకుంటే 040 24651119 నంబరుకు ఫోన్‌ చేయాలని ప్రజారోగ్య సంచాలకుడు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img