Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మళ్లీ కూల్చివేతలు

. గ్రామస్తుల ఆందోళన
. ఇప్పటంలో ఉద్రిక్తత
. భారీగా పోలీసుల మోహరింపు

విశాలాంధ్ర – తాడేపల్లి : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం ఉదయం రెండు బస్సుల్లో ఇప్పటం చేరుకున్న పోలీసులు… గ్రామంతో పాటు సరిహద్దుల్లోనూ మోహరించారు. క్రేన్లు, జేసీబీలతో గ్రామానికి వచ్చిన అధికారులు ఇళ్ల కూల్చివేతలు మొదలుపెట్టారు. నిబంధనలు అతిక్రమించి ప్రహరీ గోడలు నిర్మించారంటూ అధికారులు నిర్మాణాలు కూల్చివేశారు. 12 ఇళ్ల ప్రహరీ గోడలను ఇప్పటికే నగర పాలక సంస్థ అధికారులు కూలగొట్టారు. గ్రామస్తుల తీవ్ర నిరసనల మధ్యే నిర్మాణాల తొలగింపు ప్రక్రియ కొనసాగింది. గతంలో కొన్ని ఇళ్లను తొలగించిన అధికారులు…మరోసారి ఇళ్లు కూల్చేందుకు చర్యలు తీసుకోవటంపై స్థానికులు మండిపడ్డారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ఎలా కూలగొడతారని అధికారులని నిలదీశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భారీగా పోలీసులను మోహరించారు. గ్రామ సరిహద్దుల్లోనూ పహారా పెట్టారు. గ్రామంలోకి వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, వివరాలు నమోదు చేసుకొని పంపిస్తున్నారు. అక్రమంగా తమ ఇళ్లను తొలగిస్తున్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఆక్రమణల పేరుతో ఉద్దేశపూర్వకంగానే ఇళ్లు తొలగిస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగానే ఆక్రమణలు తొలగిస్తున్నామని అధికారులు వివరించారు. నోటీసులు ఇచ్చామని అధికారులు పేర్కొంటుండగా… అలాంటివేమీ ఇవ్వలేదని గ్రామస్తులు అంటున్నారు. మున్సిపల్‌ అధికారులు ఒక్క ఇప్పటం గ్రామంలోనే పనిచేస్తున్నారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. నగరపాలక సంస్థ పరిధిలోని అనేక చోట్ల అక్రమ కట్టడాలు ఉన్నాయని, వాటిని తొలగించకుండా, అనేక సంవత్సరాలుగా నివాసం ఉండే తమపై కక్ష పెంచుకుని తొలగిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో 70 అడుగుల రోడ్డు అవసరం లేదని చెప్పారు. జనసేన ఆవిర్భావ సభ ఇప్పటంలో జరిగిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వం తమను లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. గ్రామానికి రవాణా సౌకర్యం లేదని, బస్సులు రావని, భారీ వాహనాలు ఇక్కడ నుంచి వెళ్లవని చెబుతున్న గ్రామస్తులు… రోడ్డు విస్తరణతో ఏమి చేస్తారని నిలదీశారు. స్థానికులకు జనసేన, టీడీపీ నేతలు మద్దతు తెలిపారు. గ్రామస్తులకు న్యాయం చేయాలంటూ జనసేన నేతలు నిరాహారదీక్షకు దిగారు. రామాలయంలో దీక్షకు దిగారు. ఇళ్లు కూల్చబోమని హామీ ఇచ్చిన తర్వాతే దీక్ష విరమిస్తామని స్పష్టం చేశారు. కూల్చివేసిన ప్రతి ఇంటికీ పరహారం ఇచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img