Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

మళ్లీ మాటల యుద్ధం

ఏపీ, తెలంగాణ మంత్రుల వాగ్బాణాలు

. పాలనను భూమి, ఆకాశంతో పోల్చిన హరీశ్‌రావు
. ఇక్కడకు వచ్చి చూస్తే కనపడుతుందన్న కారుమూరి
. మా గురించి మాట్లాడటానికి ఆయనకేం సంబంధమన్న బొత్స
. విశాఖ ఉక్కుపై బీఆర్‌ఎస్‌ వైఖరేంటో చెప్పాలన్న అమర్‌నాథ్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మళ్లీ మాటల యుద్దం మొదలైంది. టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ పార్టీగా మారిన తర్వాత దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని ప్రయత్నం చేస్తున్న సీఎం కేసీఆర్‌ ఇదే అదనుగా ఈ అంశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వ్యూహాత్మక అడుగు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌ విస్తరణకు విశాఖ ఉక్కును ఆయుధంగా వాడుకునేందుకు పావులు కదిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వహణకు మూలధనం/ ముడిసరుకుల కోసం నిధులు ఇచ్చి నిబంధనల మేరకు ఉక్కు ఉత్పత్తులు కొనేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ఆసక్తి వ్యక్తీకరణ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఊహించని ఈ పరిణామం వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని మాటలు చెప్పడమే తప్ప, అందుకోసం కనీసం ప్రయత్నాలు చేయని ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్ణయం రాజకీయంగా ఇబ్బందుల పాలు చేసింది. విపక్షాలు మొత్తం సీఎం జగన్‌ను విమర్శించడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది. దీనిలో భాగంగా పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్‌ విశాఖ ఉక్కుపై బీఆర్‌ఎస్‌ వైఖరేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకించేవారు బిడ్డింగ్‌లో పాల్గొనమేమిటని ప్రశ్నించారు. మరోవైపు ఏపీలో జరిగిన అభివృద్ధిని, తెలంగాణలో జరిగిన అభివృద్ధితో అనుక్షణం పోలుస్తున్న పరిస్థితులు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా మంత్రి హరీశ్‌రావు ఏపీ గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తెలంగాణ అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలే అని పేర్కొన్న హరీశ్‌రావు… ఆంధ్రాలో ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణలో నివసించే వారంతా తెలంగాణలోనే ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఏపీ, తెలంగాణ రెండు ప్రాంతాలను ప్రత్యక్షంగా చూసిన మీరు అక్కడ రోడ్లు, ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉందో చూసే ఉంటారని వ్యాఖ్యలు చేశారు. ఏపీ పాలనకు, తెలంగాణ పాలనకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందంటూ జగన్‌ సర్కార్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కేంద్రం నుండి నిధుల కోసం మోటార్లకు మీటర్లు పెట్టి ప్రజలకు అన్యాయం చేస్తున్నారనే భావన వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మంత్రులు అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌రావు ఒకసారి ఏపీలోకి తొంగి చూస్తే వైసీపీ ప్రభుత్వం చేసే అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. ఏపీలో రోడ్లు సరిగా లేవని మంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు మళ్లీ సీఎం జగనే రావాలని కోరుకుంటున్నారని అన్నారు. దీనిపై హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. తాను ఏమన్నానని ఏపీ మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారని ప్రశ్నించారు. ‘మీ దగ్గర ఏమున్నది అని అంటున్నారు. మా దగ్గర ఉన్నాయి చెప్పమంటే దునియా చెబుతాం. మా దగ్గర 56 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. రైతు బీమా, రైతు బంధు ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మించాం. మీ దగ్గర ఏమున్నాయంటూ ప్రశ్నలు సంధించారు. ఆనాడు ప్రత్యేక హోదా కావాలని అన్నారు. మెడలు వంచాలి అంటిరి. ఇప్పుడేమో కేంద్రం ఎగబెట్టినా ఏం అడగరు. విశాఖ ఉక్కు అమ్ముతున్నా, తుక్కుకి అమ్మినా ఎవ్వరు అడగరు. ప్రజలను గాలికి వదిలేశారు.. మీ ప్రయోజనాలు చూసుకుంటున్నారని విమర్శిస్తూ, . ఆంధ్రా మంత్రులు అనవసరంగా మా జోలికి రావద్దు’ అంటూ హెచ్చరించారు. మా గురించి ఎక్కువ మాట్లాడకపోతే మీకే మంచిదని హితవు పలికారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఘాటుగా ప్రతిస్పందించారు. హరీశ్‌రావు రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏపీ గురించి మాట్లాడడానికి ఆయనకు ఏ సంబంధమని ప్రశ్నించారు. బాధ్యత గల వ్యక్తులు బాధ్యత గుర్తెరిగి మాట్లాడాలని సూచించారు. ‘మా రాష్ట్రం గురుంచి మాకు తెలుసు. మీ రాష్ట్రం మీరు చూసుకోండి’ అని హితవు చెప్పారు. మొత్తానికి విశాఖ ఉక్కు అంశం రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వేడి పుట్టిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img