Friday, April 19, 2024
Friday, April 19, 2024

మాలిక్‌ అరెస్టు..రాజకీయ ప్రతీకారమే


శరద్‌ పవార్‌ విమర్శ
పూనె: తమ పార్టీ నాయకుడు, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ను రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేసినట్లు ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ విమర్శించారు. మాలిక్‌ ముస్లిం అయినందున మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో సంబంధాలు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు మండిపడ్డారు. మంత్రి పదవికి మాలిక్‌ రాజీనామా చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను పవార్‌ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. దావూద్‌ ఇబ్రహీం కార్యకలాపాలకు సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో ఫిబ్రవరి 23న నవాబ్‌ మాలిక్‌ను ఈడీ అరెస్టు చేసింది. ‘మాలిక్‌ అరెస్టు రాజకీయ కుట్రలో భాగమే. ఆయన ముస్లిం కావడంతో దావూద్‌ ఇబ్రహీంతో సంబంధాలు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మాలిక్‌, మా కుటుంబ సభ్యులను కావాలనే వేధిస్తున్నారు. అయినా మేము భయపడేది లేదు. పోరాటం చేస్తాం’ అని పవార్‌ స్పష్టంచేశారు. మంత్రిగా మాలిక్‌ను రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తుందిగా అని విలేకరులు ప్రశ్నించగా బీజేపీకి చెందిన కేంద్రమంత్రి నారాయణ రాణె విషయంలో అలా ఎందుకు చేయలేదని పవార్‌ ఎదురు ప్రశ్నించారు. ఇటీవల కేసు నమోదైనప్పుడు రాణె రాజీనామా చేశారో..లేదో తనకు గుర్తులేదని వ్యంగ్యాస్త్రం సంధించారు. రేపు ప్రధాని నరేంద్రమోదీ పూనె వస్తున్నారు. బహుశా ఆయన ఏమైనా దీనికి సమాధానం చెబుతారేమో చూద్దామని పవార్‌ వ్యాఖ్యానించారు. మాలిక్‌పై కేసు మాత్రం ముమ్మాటికీ రాజకీయ ప్రతీకారమేనని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను చెంప చెల్లుమనిపిస్తానంటూ వ్యాఖ్యలు చేసినందుకు రాణెపై గతేడాది ఆగస్టులో మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మంత్రి వెంటనే బెయిల్‌ తెచ్చుకున్నారు. మహారాష్ట్రలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి కొంతమంది ఎంపిక చేసుకున్న వ్యక్తుల, నేతల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారన్న ఆరోపణపై స్పందిస్తూ…అనేకమంది నాయకుల ఫోన్‌ట్యాపింగ్‌ రికార్డులను తాను విన్నానని పవార్‌ చెప్పారు. దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రభుత్వ హయాంలో ఈ జాఢ్యం అంటుకుందని మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పినట్లు నాడు అధికారులు ఆడుకున్నారని, ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని పవార్‌ చెప్పారు. ఇలాంటి పరిస్థితిని దేశంలో తాను ఏనాడు చూడలేదని తెలిపారు. బీజేపీతో పాటు మహారాష్ట్ర గవర్నరు బీఎస్‌ కొశ్యారీపైనా పవార్‌ మండిపడ్డారు. శాసనమండలికి 12 మంది అభ్యర్థుల పేర్లను కేబినెట్‌ ఆమోదించి ఏడాది క్రితం పంపినా ఇప్పటికీ గవర్నరు ఆమోదించలేదని విమర్శించారు.
ఎవరి కోసం ఫోన్లు ట్యాప్‌ చేశారు
బీజేపీ ఆదేశాల మేరకు ఐపీఎస్‌ అధికారి రష్మీ శుక్లా మహా వికాస్‌ అఘాది ప్రభుత్వ నాయకుల ఫోన్లు ట్యాప్‌ చేశారని ఎన్‌సీపీ అధికార ప్రతినిధి మహేశ్‌ తపసే అన్నారు. 2019లో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న కీలక సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. కూటమి నాయకుల ఫోన్లను అక్రమంగా ట్యాప్‌ చేసి..ఆ సమాచారాన్ని బీజేపీకి నాయకులకు అందజేస్తున్నట్లు తాము అనుమానించామన్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతిగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌ నేత నానా పటోల్‌, ఎన్‌సీపీ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సే, శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ఫోన్లను ఆమె అక్రమంగా ట్యాప్‌ చేశారని, దీనికి సంబంధించి పూనె, ముంబైలో శుక్లాపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని మహేశ్‌ వివరించారు. ఎవరి కోసం ఆమె ఫోన్లకు అక్రమంగా ట్యాప్‌ చేశారో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img