Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మితవాద రాజకీయాలపై పోరుకు వామపక్ష ఐక్యత అవశ్యం

. బీజేపీపై సైద్ధాంతికంగా పోరాడేది కమ్యూనిస్టులే
. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడిరచడం అవసరం
. హైదరాబాద్‌ సభలో రాజా, ఏచూరి

విశాలాంధ్ర-హైదరాబాద్‌: మితవాద రాజకీయాలపై పోరాడాలంటే వామపక్ష ఐక్యత అత్యంత అవసరమని, ఇందుకు తెలంగాణ రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం ఉమ్మడి సమావేశం ఒక ముందడుగు అని సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులు డి. రాజా, సీతారాం ఏచూరి పేర్కొన్నారు. మోదీని గద్దె దించితేనే దేశానికి రక్షణ ఏర్పడుతుందని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీకి వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటం చేసేది కమ్యూనిస్టులు మాత్రమేనని స్పష్టం చేశారు. దేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు, రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తీసుకు వచ్చేందుకు ఆర్‌ఎస్‌ ఎస్‌, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడిరచకపోతే దేశాన్ని, రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేమని చెప్పారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడిరచే బాధ్యత వామపక్షాలతో పాటు లౌకిక, ప్రగతిశీల శక్తులు, పార్టీలపై కూడా ఉన్నదన్నారు. హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో సీపీఐ, సీపీఎం మండల, జిల్లా, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి నాయకుల సంయుక్త సమావేశం ఆదివారం జరిగింది. పదివేల మందికిపైగా ఉభయ పార్టీల వివిధ స్థాయి నాయకత్వం ఇందులో పాల్గొన్నది. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యద ర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, సీపీఎం పోలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
పరస్పర విశ్వాసం ద్వారా ఐక్యత: రాజా
అన్ని రంగాలలో సంక్షోభం సృష్టిస్తున్న, రాజ్యాంగాన్ని, సమాఖ్యస్ఫూర్తిని, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీని ఐక్యత ద్వారానే ఓడిరచగలమని, ఈ వాస్తవాన్ని లౌకిక, ప్రాంతీయ, మధ్యేవాద పార్టీలు గుర్తించాలని డి.రాజా విజ్ఞప్తి చేశారు. గతంలో ఒకే దేశం, ఒకే ఎన్నికలు, ఒకే సంస్కృతి, ఒకే భాష అనే బీజేపీి, ఆర్‌ఎస్‌ఎస్‌ రాను రాను ఒకే దేశం ఒకే పార్టీ, ఒకే నాయకుడు, అది మోదీ అనే స్థాయికి చేరుకున్నాయన్నారు. ఆర్‌ఎస్‌ ఎస్‌ సిద్ధాంతం ఫాసిస్టు సిద్ధాంతమని, వారి లక్ష్యం విభజనవాదం, హిందూ రాష్ట్రం, ఏక సంస్కృతి, మధ్య యుగాల విధానాల పునరుద్ధరణ అని పేర్కొన్నారు. భారత దేశం హిందూ రాష్ట్రంగా మారితే అది అత్యంత తీవ్ర విపత్తుగా మారుతుందని రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ చెప్పారని, కాని బీజేపీి, ఆర్‌ఎస్‌ ఎస్‌ ఆ ప్రయత్నాలే చేస్తున్నాయని విమర్శించారు. భారతదేశం రాష్ట్రాల కూటమి అని, అయినప్పటికీ గవర్నర్‌ను ఆయుధంగా మార్చుకొని బీజేపీి, ఆర్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరు స్తున్నాయన్నారు. కమ్యూనిజం ప్రమాదకరమైన సిద్ధాంతమని, అది దావానలంలా దహించి వేస్తుందని ప్రధాని మోదీ అన్నారని, అది వాస్తవమేనని