Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మతోన్మాదంపై కళారూపాలతో యుద్ధం

. సాంస్కృతిక సమైక్యతకు కృషి: రాకేశ్‌ పిలుపు
. ఉత్సాహపూరితంగా ఇఫ్టా జాతీయ మహాసభలు

డెల్టాన్‌ గంజ్‌ నుంచి చంద్రానాయక్‌
జార్ఖండ్‌ రాష్ట్రం డెల్టాన్‌ గంజ్‌ పట్టణంలో కళాకారుల కోలాహలం మధ్య ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్‌ (ఇఫ్టా) 15వ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. స్థానిక టౌన్‌హాల్‌లో ఈ మహాసభలు జరుగుతున్నాయి. తొలుత ఇఫ్టా జెండాను సమీక్‌ బందోపాధ్యాయ ఆవిష్కరించారు. అనంతరం అమర కళాకారుల స్తూపం వద్ద నివాళులర్పించిన తరువాత ప్రతినిధుల మహాసభ ప్రారంభమైంది. సమీక్‌ బందోపాధ్యాయ, తన్వీర్‌ అక్తర్‌, హిమన్సు, సీతారాం సింగ్‌, టీవీ బాలన్‌ చక్రవర్తి అధ్యక్ష వర్గంగా వ్యవహరిస్తున్నారు. ఇఫ్టా జాతీయ ప్రధాన కార్యదర్శి రాకేశ్‌, ప్రముఖ దర్శకులు, నటులు ప్రసన్న తదితరులు ఇఫ్టా కర్తవ్యాలను, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రాకేశ్‌ మహాసభలను ప్రారంభిస్తూ, దేశంలో ప్రజా సాంస్కృతిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసి, దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలు, రైతు కూలీల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజలను జాగృతం చేసే కళారూపాలతో ప్రజా సాంస్కృతిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలాంటి మతోన్మాదుల చర్యలను తిప్పి కొట్టి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి ప్రజా పోరాటాలు నిర్మించేటట్టుగా కళారూపాలు తయారుచేయాలన్నారు. ఆ పోరాటాలలో కళాకారులు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని రాకేశ్‌ పిలుపునిచ్చారు ప్రముఖ దర్శకులు ప్రసన్న మాట్లాడుతూ రామరాజ్యం పేరుతో ప్రజల మధ్య మత కుల అంతరాలు తీసుకొచ్చి ప్రజలను మోసగిస్తున్న తీరును కళాకారులు ఎండగట్టాలన్నారు. ఇందులో యువకులను ముందుకు తీసుకురావాలన్నారు. వారికి కళా రంగంలో శిక్షణనిచ్చి ప్రజల్లోకి వెళ్లేటట్టుగా కృషి చేయాలన్నారు. దేశంలో రచయితలు, కళాకారులపై జరుగుతున్న దాడులను తిప్పి కొట్టాలన్నారు.
కళాకారుల భారీ ర్యాలీ
అనంతరం దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన జానపద, గిరిజన, ఆదివాసీ, ఇతర కళాకారులు డెల్టాను గంజ్‌ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తమ ఆటపాటలతో పుర ప్రజలను ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి కళాకారులు డప్పు వాయిద్యాలతో, ఆటపాటలతో ర్యాలీలో ప్రత్యేకంగా నిలిచారు. కళాకారుల ర్యాలీ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక ప్రజానికం కళాకారులకు అడుగడుగున స్వాగతం పలకడంతో పాటు మంచినీళ్లు, అల్పాహారం, కూల్‌ డ్రిరకులు, బిస్కెట్లు తదితర ఆహార పదార్థాలను అందించారు. దాదాపు 5 కిలోమీటర్లకు పైగా నగరంలో కళాకారులు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం డెల్టాన్‌ గంజ్‌ శివాజీ మైదానంలో బహిరంగ సభ జరిగింది. అనంతరం ఒడిశా, బీహార్‌, చత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు నృత్య ప్రదర్శనలు, అభ్యుదయ గేయాలాపన చేశారు అభ్యుదయ రచయితల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్‌ సింగ్‌, డాక్టర్‌ అరుణ్‌ శుక్లా, ప్రేమ్‌ బసీన్‌, కవిత రానా, జోత్స్నా, మితలేష్‌, రవీందర్‌, గని, చంద్ర నాయక్‌, పెంచలయ్య, రామకృష్ణ, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. రెండవ రోజు టౌన్‌ హాల్‌లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి శాస్త్రీయ విధానం వ్యవసాయ సంక్షోభం ఆర్థిక స్వాతంత్రం మతపరమైన విధానం వాతావరణం లింగభేదంతో పాటు సాంస్కృతిక విధానం మీద చర్చలు జరిగాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img