Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

మోదీ… కేసీఆర్‌ జోడీనే

. ఎన్నికల ముందు ఇద్దరూ డ్రామా చేస్తారు
. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

విశాలాంధ్ర`హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇద్దరూ జోడీనే అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటేనని, ఎన్నికల ముందు ఇద్దరూ కలిసి డ్రామా చేస్తారని చెప్పారు. ఎప్పుడేమి చేయాలో కేసీఆర్‌కు మోదీ సూచిస్తారని అన్నారు. మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ కూడా నిరుద్యోగం గురించి ఊసెత్తరని ఎద్దేవా చేశారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా హైదరా బాద్‌లో జరిగిన సభలో రాహుల్‌ ప్రసంగించారు. పార్లమెంట్‌లో బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లులకు టీఆర్‌ఎస్‌ మద్దతిస్తోందని, ప్రతిపక్షం లేవనెత్తే అంశాలకు మాత్రం మద్దతు ఇవ్వడం లేదని రాహుల్‌ ఆరోపించారు. హైదరాబాద్‌ విమానాశ్రయం అందరూ చూస్తుండగానే మోదీ స్నేహితులైన వ్యాపారవేత్తలు అతి త్వరలోనే స్వాధీనం చేసుకుంటారని రాహుల్‌ ఆరోపిం చారు. పోర్టులు, విమానాశ్రయాలను, ఎల్‌ఐసీని కేంద్రం అమ్మేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్‌ సంస్థల యజమానులు లక్షలు, కోట్ల రూపాయలు రుణం తీసుకోగలుగుతారని, చిరు వ్యాపారులు మాత్రం చిన్న రుణాలు కూడా పొందలేకపోతున్నారని రాహుల్‌ అన్నారు.
హైదరాబాద్‌లో రాహుల్‌ యాత్రకు ఘనస్వాగతం
రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఏడవరోజు కొనసాగింది. మంగళవారం ఉదయం శంషాబాద్‌ నుంచి ప్రారంభమైన యాత్ర హైదరాబాద్‌ నగరంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా శంషాబాద్‌ వద్ద యువత రాహుల్‌కి ఘన స్వాగతం పలికారు. ఆయన వారితో మాట్లాడుతూ వారి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి భరతనాట్యం చేయగా, మరి కొంతమంది యువత జిమ్నాస్టిక్స్‌ చేసి చూపిం చారు. రాహుల్‌ యువత చేసిన విన్యాసాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆరంగర్‌ చేరుకున్న యాత్ర అక్కడి నుంచి పురానాపూల్‌ మీదుగా చార్మినార్‌కు చేరుకుంది. అనంతరం గాంధీభవన్‌, నాంపల్లి మీదుగా యాత్ర నెక్లెస్‌ రోడ్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా చార్మినార్‌ వద్ద ఉన్న రాజీవ్‌ గాంధీ సద్భావనా యాత్ర స్మారక స్తంభంపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దారి మధ్యలో రాహుల్‌ అనేక చోట్ల చిన్నారులను ఆత్మీయంగా పలకరిస్తూ వారితో ఫొటోలు దిగారు. భారత్‌ జోడో యాత్ర ముగింపు అనంతరం బోయిన్‌పల్లిలోని గాంధీయన్‌ ఐడియాలజీ సెంటర్‌లో ఆయన బస చేశారు. ఈ సందర్భంగా యాత్రలో పాల్గొనేందుకు భారీగా కాంగ్రెస్‌ శ్రేణులు, నగరవాసులు తరలివచ్చారు. బోనాలు, శివభక్తులు, పోతరాజుల వంటి సాంస్కృతిక కళాబృందాలతో కాంగ్రెస్‌ శ్రేణులు స్వాగతం పలికారు. సదర్‌ దున్నపోతులను అఫ్జల్‌ గంజ్‌ వద్ద రాహుల్‌కు చూపించి సదర్‌ ఉత్సవాలను గురించి కాంగ్రెస్‌ నాయకులు వివరించారు. భారత్‌ జోడో యాత్రలో మల్లికార్జున ఖడ్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, హనుమంతరావు, అంజన్‌ కుమార్‌ యాదవ్‌, నిరంజన్‌, షబ్బీర్‌ అలీ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img