మోదీ, బీజేపీలకు కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రమాదకర మైనదేనని రాజా అన్నారు. సంపద సృష్టికర్తలైన రైతులు, కార్మికులు, ఇతర వర్గాల ప్రజలకు కమ్యూనిస్టు సిద్దాంతం ప్రియమైనదన్నారు. కమ్యూనిస్టు పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఒకేసారి పుట్టాయని, కాని దేశ స్వాతంత్య్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర లేదని, కమ్యూనిస్టు నాయకులు వలసవాదానికి, బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం అపూర్వ పోరాటంలో ఎన్నో త్యాగాలు చేశారని రాజా చెప్పారు. బీజేపీని ఓడిరచేందుకు చరిత్ర మరోసారి కమ్యూనిస్టులకు కర్తవ్యాన్ని అందిస్తోందని, 2024లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఓడిస్తామన్నారు. కమ్యూనిస్టుల ఐక్యత మాత్రమే దేశాన్ని కాపాడుతుందని, మితవాద, ఫాసిస్టు రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని చెప్పారు. అందుకు పార్లమెంటు, శాసనసభలో కమ్యూనిస్టుల బలం పెరగాలని, అలా జరిగితేనే దేశ రాజకీయ స్వరూపాన్ని మార్చగలమని వక్కాణించారు. వామపక్ష ఐక్యతకు సీపీిఐ, సీపీఎం మరింత సన్నిహితంగా, ఐక్యంగా పని చేయాలని, అన్ని స్థాయిల్లో పరస్పర విశ్వాసం, సమన్వయం అవసరమని రాజా సూచించారు. ఎర్రజెండాలు రెండు కాదు ఒకటేనని నిరూపించాలన్నారు. 1989లో కలకత్తాలో జరిగిన సీపీిఐ జాతీయ మహాసభలో కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణకు నాటి ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు ప్రతిపాదన చేయగా, ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని గుర్తుచేశారు.1992లో సీపీఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఇంద్రజిత్‌ గుప్తా, నాటి సీపీఎం ప్రధాన కార్యదర్శి హరి కిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ అత్యంత సఖ్యతతో పని చేశారని రాజా గుర్తు చేశారు. దేశ కార్మిక వర్గ ప్రయోజనాల దృష్ట్యా సీపీఐ, సీపీఎం ఐక్యంగా పనిచేసేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో ఉభయ పార్టీలు సమన్వయకమిటీలు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర కమిటీలకు వారిద్దరూ సర్క్యులర్‌ పంపారని, కాని అది ముందుకు సాగలేదన్నారు. నాడు వారిద్దరితో సన్నిహితంగా పని చేసిన తాను, సీతారాం ఏచూరి ఉభయ పార్టీలకు ప్రధాన కార్యదర్శులం అయ్యామని, వామపక్షాల ఐక్యత, సమన్వయం కోసం తామిరువురం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీల వివిధ స్థాయి నాయకత్వ ఉమ్మడి సమావేశం దేశానికే స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన సీపీఐ జాతీయ మహాసభలో కమ్యూనిస్టుల ఏకీకరణ గురించి ప్రతిపాదించినట్లు చెప్పారు. అదానీ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయాలని ప్రతిపక్షాలు కోరుతుంటే, పార్లమెంటును అధికార బీజేపీ ముందుకు సాగనీయకుండా అడ్డుకుంటోందని రాజా విమర్శించారు. జేపీసీిలో మెజారిటీ సభ్యులు బీజేపీి ఎంపీిలే ఉంటారని కొందరు అంటున్నారని, అయినప్పటికీ జేపీసీిని వేసేందుకు బీజేపీ ఎందుకు అంగీకరించడం లేదని నిలదీశారు. భారత దేశం సంక్షేమ రాజ్యమని రాజ్యాంగం పేర్కొన్నదని, కాని బీజేపీి ప్రభుత్వం సంక్షేమ రాజ్యం కాకుండా చేసిందన్నారు.
