Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిగా

సిద్ధ, డీకే ప్రమాణం

. కొత్త మంత్రులుగా ఎనిమిది మంది కూడా
. కర్నాటకలో కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం
. ప్రతిపక్షాల బలప్రదర్శనకు వేదికగా ప్రమాణ స్వీకారోత్సవం
. హాజరైన విపక్షాల నాయకులు

బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ కంఠీరవ మైదానంలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహిం చారు. సిద్ధరామయ్య తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే మైదానంలో కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో జి.పరమేశ్వర, కేహెచ్‌ ముణియప్ప, కేజే జార్జి, ఎంబీ పాటిల్‌, సతీశ్‌ జార్ఖిహోళి, ప్రియాంక్‌ ఖడ్గే (ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే తనయుడు), రామలింగ రెడ్డి, బీజెడ్‌ జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ ఉన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్‌ గెహ్లాట్‌ (రాజస్థాన్‌), భూపేశ్‌ బాఘెల్‌ (చత్తీస్‌గఢ్‌), సుఖ్విందర్‌ సింగ్‌ సుక్కు (హిమాచల్‌ ప్రదేశ్‌), తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌, సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారం ఏచూరి, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, ఎన్‌సీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ హాజరయ్యారు. దీంతో ప్రమాణ స్వీకారోత్సవం… ప్రతిపక్షాల బలప్రదర్శనకు వేదికగా మారింది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గైర్హాజరు కాగా ఆమె స్థానంలో లోక్‌సభలో టీఎంపీ డిప్యూటీ నేత కకోలి ఘోష్‌ దస్తిదార్‌ హాజరయ్యారు. కాంగ్రెస్‌ బలంగా ఉన్న చోట ఆ పార్టీకి మద్దతిస్తామని 2024 లోక్‌సభ ఎన్నికలనుద్దేశించి మమత ఇటీవల ప్రకటించారు. ‘కాంగ్రెస్‌ ఎక్కడ బలంగా ఉంటే అక్కడ పోటీ చేయనివ్వండి. మేము మద్దతిస్తాం. అందులో తప్పేమీ లేదు. ఆ పార్టీ కూడా మిగతా పార్టీలకు మద్దతివ్వాలి’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌ అఖండ విజయాన్ని సాధించిన క్రమంలో ఆమె ఈ ప్రకటన చేశారు. ప్రతిపక్షాల ఐక్యతకు, బల ప్రదర్శనకు, సంఫీుభావానికి లాంచ్‌ప్యాడ్‌గా ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని కేంద్రమాజీ మంత్రి ఎం.వీరప్ప మొయిలీ అన్నారు. కార్యక్రమానికి జేఎంఎం, ఆర్‌జేడీ, శివసేన, ఎస్‌పీ, ఎండీఎంకే, ఆర్‌ఎస్‌పీ, సీపీఐ(ఎంఎల్‌), వీకేసీ, ఆర్‌ఎల్‌డీ, కేరళ కాంగ్రెస్‌, ఐయూఎంఎల్‌ పార్టీల నాయకులను కూడా కాంగ్రెస్‌ ఆహ్వానించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img