Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మోదీ, జగన్‌ పాలనపై ప్రచారయుద్ధం

. 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రచార జాతాలు
. టీడీపీ, జనసేన కలిసి రావాలి
. రామకృష్ణ, శ్రీనివాసరావు ప్రకటన

విశాలాంధ్ర`విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక పాలనపై ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి రోజైన ఏప్రిల్‌ 14 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ, సీపీఎం ప్రచారయుద్ధం చేయనున్నాయి. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో సీపీఐ, సీపీఎం నేతలు శుక్రవారం సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో ప్రమాదకర ధోరణి కనిపిస్తోందన్నారు. ప్రధాని మోదీకి పార్లమెంట్‌పై ఏమాత్రం గౌరవం కనిపించడం లేదని విమర్శించారు. అదానీ వ్యవహారం గురించి ప్రపంచదేశాలు చర్చిస్తుంటే ప్రధాని మాత్రం ఒక్క మాట మాట్లాడటం లేదన్నారు. అదానీ కుంభకోణాలపై జేపీసీ వేయడానికి మోదీ భయపడుతున్నారని మండిపడ్డారు. అవినీతిపరులకు మోదీ సర్కారు అడుగులకు మడుగులొత్తుతోందని ఆరోపించారు. మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు అదానీని ఉపయోగించుకొని ప్రధానిస్థాయికి ఎదిగారని, ఇప్పుడు ఆ రుణం తీర్చుకుంటున్నారని చెప్పారు. తన 9 ఏళ్ల పాలనలో కార్పొరేట్‌ శక్తుల సంపదను మోదీ ఇబ్బడిముబ్బడిగా పెంచారని విమర్శించారు. దేశంలో అవినీతి విశృంఖలంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రాన్ని నిలదీసినా…ప్రశ్నించినా…వారిపై ఈడీ, సీబీఐతో వేధిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ప్రధానమంత్రి మోదీయేనన్నారు. నల్లడబ్బు వెనక్కితీసుకురావటం, ఉద్యోగాల భర్తీ, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు, రామాయపట్నం పోర్టు నిర్మాణం, విశాఖ రైల్వేజోన్‌ వంటి హామీలేవీ అమలు చేయలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం కూడా మోదీకి తలొగ్గుతోందన్నారు. దేశంలో మోదీ, అదానీ, జగన్‌ హవా నడుస్తోందన్నారు. రాష్ట్రంలోని వేలకోట్ల విలువైన భూముల్ని అదానీకి ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. పోర్టులు, ఆదాయం సమకూర్చే సంస్థల్ని అదానీకి కట్టబెడుతున్నారన్నారు. పోలవరం నిర్వాసితులకు రూ.30వేల కోట్ల నిధులు ఇవ్వకుండా ప్రాజెక్టు నిర్మాణం ఎలా చేపడతారని ప్రశ్నించారు. ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న మోదీ, జగన్‌ పాలనకు వ్యతిరేకంగా వామపక్షాలు సమరభేరి మోగిస్తున్నాయన్నారు. 16 రోజుల పాటు వివిధ రూపాల్లో జరిగే ప్రచార జాతాల్లో ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు, లౌకికవాదులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా గుర్తించడం లేదని, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. ఎప్పుడో నిర్ణయించిన అంచనాలను పదేపదే సవరిస్తూ వాటినే మళ్లీమళ్లీ చెపుతున్నా సీఎం జగన్‌ ప్రశ్నించటం లేదన్నారు. ఎన్నిసార్లు దిల్లీ వెళ్లినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్క వినతిపత్రం ఇవ్వలేదన్నారు. ట్రూఅప్‌ చార్జీల పేరుతో వేలకోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రజల పట్ల గౌరవం ఉంటే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ముందుకు వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. జేపీకి కొమ్ముకాస్తే తెలుగు ప్రజలకు అవమానం చేసినట్లేనన్నారు. దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నా లౌకికపార్టీలుగా చెప్పుకునే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎందుకు నోరుమెదపటం లేదని నిలదీశారు. లోక్‌సభలో 22 మంది, రాజ్యభలో 8 మంది ఎంపీలున్నా మోదీకి వైసీపీ మోకరిల్లటం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగ విలువల్ని కాలరాస్తున్న మోదీ, జగన్‌ పాలనపై సీపీఐ, సీపీఎం చేసే ప్రచార ఉద్యమంలో టీడీపీ. వైసీపీ, జనసేన పార్టీలు భాగస్వామ్యం కావాలని కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సీహెచ్‌.బాబూరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img