Friday, April 19, 2024
Friday, April 19, 2024

మరో విద్యుత్‌ ఉద్యమం తప్పదు

గృహాలకు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు విరమించకుంటే

. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరిక
. అదానీ కంపెనీలపై అంత ప్రేమెందుకో సీఎం చెప్పాలని డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలోని గృహాలకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు యోచనను ఉపసంహరించుకోకపోతే మరో విద్యుత్‌ ఉద్యమం తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఏపీలోని పోర్టులు, విద్యుత్‌ ఒప్పందాలు, కాంట్రాక్టులు అన్నింటినీ అదానీ కంపెనీలకే అప్పగించడం వెనుక మీ మధ్య లాలూచీ ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కోటి 30 లక్షల గృహ, పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. జగన్‌ ప్రభుత్వం రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ నిరంకుశంగా వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌మీటర్లు బిగించి, రైతుల మెడకు గుదిబండ వేసిందని విమర్శించారు. రైతులకిచ్చే ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేందుకే ఈ దుష్ట నిర్ణయం చేసింది. ఇప్పుడు 200 యూనిట్లుపైబడి వినియోగించే 27లక్షల గృహ విద్యుత్‌ కనెక్షన్లకు తొలిదశలో, మరో 25 లక్షల గృహ విద్యుత్‌ కనెక్షన్లకు రెండోదశలో స్మార్లు మీటర్లు బిగించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంకావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రామకృష్ణ తెలిపారు. జగన్‌కి అదానీ కంపెనీలపై విపరీతమైన ప్రేమ రోజురోజుకీ పెరిగిపోతోందన్నారు. పోర్టు నుంచి ప్లాంట్ల వరకు వదలకుండా అదానీకి అప్పనంగా కట్టబెడుతున్నారని తెలిపారు. అదానీ అర్థిక అవకవతకలపై హిండెన్‌బర్గ్‌ నివేదిక బహిర్గతమైనప్పటి నుంచి దేశ వ్యాప్తంగా అదానీ సంస్థలపై చర్చ జరుగుతుంటే, వైసీపీ ప్రభుత్వం మాత్రం హడావుడిగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అదానీ కంపెనీలకు కోట్లాది రూపాయల విలువగల భూములను అప్పనంగా కట్టబెట్టిందన్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలోని గృహాలకు స్మార్ట్‌మీటర్లు బిగించే కాంట్రాక్టు కూడా అదానీ సంస్థకే అప్పచెపుతోందన్నారు. ఈ మేరకు సింగిల్‌ ఫేజ్‌లో 33 నెలలకు రూ.94 చొప్పున రూ. 8742, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల నుంచి 33 నెలల పాటు 120 చొప్పున రూ.11,160 వసూలు చేసేందుకు సూత్రప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదానీ సంస్థకు మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి ఇతర రాష్ట్రాల కంటే అత్యధిక ధరలకు అదానీ కంపెనీ ఏపీలో బిడ్‌ దాఖలు చేసింది. అసలు అదానీ కంపెనీలకు, జగన్‌ ప్రభుత్వానికి మధ్య ఉన్న లాలూచీ ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గృహాలకు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు తీవ్ర భారమేనన్న విషయం ప్రజలందరూ గ్రహించాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్ల ప్రక్రియను ఇప్పటికైనా విరమించుకోవాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img