Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మిర్చి మటాష్‌ !

పంటను తుడిచిపెట్టిన తామరపురుగు
పురుగుమందులెన్ని కొట్టినా ప్రయోజనం శూన్యం
వ్యవసాయ శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని చీడ
ఏపీతోపాటు మరో ఏడు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి
నష్టం లక్షల కోట్లలోనే
రైతులు కన్నీటి పర్యంతం
జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని రైతు సంఘం డిమాండ్‌
21`23 తేదీల్లో ఉద్యానవనశాఖ కార్యాలయం ఎదుట రిలేదీక్షలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఈ ఏడాది మిర్చి పంట రైతును చావు దెబ్బ తీసింది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్నట్లు…పంట ఏపుగా పెరిగి…మార్కెట్‌లో గిట్టుబాటు ధర అందుబాటులో ఉండి కూడా రైతు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూలేని విధంగా విచిత్రమైన తామరపురుగు పంటను ఆశించి సర్వనాశనం చేసింది. అది కూడా అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ఏపీతో పాటు చుట్టుపక్కల ఆరేడు రాష్ట్రాల్లోనూ మిర్చి తోటలన్నింటినీ మట్టుపెట్టింది. విచిత్రమేమిటంటే వ్యవసాయ శాస్త్రవేత్తలకు సైతం ఇది అంతుచిక్కని సమస్యగా మారింది. తామరపురుగు నివారణకు ఏ మందు వాడాలో నిర్ధారించలేకపోయారు. దీంతో పంటకొచ్చిన తోట కళ్లముందు నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోలేక పురుగుమందు దుకాణ యజమానులు చెప్పిన ప్రతి మందును ఆశతో ప్రయోగించి రైతులు ఆర్థికంగా మరింత నష్టపోయారు. సహజంగా మిర్చి దిగుబడి ప్రకృతి సహకరిస్తే ఎకరాకు 40 క్వింటాళ్ల వరకు వస్తుంది. సగటున 25 క్వింటాళ్లు మాత్రం ఖాయం. అటువంటి పంట ఈ ఏడాది 5 క్వింటాళ్లు వస్తే అదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో మిర్చి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏ మిర్చి రైతును కదిలించినా గుండె చెరువవుతోంది. అత్యధిక పెట్టుబడి సాగు వాణిజ్య పంటల్లో మిర్చి ఒకటి. ఎకరాకు కనీసం లక్ష రూపాయల పెట్టుబడి అవుతుంది. ఇక కౌలు రైతుకి అయితే మరో రూ.30 నుంచి రూ.40వేలు అదనంగా కౌలు ఖర్చు పెరుగుతుంది. అటువంటిది ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్ల దిగుబడి వస్తే కౌలుకి సరిపోని దయనీయ పరిస్థితి నెలకొంది. దీంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక, సమాధానం చెప్పలేక రైతులు నరకం చూస్తున్నారు. గతేడాది మిర్చి ఉత్పత్తులకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించడంతో ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు జిల్లాలతో పాటు కొన్ని ఇతర ప్రాంతాల్లో నాలుగున్నర లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగైంది. అధికారుల లెక్కల ప్రకారం గతేడాది కంటే దాదాపు లక్ష ఎకరాల్లో ఎక్కువగా పంట సాగైనట్లు అధికారులు చెపుతున్నారు. గత ఏడాది పంట ఉత్పత్తికి ఉన్న డిమాండ్‌ దృష్ట్యా రైతులు ఎక్కువసంఖ్యలో మిర్చి సాగుకు ఆసక్తి చూపారు. దీంతో కౌలు రేట్లు కూడా పెరిగాయి. అత్యధికంగా కొన్ని ప్రాంతాల్లో కౌలు రేటు ఎకరం రూ.45వేలు పలికింది. ఇక సాగు విస్తీర్ణంలో అక్కడక్కడా ముందస్తుగా వేసిన ముదురు పంటలు కొద్దొగొప్పో దిగుబడులు రాగా, అదను ఆలస్యమైన లేత మిర్చి పంటలు మాత్రం