Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మాట నిలుపుకుంటున్నా

18 వరకు మహిళల ఖాతాల్లో నిధులు జమ
మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట
రెండో విడత ఆసరా సభలో ముఖ్యమంత్రి జగన్‌

విశాలాంధ్ర`ఒంగోలు : ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నానని, అక్కచెల్లెమ్మలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆసరా రెండవ విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం ప్రారంభించారు. రెండో విడత ఆసరా నిధులను ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి ప్రారంభించారు. ఆసరా నిధుల విడుదలకు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి అధ్యక్షత వహించారు. సీఎం జగన్‌ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా డ్వాక్రా అక్కచెల్లెళ్లకు వైఎస్సార్‌ ఆసరా నిధులు నేరుగా బ్యాంకు ఖాతాలలో జమ చేశామన్నారు. ఈ కార్యక్రమం ఈనెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఉప ఎన్నిక కారణంగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున కడప జిల్లాలో నవంబర్‌ 6 నుంచి 15వ తేదీ వరకు ఆసరా నిధులు జమ చేస్తామన్నారు. ఎన్నికలకు ముందు 7.97 లక్షల మహిళా సంఘాలలో 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మల అప్పు నిల్వ రూ.25,517 కోట్లు ఉందన్నారు. వీటిని నాలుగు విడతలలో చెల్లిస్తామని హామీ ఇచ్చామన్నారు. అందులో భాగంగా గతేడాది మొదటి విడతగా రూ.6,318.76 కోట్లను మహిళల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమచేశామన్నారు. రెండవ విడతగా రూ,6,439.52 కోట్లు జమచేస్తున్నామన్నారు. ఇదే సమయంలో మాజీ సీఎం చంద్రబాబుపై జగన్‌ విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, అప్పటి వరకు ఎవరూ రుణాలు చెల్లించవద్దని చెప్పి మహిళలను మోసం చేశారన్నారు. అప్పటి వరకు ఏ గ్రేడ్‌లో ఉన్న స్వయం సహాయక గ్రూపులు సి, డి గ్రూపులుగా దిగజారాయన్నారు. అసలు, వడ్డీ, వడ్డీకి వడ్డీ కట్టలేని స్థితికి మహిళలు చేరుకున్నారన్నారన్నారు. అందుకే మహిళలను ఆదుకునేందుకే వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని తెచ్చామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పావలా వడ్డీ పథకాన్ని ఎత్తివేసిందని, దానిని తమ ప్రభుత్వం పునరుద్ధరించి వైఎస్సార్‌ సున్నావడ్డీగా తీసుకువచ్చామన్నారు. సున్నా వడ్డీ నిధులు అక్కచెల్లెళ్లకు జమ చేస్తున్నామన్నారు. అన్ని రంగాలలో మహిళలకు పెద్దపీట వేశామన్నారు. రాజకీయంగా 60.47శాతం

మహిళలకు పదవులు ఇచ్చామన్నారు. 13 జిల్లాల్లో ఏడుగురు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు మహిళలే అన్నారు. 26 మంది వైస్‌చైర్మన్‌ పదవులలో 15 మంది మహిళలేనని లెక్కలు చెప్పారు. సంపూర్ణ మద్య నిషేదాన్ని అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నామని, దిశ చట్టం ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలు మహిళలు తన కాళ్ల మీద తాను నిలబడేలా చేస్తున్నాయన్నారు. వైయస్సార్‌ చేయూత ద్వారా అనేక రకాలుగా జీవనోపాధి మార్గాలు చూపిస్తున్నామని, మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. అమూల్‌తో ఒప్పందంతో మార్కెట్‌లో పోటీ పెరిగి లీటర్‌కు రూ.5 నుండి రూ.15 వరకు అదనపు ఆదాయం చూపుతున్నామన్నారు. ఒంగోలులో తాగునీటి కష్టాలు తీర్చాలని మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి అడిగారని, అందుకోసం రూపొందించిన ప్రాజెక్టుకు రూ.400 కోట్లు మంజూరు చేస్తున్నామని సీఎం జగన్‌ చెప్పారు. 2022 ఆగస్టులోగా వెలిగొండ ప్రాజెక్టు తొలిటన్నెల్‌ నుండి నీటిని విడుదల చేస్తామన్నారు. రెండవ టెన్నల్‌ ద్వారా 2023 ఫిబ్రవరి నాటికి నీటిని విడుదల చేసి జిల్లా వాసుల సాగు, తాగునీటి కష్టాలు తొలగిస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రజాప్రతినిధులు రెండున్నర సంవత్సరాలలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన జగన్‌కు కాకుండా గత ఐదేళ్లలో ఏ పనిచేయని చంద్రబాబుకు లేఖలు రాయాలని హితవు పలికారు.
జనసేన నేత పవన్‌ కల్యాణ్‌కు దమ్ముంటే వచ్చే ఎన్నికలలో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మాట్లాడుతూ టీడీపీ హయాంలో కేవలం కాయితాలకే పరిమితమైన యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఐటీలకు త్వరలో భూమిపూజ చేసి నిర్మిస్తామని, తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమన్నారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నాయకుడంటే ప్రజల సమస్యలు తీర్చేవాడన్నారు. బాబొస్తే జాబొస్తుందని గత ఎన్నికలలో చంద్రబాబును గెలిపిస్తే రాష్ట్రంలో అప్పటి వరకు ఉన్న 2 లక్షల కాంట్రాక్టు ఉద్యోగాలను తొలగించారని గుర్తు చేశారు.
అనంతరం మహిళా లబ్ధిదారులు తమ విజయగాథలు వినిపించారు. బాపట్ల పార్లమెంటుసభ్యులు నందిగం సురేశ్‌, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, జిల్లా ఎస్‌పీ మలికా గర్గ్‌, జేసీలు జె.వెంకట మురళి, టీఎస్‌.చేతన్‌, కందుకూరు సబ్‌ కలెక్టర్‌ అపరాజితా సింగ్‌, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, నగరపాలక సంస్థ మేయర్‌ గంగాడ సుజాత, ఎమ్‌ఎల్‌సీ పోతుల సునీత, శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్‌, మానుగుంట మహీధర్‌రెడ్డి, అన్నా వెంకటరాంబాబు, టీజేఆర్‌ సుధాకరబాబు, బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, కుందుర్రు నాగార్జునరెడ్డి, కరణం బలరామకృష్ణ మూర్తి, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్‌, మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మూరి కనకారావు, మాజీ మంత్రులు శిద్దా రాఘవరావు, గాదె వెంకటరెడ్డి, మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరటయ్య, బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, వెంకటరెడ్డి, పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ మాదాసి వెంకయ్య, శాప్‌ టెక్నాలజీ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img