Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మహారాష్ట్రలో ఠాక్రే సర్కారుకు షాక్‌.. గుజరాత్‌లో 12 మంది ఎమ్మెల్యేల క్యాంప్‌..!

మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వానికి నేడు మరో గట్టి షాక్‌ తగిలింది. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు గుజరాత్‌లో క్యాంప్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో మహారాష్ట్రలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివసేన నేతృత్వంలోని ఎంవీఏ కూటమికి ప్రతిపక్ష బీజేపీ పార్టీ షాక్‌ ఇవ్వగా.. మంగళవారం ఎమ్మెల్యే గుజరాత్‌లోని సూరత్‌ చేరుకున్నారు. వీరంతా గుజరాత్‌కు చెందిన కీలక నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామంతో ఉద్ధవ్‌ ఠాక్రే సర్కారు చిక్కుల్లో పడ్డట్లయ్యింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఇవాళ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శివసేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండేతో 10-12 మంది ఎమ్మెల్యేలు గుజరాత్‌లోని ఓ హోటల్‌లో క్యాంప్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏక్‌నాథ్‌ షిండే సోమవారం నుంచి పార్టీకి అందుబాటులో లేకుండాపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై కేంద్రమంత్రి, బీజేపీ నేత నారాయణ్‌ రాణేను ప్రశ్నించగా.. స్పందించేందుకు నిరాకరించారు.
మహారాష్ట్ర శాసనమండలిలో 10 స్థానాలకు సోమవారం (జూన్‌ 20న) ఎన్నికలు జరగ్గా, ఇందులో అఘాడీ కూటమి భాగస్వామ్య పార్టీలైన శివసేన రెండు, ఎన్సీపీ రెండు, కాంగ్రెస్‌ ఒక స్థానంలో విజయం సాధించాయి. బీజేపీ సొంతంగా ఐదు స్థానాలను సొంతం చేసుకుంది. కాషాయపార్టీకి నలుగురు అభ్యర్థులను గెలిపించుకోగల సంఖ్యా బలం మాత్రమే ఉన్నప్పటికీ..అయిదుగురిని బరిలోకి దించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంత బలం 106 కాగా..133 ఓట్లు తమ అభ్యర్థులకు వచ్చాయని కాషాయ పార్టీ తెలిపింది. స్వతంత్ర అభ్యర్థులు బీజేపీకు మద్దతు తెలపడంతోపాటు అధికార కూటమికి చెందిన కొందరు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. కనీసం 20 మంది ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. శాసనమండలి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు తేలడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన, అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నేడు అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img