Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మోదీ పాలనలో దళితులపై అకృత్యాలు అధికం

. యూపీఏ`2 హయాంతో పోలిస్తే రెట్టింపు
. బీజేపీ పాలిత యూపీ, మధ్యప్రదేశ్‌లో దాష్ఠీకాలు
. బడ్జెట్‌లో నిధుల కేటాయింపుల్లోనూ వివక్షే

న్యూదిల్లీ : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. యూపీఏ హయాంలో దళితులపై జరిగిన దాడుల కంటే ఎనిమిదేళ్ల్ల మోదీ పాలనలో ఆ సంఖ్య రెట్టింపునకు చేరింది. గడచిన వారం రోజుల వ్యవధిలో జరిగిన మూడు ఘటనలు ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాష్టీకానికి అద్దం పడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సోమవారం ఓ దళిత యువకుడి కళ్లు పీకేసి అతడిని దారుణంగా దుండగులు హత్య చేశారు. రోజైనా గడవకముందే తన భార్యను చూస్తున్నాడన్న ఆరోపణతో దళిత యువకుడిని, అతడి తల్లిదండ్రులను మధ్యప్రదేశ్‌లో మంగళవారం ఓ వ్యక్తి కాల్చిచంపాడు. టాయిలెట్‌ సీటు దొంగిలించాడని దళిత యువకుడికి గుండు గీసి, సిరా పూసి, స్తంభానికి కట్టేసి బీజేపీ నేత కొట్టిన హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఈ అకృత్యాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై జరుగుతున్న దాడులు, ఆ సామాజిక వర్గంపై కొనసాగుతున్న వివక్షను ప్రతిబింబిస్తున్నాయి. యూపీఏ`2 హయాంలో దళితులపై దేశవ్యాప్తంగా 1,73,088 దాడులు జరిగితే, మోదీ ఎనిమిదేళ్ల పాలనలో ఈ సంఖ్య 3,53,389కి అంటే సుమారుగా రెట్టింపు పెరిగింది. ఎస్సీలపై జరుగుతున్న దాడుల్లో అత్యధిక కేసులు యూపీలో నమోదవుతుండగా, ఎస్టీలపై దాడుల కేసుల్లో మధ్యప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది మొదలు… దళితులపై జరుగుతున్న దాడులు అంతకంతకూ పెరుగుతున్నట్టు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. కేసుల పరిష్కారంలోను, నిందితులను శిక్షించడంలోనూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దేశ జనాభాలో 30 శాతానికి పైగా ఉన్న దళితులకు ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన నిధులు 3 శాతం మాత్రమే. దీన్ని బట్టి దళితులపై బీజేపీకి ఉన్న ప్రేమ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img