Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మోదీ గద్దె దిగే వరకు ఉద్యమం

. దేశాన్ని పరిరక్షించుకుందాం
. నేటి నుంచి సీపీఐ`సీపీఎం ప్రచారభేరి
. రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, శ్రీనివాసరావు
. పోస్టరు ఆవిష్కరించిన నేతలు
. ముఖ్య అతిథులుగా వినయ్‌ విశ్వం, ప్రకాశ్‌ కారత్‌

విశాలాంధ్ర బ్యూరో –అమరావతి: మోదీ ప్రభుత్వం గద్దె దిగేవరకు ప్రతిపక్షాలతో కలిసి పోరాటం కొనసాగిస్తామని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు స్పష్టంచేశారు. ‘మోదీని గద్దె దించండిదేశాన్ని కాపాడండి’ నినాదంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, నిరంకుల విధానాలపై సీపీఐ, సీపీఎం సంయుక్తంగా తలపెట్టిన ప్రచారభేరి ఈనెల 14వ తేదీన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి రోజు నుంచి ప్రారంభమై…15 రోజులపాలు కొనసాగుతుందన్నారు. విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం(ఎంబీవీకే) భవన్‌లో గురువారం సీపీఐ, సీపీఎం నేతలు ప్రచార పోస్టరును ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ మతోన్మాద, కార్పొరేట్‌, ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొట్టాలని, రాజ్యాంగ, ప్రజాస్వామిక హక్కులను కాపాడాలని, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరానికి కేంద్రం చేస్తున్న ద్రోహం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రచారభేరికి శ్రీకారం చుట్టామన్నారు. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం దేశానికి ఏమి చేసిందని ప్రశ్నించారు. సాధారణ ప్రజలకిచ్చిన వాగ్దానాలు ఏమైనా అమలు చేశారా? కార్పొరేట్‌కు ఏ రకంగా మోదీ కొమ్ముకాశారనే దానిపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. 2014 ఎన్నికల ముందు మోదీ పదేపదే రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల సమస్యలు, బ్లాక్‌మనీ, అధిక ధరలపై మాట్లాడారని రామకృష్ణ గుర్తుచేశారు. తొమ్మిదేళ్ల తర్వాత కూడా అందులో ఒక్క హామీ అయినా అమలు చేశారా అని నిలదీశారు. ‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్నారు. నేడు దానిపై స్పందించడం లేదు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్నారు. రైతుల ఆదాయం పెరిగిందా? ఆత్మహత్యలు ఆగాయా?’ అని సూటిగా ప్రశ్నించారు. వీటన్నింటికీ మోదీ నమాధానమివ్వాలని డిమాండ్‌ చేశారు. ధరల విషయంలోనూ మోదీ ప్రభుత్వం దగా చేసిందని మండిపడ్డారు. ధరల నియంత్రణలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. నాడు రూ.410 సిలిండరు ధర ఉంటే బీజేపీ నేతలంతా గ్యాస్‌బండలు భుజాలపై వేసుకుని దిల్లీ నడివీధుల్లో ధర్నాలు చేశారని, ఇవాళ రూ.1200కు పెరిగితే ఆ నాయకులు ఎందుకు పెదవి విప్పడం లేదని దుయ్యబట్టారు. పెట్రోలు, డీజిల్‌ ధరలు రూ.100 పైగా పెరిగాయని, నిత్యావసర ధరలు భారీగా పెరిగినప్పటికీ మోదీ నుంచి మంత్రుల వరకు మాట్లాడటం లేదని విమర్శించారు. బ్లాక్‌మనీని వెనక్కి రప్పించకపోగా, బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని వాటిని ఎగ్గొట్టి విదేశాలకు దర్జాగా పోతుంటే కేంద్రం చోద్యం చూస్తోందన్నారు. వాళ్లలో గుజరాత్‌ బడాబాబులే అధికంగా ఉన్నారని గుర్తుచేశారు. మోదీ, అమిత్‌షాకు వారంతా ఆప్తమిత్రులుగా ఉన్నారన్నారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ వర్గాలకు కొమ్ము కాస్తోందని, అదానీ, అంబానీ ఆస్తులు పెంచేందుకు తోడ్పడుతోందని దుయ్యబట్టారు. పేదలు, రైతులు, నిరుద్యోగులు, సాధారణ ప్రజల సమస్యల పరిష్కారంలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వేజోన్‌కు నిధులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అదానీకి కట్టబెట్టేందుకు మోదీ, జగన్‌ లాలూచీపడ్డారని మండిపడ్డారు. మోదీ ప్రజావ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ ప్రచారానికి శ్రీకారం చుట్టామని, దీని తర్వాత ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని ప్రకటించారు.
శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ అరాచక పాలన కొనసాగుతోందని, మోదీ దుష్ట పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి పేర్లతో అమిత్‌షా బృందం మత కల్లోలాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. పరస్పరం ద్వేషించుకునేలా, దేశ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ మతం పేరుతో ఘర్షణలు సృష్టిస్త్తూ దేశాన్ని బలహీనపరిచే చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా దేశ పరువు, ప్రతిష్ఠలను మంట గలుపుతోందన్నారు. పశ్చిమబెంగాల్‌లో నేటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని వివరించారు. చత్తీస్‌గఢ్‌ బస్తర్‌ జిల్లాలో బీజేపీ, ఆరెస్సెస్‌, విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలు క్రైస్తవులను సామాజిక, ఆర్థిక బహిష్కరణకు గురిచేసిన సంఘటన సమాజం తలదించుకునేలా ఉందని వ్యాఖ్యానించారు. అదానీ వేల కోట్ల రూపాయల కుంభకోణంపై పార్లమెంట్‌లో చర్చ జరగకుండా మోదీ సర్కారు అడ్డుకుందని ఆరోపించారు. అదానీని రక్షించడానికి, మోదీ సర్కారు వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. మోదీ హయాంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పక్షపాతిగా చెప్పుకుంటున్న సీఎం జగన్‌ ఎందుకు స్పందించడం లేదని, బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో ఆరెస్సెస్‌ కార్యకలాపాలు విస్తృతంగా కొనసాగుతున్నాయని, పాఠశాలల్లో పిల్లల మనసుకు ఇబ్బంది కలిగే చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యావిధానాన్ని ప్రక్షాళన చేస్తున్నానంటూ జగన్‌ గొప్పలు చెప్పుకుంటున్నారని, బీజేపీ, ఆరెస్సెస్‌ విధానాలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడంలో భాగంగా పెట్టుబడులు రాకుండా, ముడిసరుకు సరఫరా చేయకుండా, బ్యాంకులు సాయం చేయకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై మంత్రి గుడివాడ అమర్నాథ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించిన తీరు అవగాహన లోపంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిర్వీర్యం చేస్తున్నాయని, ఇది దుర్మార్గమని తీవ్రంగా ఖండిరచారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ మేల్కొని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం దిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ, సీపీఎం జాతీయ సమితి పిలుపులో భాగంగా విజయవాడ ఎంబీవీకేలో ఈనెల 14వ తేదీన ప్రచారభేరి ప్రారంభసభ జరుగుతుందన్నారు. తొలుత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలేసి, అనంతరం ర్యాలీగా ఎంబీవీకే వద్దకు చేరుకుంటామని తెలిపారు.
రాష్ట్రానికి బీజేపీ, ఆరెస్సెస్‌, విశ్వహిందూ పరిషత్‌ చేస్తున్న అన్యాయాన్ని, కుట్రలను ఎండగడతామని చెప్పారు. ప్రచారభేరి ప్రారంభసభకు సీపీఐ, సీపీఎం జాతీయ నేతలు వినయ్‌విశ్వం, ప్రకాశ్‌ కారత్‌ హాజరవుతారని, దీనిని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సీహెచ్‌.బాబూరావు, వి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img