మోదీని ఓడిరచలేమనడం భ్రమ: ఏచూరి
అందరు కలిసి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించితే తప్ప దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోలేమని సీతారాం ఏచూరి అన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదాలను కాపాడుకునేందుకు ఒకవైపు ప్రజా ఉద్యమాన్ని చేస్తూ, మరోవైపు బీజేపీిని ఓడిరచేందుకు లౌకికవాదులు, ప్రగతిశీల శక్తులు కలిసి రావాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఒత్తిడి పెట్టాల్సిన బాధ్యత వామపక్షాలపై ఉన్నదన్నారు. దేశంలో మోదీ గాలి ఉందనే ప్రచారం వాస్తవం కాదన్నారు. దేశంలోని ప్రచార సాధనాలు, మీడియా అన్ని బీజేపీి చేతిలోనే ఉన్నాయని, అవి మోదీని ఎవరూ ఓడిరచలేరనే ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇటీవల త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ శాసనసభలకు ఎన్నికలు జరిగాయని, ఆ రాష్ట్రాలలో మొత్తం 180 స్థానాలు ఉంటే, బీజేపీి 46 స్థానాలలోనే గెలిచిందని, 58 స్థానాలలో డిపాజిట్‌ కోల్పోయిందన్నారు. నాగాలాండ్‌లో రెండు స్థానాలే గెలిచిందని, త్రిపురలో మెజారిటీ కంటే రెండు సీట్లే ఎక్కువ గెలిచిందని, గతంలో గెలిచిన 17 స్థానాలలో ఓడిపోయిందన్నారు. అంతకుముందు హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీి ఓడిపోయి కాంగ్రెస్‌ గెలిచిందని, దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో 15 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఓడిపోయి ఆప్‌ గెలిచిందని, గుజరాత్‌లో మాత్రమే బీజేపీ తిరిగి గెలవగలిగిందన్నారు. ఈ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని, ఈ పని సీపీఐ, సీపీఎం తప్ప ఎవరూ చేయలేరని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయినా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని చెబుతున్నారని, అంటే సీబీఐ, ఈడీ, డబ్బును ఉపయోగించి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపులకు పాల్పడి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే బీజేపీవారి పని అన్నారు. ఇప్పటికే గోవా, మధ్యప్రదేశ్‌, కర్నాటక , తదితర రాష్ట్రాలలో ఫిరాయింపులతో బీజేపీి అధికారంలోకి వచ్చిందన్నారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మతోన్మాదానికి వ్యతిరేకంగా రాజకీయ, సైద్ధాంతిక పోరాటంకొనసాగించాలని అన్నారు. రెండు కమ్యూనిస్టు పార్టీల మధ్య కింది స్థాయి నుండి ఇలాంటి ఐక్యత రావడం ఈ దశాబ్దంలో ఎక్కడా జరగలేదని సీతారాం ఏచూరి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం కలిగిన ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమ వైభవాన్ని పునరుద్ధరించాలంటే కమ్యూనిస్టుల మధ్య ఐక్యత అనివార్యం, అవసరమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం ఒక ముందడుకు వేశాయనీ, ఒక కొత్త మార్గాన్ని శోధించాయని, ఈ పనిని ఉభయ పార్టీల నాయకత్వాలు ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర స్థాయిలో చర్చిస్తామని అన్నారు. ప్రతి రాష్ట్రంలో ఆయా నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా బీజేపీ ఓటమికి ప్రయత్నాలు చేయాలని అన్నారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా ఇక్కడ అభివృద్ధి చేద్దామనుకుంటే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోందని అన్నారని, ఆయన ఖర్చు పెట్టేది ప్రజల సొమ్ము అని , అదేదో సొంత ఘనకార్యంగా చెప్పుకుంటున్నారని ఏచూరి విమర్శించారు. బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక అధికారాలను లాగేసుకుంటున్నారని, ఆ పార్టీ నాయకులపై సీబీఐ, ఈడీని ఉపయోగిస్తూ రాష్ట్రప్రభుత్వాలను అస్థిర పరుస్తున్నారని