Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మణిపూర్‌లో ఉగ్రఘాతుకం

సైనిక కాన్వాయ్‌పై మెరుపుదాడి
అసోం రైఫిల్స్‌ కల్నల్‌ కుటుంబం సహా ఏడుగురు మృతి
ప్రధాని, రక్షణమంత్రి సహా అగ్రనేతల ఖండన

ఇంఫాల్‌ : మణిపూర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. సైనిక కాన్వాయ్‌పై మెరుపుదాడి చేశారు. ఐఈడీలు పేలడంతో అసోం రైఫిల్స్‌ కల్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితో పాటు నలుగురు పారామిలటరీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఉదయం 10 గంటల సమయంలో చురాచంద్‌పూర్‌ జిల్లా సెహకన్‌ గ్రామం వద్ద అసోం రైఫిల్స్‌కు చెందిన కాన్వాయ్‌పై దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు. పీపుల్స్‌ రివల్యూషనరీ పార్టీ ఆఫ్‌ కంగ్లీపాక్‌ (ప్రీపాక్‌) ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తంచేశారు. సెహకన్‌ గ్రామం సమీపంలో అసోం రైఫిల్స్‌ కల్నల్‌ కాన్వాయ్‌పై భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు దాడిచేశారని పోలీసులు తెలిపారు. చురచందాపూర్‌ జిల్లాలో పౌర కార్యాచరణను పరిశీలించడానికి జవాన్లు వెళుతుండగా ఈ దాడి జరిగిందని, ఇది తమ పనేనని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదన్నారు. కల్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి శుక్రవారం బెహియాంగ్‌ కోయ్‌ పోస్ట్‌ను సందర్శించి, రాత్రి అక్కడే బస చేశారు. శనివారం కుటుంబసభ్యులతో కలిసి తిరుగు ప్రయాణం అయ్యారు. బెహియాంగ్‌ పోలీస్‌ స్టేషన్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలోని బెహియాంగ్‌ సమీపంలో ఉగ్రవాదుల ఆకస్మిక దాడి జరిగినట్లు మణిపూర్‌ పోలీసులు తెలిపారు. ‘కల్నల్‌ త్రిపాఠి ఎస్కార్ట్‌ వాహనంపై గుర్తు తెలియని అండర్‌గ్రౌండ్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ మెరుపుదాడి చేసింది’ అని మణిపూర్‌ పోలీసు ప్రతినిధి తెలిపారు. దీంతో కల్నల్‌ త్రిపాఠి, ఆయన భార్య, ఆరేళ్ల కుమారుడు చనిపోయారు. మరో ఐదుగురు జవాన్లు గాయపడగా వారిని బెహియాంగ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు అసోం రైఫిల్స్‌ పేర్కొంది.
ఇది పరికిపంద చర్య : మోదీ, రాజ్‌నాథ్‌
సైనిక కాన్వాయ్‌పై దాడిని ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఖండిరచారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. సీఓ 46 ఏఆర్‌, ఆయన ఇద్దరు కుటుంబ సభ్యులు, మరో ఐదుగురు వీరజవాన్లను దేశం కోల్పోయిందన్నారు. అసోం రైఫిళ్లపై దాడి పిరికిపంద చర్య అని ట్వీట్‌ చేశారు. వీరజవాన్ల త్యాగాలను దేశం మరువదని పేర్కొన్నారు.
దోషుల్ని శిక్షిస్తాం : బిరేన్‌ సింగ్‌
సైనికులపై దాడికి పాల్పడిన కుట్రదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మణిపూర్‌ ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ అన్నారు. ఉగ్రవాదుల కోసం రాష్ట్ర పోలీసులు, పారా మిలటరీ దళాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఘటనకు పాల్పడినవారిని శిక్షించి బాధితులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు.
మోదీ ప్రభుత్వ అసమర్థత బహిర్గతం : కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆపార్టీ నేతలు అశోక్‌ గెహ్లాట్‌, జైరాం రమేశ్‌ తదితరులు కూడా ట్విట్టర్‌ మాధ్యమంగా తమ సంతాపాన్ని ప్రకటించారు. అసోం రైఫిల్స్‌ కాన్వాయ్‌పై దాడి పిరికిపంద చర్య అని, అమరులకు విప్లవాంజలి అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ఘటన తమనెంతో బాధించిందని, ఇందుకు కారణమైన వారిని ఉపేక్షించరాదన్నారు. దేశాన్ని కాపాడలేని మోదీ ప్రభుత్వ అసమర్థత మరోమారు రుజువు అయిందని రాహుల్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మీ త్యాగ్యాన్ని దేశం మరువదని రాహుల్‌ గాంధీ హిందీలో ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img