Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మోదీకి నిరసన సెగ

హోదా, విభజన హామీల సాధన సమితి ఆందోళన
రామకృష్ణ, చలసాని, బాబూరావు అరెస్టు
కేంద్రంపై జగన్‌ ఒత్తిడి పెంచాలి: రామకృష్ణ
నల్లబెలూన్లతో కాంగ్రెస్‌ నిరసన

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు విచ్చేసి ప్రధాని నరేంద్రమోదీకి నిరసన సెగ తగిలింది. మోదీ పర్యటనను నిరసిస్తూ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్వర్యంలో సోమవారం విజయవాడ లెనిన్‌సెంటర్‌లో ఆందోళనలు జరిగాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ బాబూరావు తదితరులు పాల్గొని, అరెస్టయ్యారు. రామకృష్ణ మాట్లాడుతూ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా మోదీ స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి గురించి గంభీరంగా ప్రసంగించారనీ, స్వేచ్ఛా, స్వాతంత్య్రాల గురించి, వాటి కోసం పోరాడిన వీరుల గురించి ఉపన్యాసాలు దంచికొట్టారన్నారు. నిజంగా బీజేపీలో మిగతా నాయకులకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉన్నాయా?, దేశంలో పత్రికలకు, ఛానెళ్లకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉన్నాయా?, సామాజిక ఉద్యమకారులకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉన్నాయా? అని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు, ప్రాంతీయ పార్టీలకు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉన్నాయా? పాలకుల లోపాలను ప్రశ్నిస్తున్న వారి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు హరించివేస్తూ…వాటి గొప్పదనం గురించి ప్రసంగించడానికి ఇంతదూరం వచ్చారా? అని మోదీని ప్రశ్నించారు. ఏపీకి అడుగడుగునా ద్రోహం చేసిన ఏ ముఖం పెట్టుకుని మన్యం వీరుడు అల్లూరి విగ్రహావిష్కరణకు విచ్చేశారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలయ్యేంత వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికీ, కేంద్రీయ విద్యాసంస్థలు, కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు తదితర హామీలకు కేంద్ర ప్రభుత్వం తగు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ ప్రభుత్వానికి రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి పెంచి ప్రత్యేక హోదా సాధించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మోసంపై నిరసన తెలుపుతుంటే పోలీసులతో జగన్‌ సర్కార్‌ అరెస్టు చేయించడాన్ని తప్పుబట్టారు. చలసాని శ్రీనివాస్‌, సీహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ మోదీ కనీసం రాష్ట్రం వైపు చూడబోరనీ, ఇక్కడి బీజేపీ నాయకులను ఖాతరు చేయబోరన్నారు. రాష్ట్ర ప్రజలకు కేంద్రం చాలా విషయాల్లో బకాయిపడి ఉందనీ, ఇప్పటికైనా రాష్ట్రానికి దక్కాల్సిన హామీలు నెరవేర్చాలన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రమాణాలు చేసి, మాట తప్పిన ఘనత మోదీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై ప్రస్తావన చేసే అర్హత కూడా మాకు లేదా? అని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌, సీపీఐ ఎన్టీఆర్‌జిల్లా కార్యదర్శి సీహెచ్‌.కోటేశ్వరరావు, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు బి.రవిచంద్ర పాల్గొన్నారు.
నల్ల బెలూన్లతో కాంగ్రెస్‌ నిరసన
మోదీ పర్యటనకు నిరసనగా గన్నవరం విమానాశ్రయం సమీపంలోని ఓ భవనం నుంచి కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా రాజీవ్‌రతన్‌ నేతృత్వంలో యువకులు నల్లబెలూన్లు ఎగురవేసి, వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రత్యేక హోదాపై రాష్ట్రాన్ని దగా చేసిన మోదీ పర్యటనను అడ్డుకుని, నల్ల బెలూన్లతో నిరసన తెలుపుతామని పరసా రాజీవ్‌రతన్‌ ఇటీవల ప్రకటించారు. మోదీ పర్యటన సందర్భంగా తొలుత గన్నవరం విమానాశ్రయంలో కాంగ్రెస్‌ నాయకురాలు సుంకర పద్మశ్రీ, ఎమ్మార్పీఎస్‌ నేతలు నిరసనకు యత్నించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, సుంకర పద్మశ్రీతోపాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బెలూన్ల ఎగురవేతకు పిలుపునిచ్చిన పరసా రాజీవ్‌రతన్‌ కోసం వెతుకుతున్నామని డీఎస్పీ విజయ్‌పాల్‌ చెప్పారు. కాంగ్రెస్‌ నిరసనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మండిపడ్డారు. హెలికాప్టర్‌ సమీపంలో బెలూన్లు ఎగురవేయడం వెనక కుట్ర దాగి ఉందని, మోదీపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ ఘనటపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామన్నారు. మోదీ గో బ్యాక్‌ అంటూ నినదిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ను రాజమండ్రి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img