Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మళ్లీ తెరపైకి ఉమ్మడి పౌరస్మృతి బిల్లు

. రాజ్యసభలో ప్రవేశపెట్టిన బీజేపీ
. రాజ్యాంగ వ్యతిరేకం, అనైతికం: సీపీఐ
. బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు
. చర్చ అవసరమన్న అధికార పక్షం

న్యూదిల్లీ: వివాదాస్పద ‘ఉమ్మడి పౌర స్మృతి’ తేనెతుట్టెను మోదీ సర్కారు మరోసారి తెరపైకి తెచ్చింది. ఉమ్మడి పౌర స్మృతిని రూపొందించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరే ప్రైవేట్‌ బిల్లును శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష పార్టీల తీవ్ర నిరసనల మధ్య ‘భారత్‌లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు`2020’ని బీజేపీ ఎంపీ కిరోది లాల్‌ మీనా ఎగువసభలో ప్రవేశపెట్టారు. ఉమ్మడి పౌర స్మృతి తయారీ కోసం జాతీయ తనిఖీ, దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేయాలని, దేశవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని, ఈ బిల్లును చర్చకు చేపట్టాలని బీజేపీ సభ్యులు కిరోది లాల్‌ మీనా విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రతిపక్ష కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎండీఎంకే, ఆర్‌జేడీ, ఎస్‌పీ, ఎన్‌సీపీ సభ్యులు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు.ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేయడంతో రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్కర్‌ దీనిపై ఓటింగ్‌ పెట్టారు. బిల్లుకు అనుకూలంగా 63మంది, వ్యతిరేకంగా 23 మంది ఓటేశారు. దీంతో బిల్లుపై చర్చ చేపట్టారు. బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లుపై వాడివేడిగా చర్చ జరిగింది. ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించాయి.
సీపీఐ సభ్యుడు పి.సంతోశ్‌ కుమార్‌ మాట్లాడుతూ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లు ఆమోదం పొందితే దేశంలో కొనసాగుతున్న సామాజిక పొందిక, భిన్నత్వంలో ఏకత్వం ధ్వంసమవుతుందని హెచ్చరించారు. ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం, అనైతికం, లౌకిక విధానానికి వ్యతిరేకమని విమర్శించారు. మోదీ సర్కారు ప్రోత్సాహంతోనే బిల్లు ప్రవేశపెట్టారని, ఇది అత్యంత ప్రమాకర క్రీడ అని మండిపడ్డారు. లౌకిక, బహుళత్వ భారతదేశంపై దాడి చేయడమేనని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ అజెండాను మోదీ ప్రభుత్వం ఒకదారి తర్వాత మరొకటి అమలు చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే కశ్మీరును అంతం చేశారని, ఇప్పుడు పౌరస్మృతిని తీసుకొస్తున్నారని చెప్పారు. దేశాన్ని ధ్వంసం చేయడం, సమగ్రతను దెబ్బతీయడం, మైనారిటీలను భయాందోళనకు గురిచేయడం కోసమే బిల్లు తీసుకొచ్చారని ఆగ్రహం వెలిబుచ్చారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు జవహర్‌ సిర్కార్‌, ఎండీఎంకే ఎంపీ వైకో, ఐయూఎంఎల్‌ సభ్యుడు అబ్దుల్‌ వహబ్‌ తదితరులు బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలను సభా నాయకుడు పీయూశ్‌ గోయల్‌ తోసిపుచ్చారు. సభ్యుడు తన చట్టబద్ధమైన హక్కును లేవనెత్తారని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై సభలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆర్‌జేడీ సభ్యుడు మనోజ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఇంతకుముందు ఈ బిల్లును అనేకసార్లు సభలో ప్రవేశపెట్టారని, ఇప్పుడు ఇంత హడావుడిగా ఎందుకు చర్చకు చేపట్టారని ప్రశ్నించారు. ఎస్‌పీ సభ్యుడు రామ్‌గోపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు బిల్లు వ్యతిరేమని చెప్పారు.
బిల్లును ఉపసంహరించుకోవాల్సిందిగా బీజేపీ సభ్యులు మీనాకు సూచించాలని చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఎన్‌సీపీ సభ్యుడు ఫాజియా ఖాన్‌, కాంగ్రెస్‌ సభ్యులు ఎల్‌.హనుమంతయ్య, ఇమ్రాన్‌ ప్రతాప్‌ గర్హి, జేబీ మాథర్‌ హిషామ్‌, సీపీఎం సభ్యుడు ఎలమరం కరీం, డీఎంకే సభ్యుడు తిరుచి శివ తదితరులు మాట్లాడుతూ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img