Friday, April 19, 2024
Friday, April 19, 2024

మత్తు పదార్ధాల సరఫరా కేంద్రాలుగా అదానీ పోర్టులు

. జానెడు ఇచ్చి… బారెడు లాక్కొంటున్న జగన్‌
. బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలను సాగనంపే వరకు పోరాటం
. తిరుపతి ప్రచారభేరి బహిరంగ సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ

విశాలాంధ్ర బ్యూరో – తిరుపతి: గంజాయి, మత్తు పదార్థాల సరఫరాకు కేంద్రాలుగా అదానీ పోర్టులు మారిపోయాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ ధ్వజమెత్తారు. సంపద మొత్తం కోటీశ్వరుల చేతికి వెళ్లిపోతోందన్నారు. శుక్రవారం సాయంత్రం తిరుపతి నగరంలో ప్రచార భేరిలో భాగంగా సీపీఐ, సీపీఎం అధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరయిన ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర 410 రూపాయలు ఉండగా బీజేపీ ఆందోళన చేసిందని… నేడు మోదీ హయాంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,200 రూపాయలకు చేరిందని తెలిపారు. ఎన్నికల ముందు చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. నల్లధనం బయట తీస్తానంటూ, పెద్ద నోట్లు రద్దు చేసి నల్ల ధనం మొత్తం తమకు కావాల్సిన వారి ఇళ్లకు చేర్చారని విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన హక్కులను ప్రశ్నించడంలో జగన్‌ ఘోరంగా విఫలమయ్యారని, రాష్ట్రం నుంచి కేంద్రానికి చెల్లించిన జీఎస్‌టీ డబ్బులు రాబట్టుకోవడానికి కూడా సాహసం చేయడం లేదని చెప్పారు. ప్రజలకు జానెడు ఇచ్చి… బారెడు లాక్కోవడం జగన్‌ విధానమని నారాయణ అన్నారు. మద్యం, ఇసుక, చివరకు సినిమా టికెట్ల నుంచి కూడా ప్రజల నుంచి దండుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ అని తెలిపారు. రాష్ట్రంలో దళితులపై వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తోందన్నారు. చివరకు ముఖ్యమంత్రి చిన్నాన్న కూడా దారుణ హత్యకు గురయ్యారని, ఎవరు హత్య చేశారో ప్రతి ఒక్కరికీ తెలుసు అని, ఇలాంటి కేసుల నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వానికి దాసోహం జగన్‌ అయిపోయాడని విమర్శించారు. వేలిముద్ర గాళ్లకు ఓట్లు వేయించుకున్న ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. వైసీపీ, బీజేపీ ప్రభుత్వాలను సాగనంపేందుకు విపక్షాలతో పాటు ప్రజలూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. దేశాన్ని రక్షించుకోవాలంటే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ మోదీ దుర్మార్గ పాలన నుంచి విపక్షాలతో పాటు ప్రజలందరూ చైతన్యంతో రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, ఆర్‌ఎస్‌ఎస్‌ మనువాద రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నారని విమర్శించారు. 80 శాతం పేద, బడుగు, బలహీన వర్గాలను 20 శాతం ధనికులు శాసిస్తున్నారని అన్నారు. బందిపోట్లు లాంటి దేశీయ, విదేశీ కార్పొరేట్‌ శక్తులతో మోదీ జత కట్టి దేశ సంపద దోచుకుంటున్నారని మండిపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఓబులేసు మాట్లాడుతూ వైసీపీ నేతలు కోట్లు మింగి, ప్రజలకు బటన్‌ నొక్కి చిల్లర విదిలిస్తున్నారని అన్నారు. రూ.14 లక్షల కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు ఇస్తే ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారని, దీనికి ప్రధాన కారణం మోదీ అని అన్నారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా పెంచారని, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న మోదీని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జయలక్ష్మి, జిల్లా కార్యదర్శి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, కుమార్‌ రెడ్డి, నదియా, కత్తి రవి, ఉదయ్‌, చలపతి, నగర కార్యదర్శి విశ్వనాథ్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు మురళి, జయచంద్ర, సాయి లక్ష్మి, నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, డప్పు కళాకారుల సంఘం నేత శ్రీనివాస్‌, జిల్లా నాయకులు నాగరాజు, సూరి అధ్వర్యంలో ఆలపించిన ఉద్యమ గేయాలు ఆకట్టుకున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img