Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మరింత బలంగా ముందుకు

. తిరంగా మార్చ్‌లో ఐక్యతా ప్రదర్శన
. పాల్గొన్న టీఎంసీ, బీఆర్‌ఎస్‌, ఎస్పీ
. మోదీ ప్రభుత్వ తీరుకు ఖండన
. దాన్ని గద్దె దించడమే లక్ష్యం
. ప్రజాస్వామ్యంపై మాటలే, ఆచరణ లేదు: ఖడ్గే విమర్శ

న్యూదిల్లీ : ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ, న్యాయం కోసం ఐక్యంగానే కాకుండా ప్రతి స్థాయిలో మరింత బలాన్ని పుంజుకుంటూ ముందుకు సాగాలని 19 ప్రతిపక్షాలు ప్రతిన బూనాయి. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, టీఎంసీ, బీఆర్‌ఎస్‌, ఎస్పీ, ఆర్‌జేడీ, ఐయూఎంఎల్‌, జేడీయూ సహా 19 పార్టీలు ఏకతాటిపైకొచ్చి మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు సంకల్పించాయి. గురువారం పార్లమెంటు భవనం నుంచి విజయ్‌ చౌక్‌ వరకు ఎంపీలు తిరంగా మార్చ్‌ నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని చేబూని మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన అంతాన్ని కాంకిస్తూ కదంతొక్కారు. అదానీ వ్యవహారం, అధిక ధరలు, ప్రజాస్వామ్యంపై దాడులపై గళం వినిపించారు. మోదీ ప్రభుత్వ తీరు మారకుంటే దేశం నిరంకుశత్వం దిశగా అడుగులు వేస్తుందని నొక్కిచెప్పారు.
అయితే టీఎంసీ, బీఆర్‌ఎస్‌, ఆప్‌, ఎస్పీ వేరొక కూటమి కోసం ప్రయత్నాలు చేసిన క్రమంలో తాజా పరిణామం ఆసక్తికరంగా మారింది. తిరంగా మార్చ్‌లో 19 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. ఒకటే లక్ష్యం కోసం తమ మధ్య అభిప్రాయ, సిద్ధాంత భేదాలను మర్చి ఏకమయ్యాయి. దీంతో విపక్షం బలం పెరిగిందని ఎంపీలు అన్నారు. కాగా తిరంగా మార్చ్‌ అనంతరం రాజ్యాంగ క్లబ్‌లో ప్రతిపక్ష నేతలు సంయుక్తంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే మాట్లాడుతూ బడ్జెట్‌ సమావేశాలను వాషౌట్‌ చేయడమే కేంద్రప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక సిద్ధాంతాలపై మాటలకే మోదీ ప్రభుత్వం పరిమితమని విమర్శించారు. అదానీ వ్యవహారంలో జేపీసీ విచారణ కోసం విపక్షం చేస్తున్న డిమాండ్‌ నుంచి అందరి దృష్టి మళ్లించేందుకు పార్లమెంటు కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తుంటారని అధికార పక్షసభ్యులనుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం గురించి ప్రభుత్వం మాట్లాడుతుందిగానీ ఆచరించదని నొక్కిచెప్పారు. ‘రూ.50లక్షల కోట్ల బడ్జెట్‌ను కేవలం 12 నిమిషాల్లో ఆమోదించేశారు. మరోవైపు విపక్షాలకు ఆసక్తి లేదని, సభకు విఘాతం కలిగిస్తుంటాయని బీజేపీ ఆరోపిస్తుం. పాలకపక్షం వల్లే సభకు విఘాతం కలిగింది. ఎప్పుడు డిమాండ్‌ చేసినాగానీ మమ్మల్ని మాట్లాడనివ్వలేదు. నా 52ఏళ్ల ప్రజా జీవితంలో ఇలా ఎన్నడూ జరగలేదు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే కొనసాగితే ప్రజాస్వామ్యం అంతమై నిరంకుశత్వం వర్థిల్లుతుంది’ అని ఖడ్గే చెప్పారు. అదానీ వ్యవహారంలో 19 ప్రతిపక్ష పార్టీలు అనేక అంశాలను లేవనెత్తాయి. ఆయన సంపద కేవలం రెండు`రెండున్నరేళ్లలో రూ.12లక్షల కోట్లు ఎలా పెరిగిందని ప్రశ్నించాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపేందుకు ఎందుకు భయపడుతున్నారన్నదే మా ప్రశ్న. బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ క్షమాపణ చేయాలన్న డిమాండ్‌ కేవలం ప్రధాన సమస్యపై నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకే అని ఖడ్గే అన్నారు. అదానీ కేసులో పారదర్శకతకు హామీ కోసం జేపీసీ విచారణకు డిమాండ్‌ చేశాం. తద్వార సంబంధిత పత్రాలను పరిశీలించే అవకాశం విపక్షాల ఎంపీలకు లభించేదని చెప్పారు. లోక్‌సభలో రాహుల్‌పై అనర్హత వేటునూ ప్రస్తావించారు. దీనిని మెరుపు వేగంతో జరిగిన పరిణామంగా వర్ణించారు. దోషిగా నిర్థారణ జరిగి మూడేళ్ల శిక్ష పడిన బీజేపీ ఎంపీపై 16 రోజుల తర్వాత కూడా అనర్హత వేటు పడకపోవడాన్ని ఖడ్గే ప్రధానంగా వెల్లడిరచారు. 2024 ఎన్నికల్లో అదానీ, కులగణన వంటివి కీలకాంశాలుగా ఉంటాయన్న ప్రశ్నకు వాటిపై పార్టీల అధ్యక్షులు తర్వాత భేటీ అయి చర్చిస్తారు.
అయితే కులగణన మా అజెండాలో ముందు ఉంటుందని ఆయన చెప్పారు. భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఎంపీ కె.కేశవరావు మాట్లాడుతూ ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చిన పార్టీల మధ్య దూరం, అభిప్రాయ భేదాలు ఉన్నాగానీ లక్ష్యం ఒకటే కావడంతో ఒకే వేదికపైకి వచ్చాయని అన్నారు. ‘అంచెలంచెలుగా బలం పెంచుకుంటున్నాం. మమ్మల్ని విడదీసేందుకు జరిగినవన్నీ విఫల ప్రయత్నాలుగా పరిణమించాయి. మేముంతా ఐక్యంగా ముందుకు సాగుతున్నాం. రేపు ఎలా పరిణమిస్తో వదిలేద్దాం… ఇప్పుడు కలిసికట్టుగా పనిచేస్తున్నామన్నదే ముఖ్యం’ అని ఆయనన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఎవరన్న ప్రశ్నకు ‘మీకు నాయకత్వం గురించే ఆసక్తి ఎక్కువ. దేశాన్ని ఒక వ్యక్తి నడిపిస్తారు… వారి వెనుక సిద్ధాంతాలు, అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఐక కార్యాచరణతో అనుకున్నది సాధించడమే ఇప్పుడు మాకు ముఖ్యం’ అని కేకే బదులిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img