Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మోదీకి మహిళలు గుణపాఠం చెప్పాలి

మహిళా సమాఖ్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అత్తిలి విమల
గ్యాస్‌ ధర పెంపుపై విజయవాడలో మహిళల వినూత్న నిరసన

వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.50 పెంచడాన్ని ఖండిస్తూ, తక్షణమే పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య అధ్వర్యాన విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో మహిళలు ఖాళీ గ్యాస్‌ సిలిండర్లు, కుంపట్లు పట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

విశాలాంధ్ర`విజయవాడ (వన్‌టౌన్‌): ఒకవైపు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక, మరోవైపు అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా గ్యాస్‌ సిలిండర్‌ ధరను మరో రూ.50 పెంచడం దుర్మార్గమని మహిళా సమాఖ్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అత్తిలి విమల ఆగ్రహం వ్యక్తంచేశారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.50 పెంచడాన్ని ఖండిస్తూ, తక్షణమే పెంచిన గ్యాస్‌ ధరలు, అధిక ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య ఆధ్వర్యాన విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో మహిళలు ఖాళీ గ్యాస్‌ సిలిండర్లు, కుంపట్లు పట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విమల మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ, నరేంద్రమోదీ ధరలు తగ్గిస్తామని, ప్రజలను ఆదుకుంటామని, ఉద్యోగాలు భర్తీ చేస్తామని, మహిళలకు రక్షణ కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. వారి మాటలు నమ్మి మహిళలు ఓట్లు వేసి గెలిపించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.430 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ను రూ.1,105లకు పెంచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నగదు బదిలీ పేరుతో గ్యాస్‌ సబ్సిడీని తొలగించి ప్రజలపై పెనుభారం మోపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర ధరలు అన్నీ భారీగా పెరిగి ప్రజలు అల్లాడుతున్నారని, మోదీకి మహిళలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మహిళా సమాఖ్య విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామని మోదీ హామీ ఇచ్చారని, కానీ గెలుపొందిన తర్వాత గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, అన్ని వస్తువుల ధరలను భారీగా పెంచేశారని విమర్శించారు. పేదల కష్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే గ్యాస్‌తోపాటు అన్ని నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య విజయవాడ నగర అధ్యక్షులు ఓర్సు భారతి, నగర కమిటీ సభ్యులు తమ్మిన దుర్గ, దుర్గాసి రమణమ్మ, దుగ్గిరాల సీతారావమ్మ, లంకా నాగమణి, దర్శనం పుష్ప, మూలి ఇందిర, చింతాడ పార్వతి, నాయకులు జి.రాహేలమ్మ, నక్కా రాజ్యలక్ష్మి, బి.శాంత, బెవర ఇందిర, సంగుల విజయకుమారి, ఎస్‌కే నాగుర్‌బీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img