Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే

ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌
రాజ్‌భవన్‌లో ఇద్దరి ప్రమాణ స్వీకారం

న్యూదిల్లీ / ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు అనుహ్యంగా మారిపోయాయి. నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ కుయుక్తులు ఫలించాయి. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే ముఖ్యమంత్రిగా, బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉపముఖ్యమంత్రిగా గురువారం రాజ్‌భవన్‌లో ప్రమాణం చేశారు. గవర్నర్‌ భగవ్‌ సింగ్‌ కోశ్యారీతో భేటీ అనంతరం షిండే సీఎం కాబోతున్నట్లు ఫడ్నవీస్‌ ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని ఫడ్నవీస్‌ను బీజేపీ కోరడంతో ఆయన అంగీకరించినట్లు తెలిసింది. తన ప్రమాణ స్వీకరానికి కొన్ని గంటల ముందు మీడియాతో మాట్లాడుతూ, ‘నేను ప్రభుత్వంలో ఉండి అది సజావుగా సాగేలా చూస్తాను. ముఖ్యమంత్రిగా షిండే మాత్రమే ప్రమాణం చేస్తారు’ అని ఫడ్నవీస్‌ తెలిపారు. అయితే బీజేపీ అధిష్ఠానం కోరిక మేరకు ఆయన షిండేతో పాటే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ, ఫడ్నవీస్‌తో పాటు బీజేపీ ఇతర నేతలకు ఏక్‌నాథ్‌ షిండే కృతజ్ఞతలు తెలిపారు. తనను సీఎం చేయడం వారి గొప్పతనమన్నారు. ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన ఫడ్నవీస్‌ది పెద్ద మనస్సు అని ప్రశంసించారు. ఫడ్నవీస్‌, ఏక్‌నాథ్‌ షిండే గురువారం మధ్యాహ్నం

గవర్నర్‌తో భేటీ అయి ప్రభుత్వం ఏర్పాటునకు సంబంధించి మెమోరాండాన్ని అందించారు. తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 39 మంది ఎమ్మెల్యేల మద్దతున్న తమదే నిజమైన శివసేన అని చెప్పుకున్నారు. కాగా, బలపరీక్షకు సుప్రీంకోర్టు అనుమతిచ్చిన కొద్ది నిమిషాలకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఉద్ధవ్‌ ఠాక్రే బుధవారం ప్రకటించిన విషయం విదితమే.
ఇందుకు చింతిస్తారు: సంజయ్‌ రౌత్‌
శివసేనను వీడినందుకు తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా చింతిస్తారని ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. వారు తమ మార్గాన్ని ఎంచుకున్నారు. పార్టీ నుంచి ఎలాంటి అవరో ధాలు ఉండవు. వారు స్వేచ్ఛగా బీజేపీతో కలిసిపోవచ్చు అని వ్యాఖ్యానించారు.
ఇది బీజేపీ మాస్టర్‌ స్ట్రోక్‌: రాజకీయ విశ్లేషకులు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలను షిండేకు అప్పగించడం బీజేపీ మాస్టర్‌ స్ట్రోక్‌ అని రాజకీయ విశ్లేషకులు భావించారు. సీనియర్‌ నేత, పాలనలో అనుభవం ఉన్న ఫడ్నవీస్‌ను కాదని శివసేనలో ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న షిండేను సీఎం చేయడం వెనుక గొప్ప వ్యూహం ఉందన్నారు. ఉద్ధవ్‌ ఠాక్రేను మోసం చేశారన్న శివసేన వాదనను ఎదుర్కోవడం, శివసేన వర్గీయుల్లో తమ ప్రభుత్వమే ఏర్పడిరదన్న భావన కల్పించడం ఈ వ్యూహం వెనుక ఆలోచనగా చెప్పారు. శివసేనలో తిరుగుబాటు వర్గంపై వ్యతిరేకతను తొలగించడం, షిండే వర్గమే అసలైన శివసేన అనే భావనను ప్రచారం చేయడమే ముఖ్యఉదేశమని అన్నారు. షిండే సీఎం అయినా, రిమోట్‌ కంట్రోల్‌ తమ వద్దనే ఉంటుందని, ఆయన షాడో సీఎంగా ఉంటారని బీజేపీ భావిస్తోందన్నారు.
షిండేపై పూర్తి విశ్వాసం ఉంది.. : ప్రధాని మోదీ
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఏక్‌నాథ్‌ షిండేకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు చేర్చగలరన్న విశ్వాసం తనకు ఉందని అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్తకు ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. షిండే అనుభవం, నైపుణ్యత రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడుతు ందని, మహారాష్ట్ర వృద్ధికి దోహదమవుతుందని మోదీ ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img