Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మళ్లీ గ్యాస్‌ మంట

వంట గ్యాస్‌పై మరో రూ.50 పెంపు

ఏడాదిలోనే రూ.244 మేర పెంచిన కేంద్రం
ప్రజలపై మూడు నెలల్లోనే రూ.153 భారం
ప్రధాన నగరాల్లో రూ.1,100 దాటేసిన ధర
పేదల నడ్డివిరిచేలా కేంద్రం చర్యలు

న్యూదిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాలను కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరి ప్రజలు అల్లాడుతున్న సమయంలో గృహ వినియోగ వంట గ్యాస్‌ (ఎల్‌పీజీ) ధర సిలిండర్‌కి మరోసారి రూ.50 పెంచుతూ దేశీయ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధర బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. అంతర్జాతీయ ఇంధన ధరలను పటిష్టం చేయడంతో మే నెల నుంచి ధర పెరగడం మూడవసారి కాగా ఏడాది కాలంలోనే వంట గ్యాస్‌ ధర ఏకంగా రూ.244 పెరగడం గమనార్హం. ధర పెంచిన ప్రతిసారి రూ.50 భారం వేస్తున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్‌ ప్రకారం, రాయితీ లేని ఎల్‌పీజీ ఇప్పుడు దేశ రాజధానిలో 14.2 కిలోల సిలిండర్‌ ధర గతంలో రూ.1,003 నుంచి రూ.1,053కి పెరిగింది. దీంతో ప్రధాన నగరాల్లో సిలిండర్‌ ధర రూ,1,100 దాటేసింది. ఉజ్వల పథకం కింద కనెక్షన్లు పొందిన పేద లబ్ధిదారులకే ప్రభుత్వం సబ్సిడీని పరిమితం చేసిన తర్వాత సామాన్య కుటుంబాలు వారు కొనుగోలు చేసే వంట గ్యాస్‌కు సబ్సిడీ లేని రేట్లు చెల్లిస్తున్నారు. మార్చి 22న సిలిండర్‌పై రూ.50 పెంచగా, మే 7న మళ్లీ అదే మేర ధరను పెంచగా, మే 19న సిలిండర్‌పై రూ.3.50 పెరిగింది. జూన్‌ 2021 నుంచి సిలిండర్‌ ధరలు రూ.244 పెరిగాయి. ఇందులో రూ.153.50 మార్చి 2022 నుంచి పెరిగింది. ఇక రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు మాత్రం మూడు నెలలుగా బ్రేక్‌ పడిరది. అయితే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై వరుసగా మూడవ నెల విరామం కొనసాగుతోంది. మార్చి 22 నుంచి ప్రారంభమైన 16 రోజుల వ్యవధిలో లీటరుకు రికార్డు స్థాయిలో రూ.10 చొప్పున పెంచిన తర్వాత ధర పెంపు నిలిచింది. మే నెలలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. ఆ సమయంలో వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.200 సబ్సిడీ ఉజ్వల పథకం కింద ఉచిత కనెక్షన్లు పొందిన 9 కోట్ల మంది పేద మహిళలు, ఇతర లబ్ధిదారులకు మాత్రమే పరిమితం చేయబడుతుందని, గృహాలతో సహా మిగిలిన వినియోగదారులు మార్కెట్‌ ధర (రాయితీ లేని ధర)ని చెల్లిస్తారని కేంద్రం పేర్కొంది. వాస్తవానికి, సబ్సిడీ లేని వంట గ్యాస్‌ను వినియోగదారులు తమ 12 సిలిండర్‌ల కోటా ముగిసిన తర్వాత సబ్సిడీ లేదా తక్కువ మార్కెట్‌ ధరలకు కొనుగోలు చేసేవారు. అయితే, 2020 మధ్యలో గృహాలకు ఎల్‌పీజీపై సబ్సిడీని చెల్లించడాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. సబ్సిడీ లేని గృహ వినియోగ వంట గ్యాస్‌ (ఎల్‌పీజీ) ముంబైలో 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.1,052.50 కాగా, చెన్నైలో సిలిండర్‌ ధర రూ.1,079, కోల్‌కతాలో రూ.1,068.50గా ఉంది. అయితే వ్యాట్‌ వంటి స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాల మధ్య ధరల్లో తేడా ఉంటుంది. పన్నులు ఎక్కువగా ఉంటే రాష్ట్రాల్లో ధరలు అధికంగా ఉంటాయి. దీనితో పాటు చమురు సంస్థలు కూడా హోటళ్లు, రెస్టారెంట్లు వంటి సంస్థలు ఉపయోగించే వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచాయి. ఇప్పుడు దేశ రాజధానిలో 19 కిలోల సిలిండర్‌పై రూ.2,012.50గా ఉంది. ఇదిలాఉండగా ఈ ఏడాది అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. మార్చిలో బ్యారెల్‌కు 140 డాలర్ల వద్ద 13 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. బుధవారం బ్రెంట్‌ బ్యారెల్‌కు 103.92 డాలర్ల వద్ద వర్తకమవుతోంది. దిగుమతులు ఖర్చుతో కూడుకోవడం వల్ల కూడా భారత రూపాయి ఒక డాలర్‌కి రూ.79.24కి పడిపోయింది. భారతదేశం తన చమురు అవసరాలలో 85 శాతాన్ని తీర్చడానికి విదేశీ కొనుగోళ్లపై ఆధారపడుతుంది. భారతదేశం మిగులు చమురు శుద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, అది దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి తగినంత ఎల్‌పీజీని తయారు చేయదు. సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి గణనీయమైన పరిమాణంలో దిగుమతి చేసుకుంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img