చెప్పారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ మాట్లాడుతూ,గాడ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి ప్రధాని మోదీ అని, ఆయన దేశానికే ప్రమాదకారి అని విమర్శించారు. మోదీ సామన్యుడు కాదని, ప్రత్యేకంగా వచ్చిన గాడ్సే, ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్కృతి ఉట్టిపడేలా వ్యవహారిస్తున్నారన్నారు. మోదీకి 30మంది దత్తపుత్రులు ఉన్నారని, ఇందులో 29 మంది ఎక్కడికోవెళ్లి దాక్కున్నారని, అదానీ మాత్రం ఇక్కడే ఉన్నారన్నారు. అధ్యక్షపదవి, జ్యూడిషియల్‌, అనుకూలంగా ఉన్నవారిని గవర్నర్లుగాను, రాజ్యసభకు పంపిస్తారా? అని ప్రశ్నించారు. సీబీఐని పెంపుడు కుక్కలాగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ప్రధాని మంత్రివర్గంలో 24 మందిపైన హత్య, అత్యాచారం, రక రకాలుగా కేసులు ఉన్నాయని తెలిపారు. దొంగలను దోపిడీదారులను పెట్టుకుని, అవినీతిని నిర్మూలిస్తామంటే ఎవరు నమ్ముతారని నారాయణ ప్రశ్నించారు. బ్లాక్‌ మనీని మొత్తం తెల్ల డబ్బులుగా అయ్యాయని తెలిపారు. దేశం మొత్తంగా ఉన్న బ్యాంక్‌ ఖాతాల లెక్కలు బయటికి తీస్తే లెక్కలు కనిపిస్తాయని తెలిపారు. బీవీ రాఘవులు మాట్లాడుతూ, రాబోయే 2024లో పొరపాటున మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తే దేశ భవిష్యత్‌ అంధాకారమేనని,భారతదేశం సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం కాదని, అమ్మకాలు చేసే ప్రభుత్వమని విమర్శించారు. బీజేపీకి ఉత్తరాదిన సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని, అందుకే దక్షిణాదిలో పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. ఫాసిజం బలపడి, ఫాసిస్టుల శక్తులకు అధికారం వస్తే ఎలాంటి వినాశకర ఫలితాలు వస్తాయో గతంలోనే చూశామన్నారు. ప్రతిపక్షాలు ఉన్న చోటనే అవినీతి ఉంటుందా? అని ప్రశ్నించారు. దేశంలో పెద్ద అవినీతి ఎక్కడైనా ఉంటే అది మోదీ ప్రభుత్వమేనని విమర్శించారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, కమ్యూనిస్టు పార్టీలు ఏ రాజకీయ పార్టీ వద్దకు వెళ్లడం లేదని, ఇతర పార్టీలే వారి రాజకీయ అవసరాల కోసం కమ్యూనిస్టుల వద్దకు వస్తున్నాయని స్పష్టం చేశారు. బీజేపీిని రాష్ట్రంలో అడుగు పెట్టనీయకుండా ఉండటమే కర్తవ్యంగా పెట్టుకుందామని, ఆ వైపుగా నడుద్దామని, కమ్యూనిస్టులు కాలానికే దిక్సూచి చూపిస్తారనేది రుజువు చేయాలన్నారు. అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. వంద సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీలన్నారు. మనం ఎవరికి తలవంచొద్దని, మనం ఎవరికంటే తక్కువ కాదన్నారు. తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, ఎమ్మెల్యే, ఎంపీి సీట్లు కాలిగోటితో సమానమని అన్నారు. కమ్యూనిస్టు పార్టీల స్థానం ఎప్పుడూ మారడం లేదని, మారిందల్లా ఇతర పార్టీల స్థానాలు మాత్రమే అని, తాము అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నామని స్పష్టం చేశారు. కార్మిక వ్యతిరేక ధోరణిని కేసీఆర్‌ అవలంభిస్తే పోరాటం చేయడం తప్పదని హెచ్చరించారు.
11న బాగ్‌ సుందరయ్య పూలే జయంతి సభ
ఈ నెల 11వ తేదీన ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కమిటీల అధర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాత్మ జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కూనంనేని సాంబశివ రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు వామపక్ష ఐక్యత పై రాసిన పాటల సిడిని రాజా, ఏచూరి ఆవిష్కరించారు. తెలంగాణకు చెందిన అభ్యుదయ రచయితలు, వామపక్ష రచయితలు రచించిన ‘మతోన్మాదాన్ని ఓడిద్దాం’ అనే పాటల పుస్తకాన్ని నారాయణ, రాఘవులు ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img