Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మోగిన ఎన్నికల నగారా

నవంబరు 12 హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలు
17 నుంచి నామినేషన్లు
25న ఉపసంహరణ అ డిసెంబరు 8న ఫలితాలు
గుజరాత్‌ షెడ్యూల్‌ ప్రకటించని ఈసీ

న్యూదిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల షెడ్యూలును చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ శుక్రవారం ప్రకటించారు. కోవిడ్‌-19 మహమ్మారి ఆందోళన ఇక లేదని ఆయన చెప్పారు. శాసనసభ ఎన్నికలు నవంబరు 12న ఒకే విడతలో నిర్వహిస్తామని, ఓట్ల లెక్కింపు డిసెంబరు 8న ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఈనెల 17 నుంచి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయవచ్చునని, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈనెల 25 అని, ఉపసంహరణకు చివరి తేదీ 29 అని తెలిపారు. తొలిసారి ఓటు హక్కు పొందినవారి సంఖ్య 1.86 లక్షలని, 80 ఏళ్ల వయసు పైబడిన ఓటర్ల సంఖ్య 1.22 లక్షలని తెలిపారు. మొత్తం ఓటర్ల సంఖ్య 55 లక్షలన్నారు. ఎన్నికలకు సంబంధించిన బూటకపు వార్తలు, వదంతులపై నిఘా పెట్టేందుకు సామాజిక మాధ్యమాల బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 80 ఏళ్ల వయసు పైబడినవారు, అదేవిధంగా 40 శాతం పైబడిన అంగవైకల్యం గలవారు తమ ఇంటి వద్ద నుంచే ఓటు వేయవచ్చునన్నారు. మీడియా సమావేశంలో రాజీవ్‌ కుమార్‌తోపాటు ఎన్నికల కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే పాల్గొన్నారు.
గుజరాత్‌ ఎన్నికల తేదీలను ఎందుకు ప్రకటించలేదంటే..?
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించకుండా ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సాధారణంగా రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాలు ఆరు నెలల వ్యవధిలో ముగుస్తుంటే గనుక.. ఆ రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించి ఓట్ల లెక్కింపు కూడా ఒకే రోజున చేపడతారు. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి8తో ముగుస్తుండగా.. గుజరాత్‌ శాసనసభ పదవీకాలం ఫిబ్రవరి 18తో పూర్తికానుంది.
దీంతో ఈ రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తారని అంతా భావించారు. అయితే నేటి షెడ్యూల్‌లో హిమాచల్‌కు మాత్రమే తేదీలు ప్రకటించడంపై మీడియా ఈసీని ప్రశ్నించింది. దీనికి కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌ కుమార్‌ స్పందిస్తూ.. ‘‘వాతావరణంతో పాటు అనేక కారణాల వల్ల హిమాచల్‌ ఎన్నికల తేదీలను కాస్త ముందుగా ప్రకటించాం. 2017లోనూ ఇదే సంప్రదాయం ప్రకారం ఎన్నికలు జరిగాయి. ఆ ఏడాది అక్టోబరు 13 హిమాచల్‌కు, అక్టోబరు 25న గుజరాత్‌కు షెడ్యూల్‌ ప్రకటించాం. అయితే రెండు రాష్ట్రాల ఫలితాలను మాత్రం ఒకేసారి వెల్లడిరచాం. ఇప్పుడు కూడా నిబంధనల ఉల్లంఘనేదీ జరగలేదు. విస్తృత చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేగాక, రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువుల మధ్య 40 రోజుల వ్యవధి ఉంది. ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరో రాష్ట్రంపై పడకుండా ఉండాలంటే కనీసం 30 రోజుల వ్యవధి ఉంటే చాలు’’ అని వివరించారు.
ఇది మోదీకి వరం: కాంగ్రెస్‌
హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలతో పాటు గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించకపోవడంపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ఇది మోదీకి గొప్ప వరం లాంటిదని, ఆయన మరిన్ని పెద్ద హామీలు, ప్రారంభోత్సవాలు చేసే అవకాశం వచ్చిందని పేర్కొంది.కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఈ విధంగా స్పందిస్తుందని ఊహించామనీ, తామేమీ ఆశ్చర్యానికి లోను కాలేదని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img