Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మూడు ముక్కల సీఎంకు భయపడాలా?

. కడవరకూ రాజకీయాల్లోనే
. పొత్తులపై సంకేతాలు
. ప్ర్రాణత్యాగానికైనా సిద్ధం
. కుంటుపడిన రాష్ట్రాభివృద్ధి
. యువశక్తి సభలో పవన్‌

విశాలాంధ్ర`రణస్థలం(శ్రీకాకుళం): రాజు అసమర్థుడైతే రాజ్యం సగం నాశనం అయిపోతుందన్న నానుడి మన రాష్ట్ర ప్రస్తుత పరిస్థితికి అద్ధంపడుతుందని, మూడు ముక్కల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడిరదని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో గురువారం ఏర్పాటు చేసిన యువశక్తి కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ 2019 నుంచి రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిరదని, అసంపూర్తిగా పోలవరం, రాజధాని నిర్మాణాలు, నిరుద్యోగం పెరగడం, గుంతల మధ్య రోడ్లు, బెదిరింపు రాజకీయాలు, బూతులు తిట్టే మంత్రులే కనిపిస్తున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లా, అభివృద్ధికి అమడదూరంలో ఉందని, ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటుతనానికి నిదర్శనంగా నిలుస్తుందని ఇది పాలకుల పాపమేనన్నారు. ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి అందించడం ప్రభుత్వాల బాధ్యత అని, అది జరగకపోవడంతో ఈ ప్రాంతం నుంచి వలస వెళ్లిపోతున్నారని, తెలుగు ప్రజలు కష్టాలు చూసి, ఆ కష్టాల నుంచి ప్రజలను బయటపడేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, నా మీద ఎన్ని దాడులు జరిగినా వ్యక్తిగతంగా ఎన్ని విమర్శలు చేసినా కేవలం ప్రజల కోసమే భరిస్తున్నానని అన్నారు. ప్రతీ సన్నాసి మాటలు భరించేది బాధల్లో ఉన్నవారిని ఆదుకోవడం కోసమేనని, నన్ను ఎంత హింసించినా, బాధపెట్టినా ప్రజల పక్షాన నిలబడడం ఆగదని, నా చివరి శ్వాస ఉన్నంత వరకు రాజకీయాల్లోనే కొనసాగుతా, ప్రజల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు.
మూడు ముక్కల ప్రభుత్వం ..
మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ సీఎం జగన్‌పై పవన్‌ కల్యాణ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరినో తిట్టడానికి ఈ సభ పెట్టలేదన్నారు. మహా అయితే ప్రాణం పోతుందని, కానీ ఒక సత్యాన్ని బలంగా మాట్లాడిన వాడినవుతానని అన్నారు. తన కోసం కాకుండా , సాటి మనిషి కోసం జీవించే జీవితం గొప్పదని ఆయన అన్నారు. అధికారంలోకి రాగానే ప్రజల్ని బానిసల్లా చూసే వ్యక్తిత్వాలు తనకు చిరాకని పవన్‌ అన్నారు. సమాజం, దేశం కోసం ముందుకు రావాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. యువతలో కోపం వుంది, కానీ భయం కూడా వుందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నేతలకు భయపడనక్కర్లేదని పవన్‌ స్ఫష్టం చేశారు. ఇది కళింగాంధ్ర కాదని.. కలియబడే ఆంధ్ర అన్న ఆయన.. మీరు మౌనంగా వుంటే ఎలా అని ప్రశ్నించారు.
కడ వరకూ రాజకీయాల్లోనే ఉంటా…
రణస్థలంలో మాట ఇస్తున్నా.. కడ శ్వాస వరకు రాజకీయాలను వదలను. పూర్తి స్థాయి రాజకీయ నాయకులం అని కొందరు చెబుతారు. ఈ దేశంలో పూర్తి స్థాయి రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారు? అందరూ వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తూనే రాజకీయాల్లో ఉన్నారు. కపిల్‌ సిబల్‌, చిదంబరం లాంటి వారు కూడా న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే రాజకీయాల్లో ఉన్నారు. అందుకే నేను కూడా రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తున్నా. పార్టీని నడిపేంత డబ్బు వస్తే సినిమాలు వదిలేందుకు సిద్ధమని పవన్‌ ప్రకటించారు.
పొత్తులపై సంకేతాలు
ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి వీర మరణాలు అక్కర్లేదని పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంటరిగా ఉండి గెలుస్తానంటే తనకు ఎవరి పొత్తులు అక్కర్లేదు…మీరు అండగా వుంటానని గ్యారెంటీ ఇస్తారా అని పవన్‌ సభకు హాజరైనవారిని ప్రశ్నించారు. ఇప్పుడు ఓకే అని చెప్పి ఎన్నికలు అవ్వగానే మా వాడు, మా కులం అని అంటే కుదరదని ఆయన తేల్చిచెప్పారు. తాను మిమ్మల్ని కుటుంబం అనుకున్నానని, తన ఫ్యామిలీయే వదిలేస్తే తాను ఏం చేయాలని పవన్‌ ప్రశ్నించారు. కొన్నిసార్లు ప్రత్యర్థులని కూడా కలుపుకునిపోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అందరినీ హింసించే ఒక్కడిని ఎదుర్కోవాలంటే అందరూ కలవాలని పవన్‌ అన్నారు. గౌరవం తగ్గకుండా , మనం లొంగిపోకుండా కుదిరితే కలిసి పోటీ చేస్తాం… లేదా ఒంటరిగానే వెళ్తామని పొత్తులపై ఆయన తేల్చేశారు. ఓడిపోతే ఇంట్లో కూర్చొన్నాం… బయటికొచ్చాం తిరిగామని పవన్‌ వ్యాఖ్యానించారు. రాజకీయం ఎంత సేపటికీ రెడ్డి, కమ్మ, కాపు కులాల చుట్టూనే తిరుగుతున్నాయనిచ ఇంకా ఎన్నో కులాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img