Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మహిళా సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలం

భారత జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనీ రాజా

విశాలాంధ్ర రాజానగరం/రాజమహేంద్రవరం : మహిళలపై అత్యాచారాలు, దాడులను నిరోధించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) ప్రధాన కార్యదర్శి అనీ రాజా తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని గైట్‌ డిగ్రీ కళాశాల సమావేశ హాలులో మూడు రోజులపాటు జరిగే ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర స్థాయి వర్క్‌ షాప్‌ను మంగళవారం ఆమె ప్రారంభించారు. ఇప్పటికే బాల్య వివాహాల నిషేధ చట్టం, అత్యాచార నిరోధక చట్టం ఉన్నప్పటికీ ఎందుకు సక్రమంగా అమలు చేయడం లేదని పాలకులను ప్రశ్నించారు. 25 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకపోవడం శోచనీయమన్నారు. నూటికి 57 శాతం మంది మహిళలు రక్తహీనతతో, 67 శాతం మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతుంటే పట్టించుకోకుండా వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ చట్టం చేసినంత మాత్రాన మహిళల సమస్యలు ఏమేరకు పరిష్కారమవుతాయని ఆమె ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. అంగన్‌వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలకు, పాఠశాలల్లో పిల్లలకు పౌష్ఠికాహారం సరిగ్గా అందడం లేదని తెలిపారు. నిత్యవసర సరుకులు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు ఆకాశాన్నంటాయని విమర్శించారు. త్వరలో కేంద్రంలో మోదీ పాలన అంతం కావడం ఖాయమని అన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాలుప్రస్తుత కర్తవ్యాలు అనే అంశంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ 2022వ సంవత్సరం పోరాటాలకు నాంది పలుకుతుందన్నారు. మోదీ సర్కార్‌ ప్రభుత్వ

రంగ సంస్థలను కార్పొరేట్‌లకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. రైతు ఉద్యమం స్ఫూర్తితో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
ఏపీయూడబ్య్లుజె రాష్ట్ర పూర్వ అధ్యక్షులు డి.సోమసుందర్‌ భారతీయ సంస్కృతి, చరిత్ర`వక్రీకరణలు అనే అంశంపై మాట్లాడారు. కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకులు పంచదార్ల దుర్గాంబ అధ్యక్షత వహించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, రాజమండ్రి నగర కార్యదర్శి నల్లా రామారావు, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.జయలక్ష్మీ, పి.దుర్గాభవాని, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అత్తిలి విమల, జిల్లా అధ్యక్షురాలు నల్లా భ్రమరాంబ, కార్యదర్శి లోవరత్నం, జట్లు లేబర్‌ యూనియన్‌ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు, కార్యదర్శి సప్పా రమణ, తోకల ప్రసాద్‌, బొమ్మసాని రవిచంద్ర, శివకోటి రాజుతో పాటు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img