Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మహా పాదయాత్ర ఉద్రిక్తం

. అమరావతి రాజధాని సాధన రైతులను అడ్డుకున్న పోలీసులు
. ఐడీ కార్డులు చూపించాలంటూ రైతులను నెట్టేసిన వైనం
. రోడ్డు పై బైఠాయించి రైతుల నిరసన
. వాగ్వాదం… తోపులాటలో మహిళతో సహా ఐకాస నేతలకు గాయాలు

విశాలాంధ్ర`కపిలేశ్వరపురం/కాకినాడ : అమరావతి రైతుల మహా పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తూ పోలీసులతో రైతులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. కోర్టు ఆదేశాలతో, ప్రజల మద్దతుతో మొక్కవోని దీక్షతో యాత్ర సాగిస్తున్న రైతుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు.
శుక్రవారం అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం పసలపూడిలో రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డులు చూపించి ముందుకు సాగాలని రామచంద్రాపురం డీఎస్పీ ఎం.బాలచంద్రారెడ్డి, అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి చెప్పడంతో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం… తోపులాట చోటుచేసుకుంది. ఇన్నాళ్లుగా యాత్ర చేస్తున్న తమను అడ్డుకోవడమేమిటని రైతులు ప్రశ్నించారు. దీంతో పోలీసులు వారిని ముందుకు కదలనివ్వలేదు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్నారని రైతులను పోలీసులు నెట్టేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అయినప్పటికీ రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలే ప్రయత్నం చేయడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో మహిళా రైతులు సొమ్మసిల్లి కిందపడిపోయారు. అలాగే అనేక మంది రైతులు, ఐకాస నేతలకు గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు రోడ్డు పైనే బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు మాత్రం ఐడీ కార్డులు చూపించిన తర్వాతే ముందుకు సాగాలని తేల్చి చెప్పారు. ఇన్ని రోజులుగా ఐడీ కార్డులు అడగని పోలీసులకు ఈరోజే ఎందుకు గుర్తుకొచ్చాయని ఐకాస నేతలు శివారెడ్డి, తిరుపతిరావు ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలతోనే యాత్రను అడ్డుకున్నామని చెబుతున్న పోలీసులు… ఆర్డర్‌ కాపీని మాత్రం చూపించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. ‘600 మందికి మాత్రమే హైకోర్టు అనుమతించింది. వారు మాత్రమే యాత్రలో ఉండాలని పోలీసులు చెప్పారు. సంఫీుభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలు రోడ్డు పక్కన నిల్చొని మద్దతు తెలపాలి’ అని పోలీసుల సూచన మేరకు శివారెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం పాదయాత్ర ముందుకు సాగింది. అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని గత కొంతకాలంగా రైతులు మహా పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ ప్రభుత్వం వారి యాత్రను ముందుకు సాగనివ్వకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదనను మరోమారు తెరపైకి తెచ్చి అమరావతి రైతుల ఉద్యమానికి అడ్డంకులు
సృష్టించే యత్నం చేస్తున్నారు. ఎన్ని అవాంతరాలు కలిగించినా… అకుంఠిత దీక్షతో రాజధాని రైతులు ముందుకు సాగుతున్నారు.
దిగ్విజయంగా ముందుకు సాగుతున్న మహా పాదయాత్ర
ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలగజేసినా మంచి సంకల్పంతో ప్రారంభించిన అమరావతి రైతుల మహా పాదయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతోందని టీడీపీ రామచంద్రపురం నియోజవర్గ ఇన్‌ఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర రామచంద్రపురం నియోజవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం… మహా పాదయాత్ర చేస్తున్న రైతులకు ఘన స్వాగతం పలికారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా తీన్మార్‌ డప్పులతో కోలాట సభ్యులు కోలాటం చేస్తూ స్వాగతం పలికారు. రైతులకు సహకారంగా నిలిచే ఎడ్ల బళ్లు, రైతు రథాలు (ట్రాక్టర్లు)ను ముందు వరుసలో పెట్టి అమరావతి రైతులు మహా పాదయాత్రను ముందుకు సాగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img