Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మధ్యతరగతికి ఇళ్లస్థలాలు

పట్టణాల్లో నాలుగు లక్షల మందికి…
150, 200, 250 గజాల విస్తీర్ణంలో ప్లాట్లు
విజయదశమికి తేదీలు వెల్లడిరచాలని సీఎం జగన్‌ ఆదేశం
రివర్స్‌ టెండరింగ్‌లో ఇంటికి రూ.34 వేలు ఆదా

అమరావతి : మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కల నెరవేరబోతోంది. పట్టణాలు, నగరాల్లో నివసించే మధ్యతరగతి వర్గాలకు సరసమైన ధరలకు 150, 200, 250 గజాల విస్తీర్ణంలో ప్లాట్లు అంద జేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే. దీనిపై అధికార యంత్రాంగం చేస్తున్న కసరత్తు కొలిక్కి వస్తోంది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి… విజయ దశమి నాటికి ఈ పథకం అమలు తేదీలు ప్రకటించేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు వచ్చిన అర్జీల ప్రకారం నాలుగు లక్షల ప్లాట్లకు డిమాండ్‌ ఉన్నట్లు అధికారులు వెల్లడిరచారు. ఈ డిమాండ్‌కు అనుగుణంగా ఆయా పట్టణాల్లో భూములు గుర్తించామని సీఎంకు తెలిపారు. 90 రోజుల్లోగా ఇళ్లపట్టాలు ఇచ్చే కార్యక్రమంపై సీఎం సమీక్షించగా, ఈనెల 22 వరకూ ఇళ్లపట్టాల కోసం కొత్తగా 3,55,495 మంది దరఖాస్తు చేశా రని, వీరిలో 1,99,201 మంది అర్హులున్నారని, మరో 9,216 దరఖాస్తులు పెండిరగ్‌లో ఉన్నా యని అధికారులు వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ వీరికి తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టిడ్కో ఇళ్లపై సమీక్షలో ఫేజ్‌-1లో భాగంగా 85,888 ఇళ్ల పనులు పూర్తి చేశామని, ఈ కాలనీల్లో మౌలిక వసతుల పనులు ముమ్మ రంగా సాగుతున్నాయని అధికారులు వివరించారు. 2021 డిసెంబరు నాటికల్లా ఈ ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. ఫేజ్‌-2 ఇళ్లు 2022 జూన్‌ నాటికి, ఫేజ్‌-3 ఇళ్లు 2022 డిసెంబరు నాటికి పూర్తవుతాయని అధికారులు సీఎంకు తెలిపారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణపనులు, ఇతరత్రా అంశాలపై సీఎం ఆదేశించిన విధంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామని, ఇళ్ల మ్యాపింగ్‌, రిజిస్ట్రేషన్‌, జాబ్‌కార్డుల జారీ, జియో ట్యాగింగ్‌ పూర్తయిం దని అధికారులు వెల్లడిరచారు. ఇళ్ల నిర్మాణ సామగ్రి కోసం రివర్స్‌టెండరింగ్‌ ద్వారా మొత్తం రూ.5,120 కోట్లు, ఒక్కో ఇంటికి కొనుగోలు చేసే సామగ్రిలో రూ.32వేలు ఆదా అయినట్లు చెప్పారు. దీనిపై సీఎం మాట్లాడుతూ లబ్ధిదారు లకు నిర్మాణ సామగ్రిని సమకూర్చడంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ స్వచ్ఛభారత్‌ మిషన్‌ అర్బన్‌లో భాగంగా అందించే వాటర్‌ ప్లస్‌ సర్టిఫికేషన్‌కు దేశవ్యాప్తంగా 9 నగరాలు అర్హత సాధించగా, అందులో 3 నగరాలు విశాఖ, విజయవాడ, తిరుపతి ఏపీకి చెందినవి కావడం విశేషమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. ఇందుకోసం కృషి చేసిన అధికారులను సీఎం జగన్‌ అభినందించారు. రాష్ట్రంలోని ప్రతి నగరం, మున్సిపాల్టీ సర్టిఫికెట్‌ పొందిన నగరాలస్ధాయిని చేరుకోవాలని సీఎం ఆకాంక్షించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌, ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్‌, గృహనిర్మాణశాఖ కార్యదర్శి రాహుల్‌ పాండే, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img