Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మోదీవి వినాశకర విధానాలు

విశాఖ ఉక్కును కాపాడుకుంటాం
సీపీిఐ రాష్ట్ర నేతలు

విశాలాంధ్ర – తణుకు : లక్షల కోట్ల రూపాయల విలువైన దేశసంపదను కార్పొరేట్‌ వర్గాలకు దోచిపెడుతూ రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న నరేంద్రమోదీ పాలనకు నిరసనగా ఈ నెల 27జరుగనున్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని సీపీిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేశు పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆదివారం జరిగిన సీపీఐ జన ఆందోళన్‌ పాదయత్రలో వారు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడారు. తొలుత మున్సిపల్‌ ఆఫీసు వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాదయాత్ర అనంతరం సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కోనాల భీమారావు అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో 15లక్షల రూపాయలు జమచేస్తామని, ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని, అధికధరలు తగ్గిస్తాం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతాంగం ఆత్మహత్యలు నివారిస్తామని ప్రగల్భాలు పలికి అధికారం చేపట్టిన నరేంద్రమోదీ తద్విరుద్ధంగా పాలనసాగిస్తూ దేశ సంపదను కార్పోరేట్‌ వర్గాలకు దోచిపెడుతూ తీరని ద్రోహం చేస్తున్నాడన్నారు. రైతులకు వ్యతిరేకంగా మూడు వ్యవసాయ చట్టాలు, కార్మికులకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తూ నాలుగు లేబర్‌ కోడ్‌ లు తెచ్చి కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్నాడన్నారు. దేశంలో మునుపెన్నడూ లేని రీతిలో గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచి ప్రజల రక్తాన్ని జలగలా పీల్చుకు తింటున్నాడన్నారు. అన్ని నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటి ప్రజల జీవనం దుర్భరంగా మారిందన్నారు. దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న మోదీ విధానాలకు వ్యతిరేకంగా నిరంతర పోరాటాలకు పూనుకోవాలన్నారు. 32 మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న మూడు లక్షల కోట్ల రూపాయల విలువైన విశాఖ ఉక్కు కేవలం నలఫై వేలకోట్ల రూపాయలకే తెగనమ్ముతున్నాడన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజల పట్ల సవతితల్లి ప్రేమ ఒలకపోస్తున్నాడన్నారు. పోలవరం ప్రాజెక్టు కు నిధులు, నిర్వాసితుకు సరైన నష్ట పరిహారం, పునరావసం కల్పించకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్న మోదీని గద్దె దించడం ద్వారా దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సీపీిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిరక్షణ, రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాలు, కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌ లు రద్దు చేయాలని, పోలవరం నిర్వాసితులకు ఆర్ధికసాయం, పునరావసం కల్పించాలని కోరారు. సీపీిఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ నెక్కంటి సుబ్బారావు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శులు బీవీవీ కొండలరావు, పడాల రమణ, సీపీిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నెక్కంటి జగదాంబ, సామాజిక వేత్త సంకు మనోరమ, సీపీఐ జిల్లా నాయకులు ఎం సీతారాం ప్రసాద్‌, సిహెచ్‌. రంగారావు, కలిశెట్టి వెంకట్రావు, కోరాడ సుధీర్‌ బాబు, ఆరేటి మృత్యుంజయరావు, కడుపు కన్నయ్య, కళింగ లక్ష్మణరావు, టి అప్పలస్వామి, ఎం లక్ష్మీపతి, ఏఐటీయూసీ నాయకులు యింటి వీరన్న, గొల్లపల్లి కనకారావు, దాకే ముసలయ్య, దేవ పెద్దిరాజు, తోట నాగేశ్వరరావు, సావారపు దేవి, గండి రామకృష్ణ, అగ్రిగోల్డ్‌ కష్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు వై నాగలక్ష్మి, ఎన్‌ రామశ్రీను, నల్లాకుల గణపతి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img