Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మళ్లీ మూడు వేల కోట్ల అప్పు

. రెండు నెలల్లోనే రూ.18,500 కోట్లకు చేరిన రుణం
. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలో ఇక మిగిలింది రూ.12 వేల కోట్లే
. రెవెన్యూలోటు నిధులు విడుదలైనా ఆగని రుణ సేకరణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ అప్పు తీసుకొచ్చింది. ఇటీవల కేంద్రం నుంచి రెవెన్యూలోటు భర్తీ కింద పెద్దమొత్తంలో నిధులొచ్చినా గత ఐదు వారాల నుంచి వరుసగా అప్పులు చేసే ప్రహసనం కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే పరిమితికి మించి వేలకోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం తాజాగా సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రిజర్వ్‌ బ్యాంకులో రూ.3వేల కోట్లు అప్పు తీసుకుంది. వీటిలో వెయ్యి కోట్లు 14 సంవత్సరాలకు 7.36 శాతం వడ్డీతో, మరో వెయ్యి కోట్లు 20 సంవత్సరాలకు 7.33 శాతం వడ్డీతో రుణం పొందింది. రూ. 500 కోట్లు 10 సంవత్సరాలకు 7.33 శాతం, మరో రూ. 500 కోట్లు 19 సంవత్సరాలకు 7.33 శాతం వడ్డీతో రుణం తీసుకుంది. ఈ మూడువేల కోట్లతో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలోని అప్పులు 18 వేల 500 కోట్లకు చేరుకున్నాయి. ఈ సంవత్సరానికి సంబంధించి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలో ఇంకా కేవలం రూ.12 వేల కోట్లు మాత్రమే అప్పు చేయడానికి అవకాశం ఉంది. 2014`15 రెవెన్యూలోటు కింద ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయంగా కేంద్రప్రభుత్వం గతంలో ఎన్నడూలేని విధంగా అనూహ్యంగా ఒకేసారి కేంద్ర ప్రభుత్వం గత వారం రూ.10,461 కోట్లు విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. అయినప్పటికీ మంగళవారం అప్పు చేసే ప్రక్రియ మాత్రం ప్రభుత్వం కొనసాగిస్తోంది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఎఫ్‌ఆర్‌బీఎం కింద ఏపీకి 30 వేల 500 కోట్ల రూపాయలు మాత్రమే రుణ పరిమితి ఉంది. ఈ ఏడాది డిసెంబరు నెల వరకు మొత్తం 9 నెలల్లో చేయాల్సిన అప్పు రెండు నెలల్లోనే రూ.18,500 కోట్లకు చేరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img