Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మానవ హక్కుల గురించి పాక్‌ మాట్లాడడం హాస్యాస్పదం

: యూఎన్‌ హెచ్చార్సీలో పాక్‌ ను ఎండగట్టిన భారత్‌
కౌన్సిల్‌ 52వ సమావేశంలో పాల్గొన్న భారత ప్రతినిధి తులసీదాస్‌

పాకిస్థాన్‌ నుంచి ప్రజస్వామ్యంపై పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం ప్రపంచానికి లేదని భారత్‌ స్పష్టం చేసింది. ఆ దేశంలో జరిగే ఎన్నికల్లో ఉగ్రవాదులు కూడా పోటీ చేస్తారని, ప్రచారంలో పాల్గొంటారని ఐక్యరాజ్యసమితి హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ (యూఎన్‌ హెచ్చార్సీ) లో ఆరోపించింది.పట్టపగలు, నడి రోడ్డు మీద ఉగ్రవాదులు యథేచ్చగా తిరిగే దేశమది.. ప్రపంచానికి ఉగ్రవాదాన్ని, హింసను ఎగుమతి చేస్తున్న దేశమది.. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద జాబితాలోని దాదాపు 150 మంది నేరస్థులు తలదాచుకున్న దేశమది.. అలాంటి దేశం ప్రపంచానికి ప్రజస్వామ్యం గురించి పాఠాలు చెబుతుందా? మానవ హక్కులంటే ఏంటో నిర్వచనం చెబుతుంటే విని నేర్చుకోవాల్సిన అవసరం ప్రపంచ దేశాలకు ఉందా? అంటూ తులసీదాస్‌ నిప్పులు చెరిగారు.అలాంటి దేశం మానవ హక్కుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని మన దేశ ప్రతినిధి డాక్టర్‌ పీఆర్‌ తులసీదాస్‌ విమర్శించారు. కౌన్సిల్‌ ఆధ్వర్యంలో గురువారం జరిగిన 52వ సెషన్‌ జనరల్‌ డిబేట్‌ లో ఆయన మాట్లాడారు. భారత దేశంలో మతపరంగా అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నాలు మానుకుని, తమ దేశంలోని మైనారిటీల సంక్షేమం గురించి ఆలోచించాలని హితవు పలికారు. ముంబైలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులకు ఇప్పటికీ ఎలాంటి శిక్ష పడలేదన్నది నిజం కాదా.. ఆ ఉగ్రవాదులు ఇప్పటికీ ఇస్లామాబాద్‌ లో స్వేచ్ఛగా తిరుగుతున్న విషయం నిజం కాదని చెప్పగలదా? అంటూ పాకిస్థాన్‌ ను ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం వెతుకుతున్న తీవ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ పాకిస్థాన్‌ లో దాక్కోవడం నిజం కాదా? అదీ ఆ దేశ మిలటరీ స్థావరానికి కూతవేటు దూరంలో నెలల తరబడి షెల్టర్‌ పొందిన విషయం అబద్ధమా?.. అంటూ ప్రశ్నలు గుప్పించారు. జమ్మూ కశ్మీర్‌ పై తరచూ పాక్‌ చేసే ఆరోపణలపైనా తులసీదాస్‌ స్పందించారు. భారత దేశంలో జమ్మూకశ్మీర్‌ అంతర్భాగమని, భారత్‌ నుంచి దానిని విడదీయాలనే కుటిల ప్రయత్నం ఎన్నటికీ నెరవేరదని తేల్చిచెప్పారు. మైనారిటీల హక్కుల విషయంలో భారత్‌ చాలా ముందుందని, ప్రజలందరూ స్వేచ్ఛగా బతికేందుకు అనువైన వాతావరణం భారత్‌ లో ఉందని వివరించారు. ప్రస్తుతం పాకిస్థాన్‌ లో మైనారిటీల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, వారంతా నిత్యం ప్రాణభయంతో బతుకుతున్నారని తులసీదాస్‌ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img