Friday, April 19, 2024
Friday, April 19, 2024

మెరుగైన అఫిడవిట్‌ వేయండి

విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు ఆదేశం
న్యూదిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో గత ఏడాది డిసెంబరులో జరిగిన ధర్మ సంసద్‌లో విద్వేష ప్రసంగాల కేసులో పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికన్నా మెరుగైన అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఓఖ్లా పోలీస్‌ స్టేషన్‌ అధికారి సమర్పించిన దర్యాప్తు నివేదికను ఎవరైనా ఉన్నతాధికారి తనిఖీ చేశారా? అని ప్రశ్నించింది. న్యాయస్థానం సమక్షంలో దాఖలు చేసే అఫిడవిట్‌లో ఇటువంటి వైఖరిని ప్రదర్శించవచ్చునా? అనే విషయాన్ని ఉన్నతాధికారులెవరైనా సరి చూశారా? అని అడిగింది. హిందూ యువ వాహిని గత ఏడాది హరిద్వార్‌, దిల్లీలలో నిర్వహించిన ధర్మ సంసద్‌ కార్యక్రమాల్లో కొందరు విద్వేషపూరితంగా ప్రసంగించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా ధర్మాసనం..పోలీసులు సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలించింది. ఓఖ్లా పోలీస్‌ స్టేషన్‌ అధికారి దర్యాప్తు చేసి, సమర్పించిన నివేదికను ఉన్నతాధికారులెవరైనా తనిఖీ చేశారా? అని జస్టిస్‌ ఖన్విల్కర్‌ ప్రశ్నించారు. దీనిని దిల్లీ పోలీసు శాఖలోని డిప్యూటీ పోలీస్‌ కమిషనరే దాఖలు చేశారా? అని ప్రశ్నించారు. దర్యాప్తు నివేదికను తిరిగి రాశారా? లేదంటే తన వివేకాన్ని వర్తింపజేశారా? అని ప్రశ్నించారు. ఆయన సూక్ష్మమైన అంశాలను అర్థం చేసుకోగలరని భావిస్తున్నామన్నారు. ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేయడంతో అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కేఎం నటరాజ్‌ స్పందిస్తూ, పోలీసు శాఖ దీనిని పరిశీలిస్తుందని, తాజాగా మరొక అఫిడవిట్‌ను దాఖలు చేస్తామని చెప్పారు. దిల్లీలో జరిగిన ధర్మ సంసద్‌లో విద్వేష ప్రసంగంపై సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుకు దిల్లీ పోలీసుల సమాధానంలో, ఈ కార్యక్రమంలో ఎటువంటి విద్వేషాన్ని వ్యక్తం చేయలేదని తెలిపారు. ఏదైనా మతపరమైన లేదా విశ్వాసపరమైన సమూహం, సముదాయం, భౌగోళికంగా స్థానికులపై ఎటువంటి విద్వేషాన్ని వ్యక్తం చేయలేదని తెలిపారు. ఉనికిని దెబ్బతీసే ముప్పును ఎదుర్కొనడానికి తమ మతాన్ని సాధికారం చేయడంపైనే ఈ ఉపన్యాసం ఉందని చెప్పారు. ఫలానా మతస్థులపై నరమేధానికి పాల్పడాలనే పిలుపు ఈ ప్రసంగంలో లేదని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img