పూర్తిగా దెబ్బతిన్నాయి. పంట ఏపుగా పెరిగిన తర్వాత పూత దశలో ఈ తామరపురుగు ఆశించింది. దీనివల్ల పూత పిందెగా మారకుండానే రాలిపోవడం, రసం పీల్చడం వల్ల మొక్క గిడసబారిపోయింది. ఈ సంవత్సరం వాతావరణ మార్పులు కూడా ఈ పురుగు వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమైనట్లు వ్యవసాయాధికారులు చెపుతున్నారు. ఏపీలో ఎక్కువగా తేజ రకం, నాటు రకాల్లో 414 రకం విత్తనాలను రైతులు వినియోగించారు. ఎక్కువమంది రైతులు విత్తనాలు ఎద పెట్టే పద్ధతి పాటిస్తుండగా, మరికొందరు మొక్క నాటే విధానాన్ని అవలంబించారు. మిర్చి నారుమళ్లు కొందరు ప్రత్యేకంగా పెంచి, రైతులకు ఒక్కో మొక్కను రూపాయి నుంచి రూ.3వరకు విక్రయించారు. ఎకరానికి సుమారు 5వేల మొక్క పడుతుంది. ఇక దుక్కులు, ఎరువులు, కలుపులు, పురుగుమందులు, నీటి తడులు ఇవన్నీ కలిపితే పెట్టుబడి తడిసి మోపెడవుతోంది. రైతు శ్రమ కాకుండా కౌలుతో కలిపి లక్షన్నర ఖర్చు దాటుతుంది. దీంతో ఎకరానికి కనీసం 20 క్వింటాళ్లు పండితేనే పెట్టుబడి వస్తుంది. అటువంటిది రెండు, మూడు క్వింటాళ్లకే పరిమితం కావడంతో ఫెర్టిలైజర్స్‌ యజమానులకు, ప్రైవేటుగా అప్పులు తెచ్చిన వారికి బాకీలు ఎలా చెల్లించాలో అర్థంగాక రైతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర మంత్రులు, శాస్త్రవేత్తలు పరిశీలించినా ప్రయోజనం శూన్యం
గతంలో దేశవ్యాప్తంగా మిడతల దండు తరహాలో తామరపురుగు తెగులు మిర్చి పంటను అనేక రాష్ట్రాల్లో నాశనం చేయడంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు, లాంఫాం శాస్త్రవేత్తలతోపాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ శాస్త్రవేత్తలు పరిశీలించి కొన్ని సలహాలిచ్చినప్పటికీ దానిని అరికట్టలేకపోయారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు సైతం తామరపురుగు ఆశించిన పంటలను ప్రత్యక్షంగా పరిశీలించి, నివారణా చర్యలకు అధికారులను ఆదేశించారు. కేంద్ర మంత్రి తోమర్‌ 8 రాష్ట్రాల్లో తామరపురుగు తెగులు వల్ల మిర్చి పంట దెబ్బతిన్నట్లు అంగీకరించారు. కానీ రైతును ఆదుకునే చర్యలు మాత్రం ఏమీ చేపట్టలేదు.
21నుంచి 23వరకు ఏపీ రైతు సంఘం ఆందోళనలు
మిర్చి రైతుకు ఈ ఏడాది జరిగిన అన్యాయంపై మూడు నెలలుగా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళుతున్నా పట్టించుకోవడం లేదని, దీంతో ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు గుంటూరు ఉద్యానవనశాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద రిలేదీక్షలు చేపడుతున్నామని ఏపీ రైతు సంఘం అధ్యక్షులు రామచంద్రయ్య, ప్రధానకార్యదర్శి కేవీవీ ప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శి మల్నీడు యలమందరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి, ఎకరాకు రూ.50వేల నష్టపరిహారాన్ని చెల్లించాలని, పంటల బీమా పథకం వర్తింపజేయాలని, పంట కాలంలో రైతులు తీసుకున్న రుణాలు రద్దు చేయాలని, దేవదాయ, ధర్మాదాయ భూముల్లో సాగు చేసిన మిర్చి రైతులకు కౌలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోకపోతే ఆత్మహత్యలు జరిగే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరించారు. 23న గుంటూరులో జరిగే భారీ ప్రదర్శనకు రైతులు పెద్దసంఖ్యలో తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img