Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మళ్లీ అప్పు

వారానికే రెండువేల కోట్లు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి మంగళవారం అప్పుల వారంగా మారింది. గత వారం ఇదే రోజు రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ.3,500 కోట్ల రుణాన్ని సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం… మళ్లీ వారం తిరగకుండానే మరో రూ.2వేల కోట్లు అప్పు చేసింది. వీటిలో వెయ్యి కోట్లు 7.35 శాతం వడ్డీతో 16 సంవత్సరాలకు, మరో వెయ్యి కోట్లు 7.32 శాతం వడ్డీతో 20 సంవత్సరాలకు అప్పు చేసింది. దాదాపు 47 రోజుల్లో 11 వేల 500 కోట్ల రూపాయలను ఏపీ అప్పు రూపంలో పొందింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఆర్‌బీఎం కింద రాష్ట్రానికి 30 వేల 500 కోట్ల రూపాయలు మాత్రమే రుణ పరిమితి ఉంది. ఈ ఏడాది డిసెంబరు నెల వరకు మొత్తం 9 నెలల్లో చేయాల్సిన రుణం నెలన్నర రోజుల్లోనే రూ.11,500 కోట్లకు చేరింది. అంటే మూడో వంతు రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వాడేసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్‌డీపీని రూ.14,40,400 కోట్లుగా అంచనా వేస్తున్నారు. అందులో 3.5శాతాన్ని నికర రుణ పరిమితిని లెక్కించి దానికి ఈ ఏడాదిలో తిరిగి చెల్లించే రుణాల మొత్తాన్ని కలిపి ఎంత అప్పులు చేయవచ్చో తేలుస్తారు. వాటికి ప్రజారుణం, కేంద్ర రుణాలు, ఇతర రుణాలు మినహాయిస్తారు. దీనిప్రకారం స్థూల ఉత్పత్తిలో 3.5 శాతానికి మించకుండా రాష్ట్ర అప్పు ఉండాలి. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ నియంత్రణ విభాగం ఒక రాష్ట్రానికి ఉన్న అప్పులన్నీ పరిగణనలోకి తీసుకుని, వాటన్నింటినీ మినహాయించి మిగిలిన మొత్తాలకు మాత్రమే రిజర్వు బ్యాంకు నుంచి బహిరంగ మార్కెట్‌ రుణం తీసుకునేలా అనుమతులిస్తుంది. రాష్ట్రంలో మాత్రం వీటికి పూర్తి భిన్నంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనాలను పెంచి చూపడం నుంచి ఇతరత్రా అనేక ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img