Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మోదీ పాలన ప్రకటనలకే పరిమితం

ప్రియాంకగాంధీ విమర్శ
చండీగఢ్‌: మోదీ పాలనంతా ప్రకటనలకే పరిమితమని కాంగ్రెస్‌ పార్టీ నేత ప్రియాంకగాంధీ విమర్శించారు. అభివృద్ధి అనేది ప్రకటనల్లో తప్ప కళ్లకు ఎక్కడా కనిపించడం లేదని నిందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ, ఆప్‌ మతం, మనోభావాలను ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. ‘మోదీ పాలన ప్రకటనలకే పరిమితం. దేశంలో ఆయన పాలన ఎక్కడా కనిపించదు. మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేవు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ధరల తగ్గించే చర్యలు మృగ్యం. దీనిని పాలన అంటామా? ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ సంస్థలను ఆయన మిత్రులకు కట్టబెట్టడం లేదా?’ అని ప్రియాంక ప్రశ్నించారు. ప్రియాంక గురువారం పఠాన్‌కోట్‌లో విలేకరులతోనూ, తర్వాత ఎన్నికల ర్యాలీలోనూ ప్రసంగించారు. దేశంలోని పేదలు, చిన్న వ్యాపారులు, చిన్నచిన్న పారిశ్రామికవేత్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి గురించి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆందోళన లేదని ప్రియాంక విమర్శించారు. ఇక పాలన ఎక్కడ ఉందని ఆమె నిలదీశారు. మోదీ సర్కారు కేవలం ప్రచారం కోసమే రూ.2వేల ప్రజాధనాన్ని ఖర్చు చేసిందని మండిపడ్డారు. బీజేపీ, ఆప్‌ లక్ష్యంగా ప్రియాంక విమర్శలు గుప్పించారు. రాజకీయాల కోసం ఆ రెండు పార్టీలు మతం, మనోభావాలను వాడుకుంటున్నాయన్నారు. వారికి అభివృద్ధి పట్టదన్నారు. ప్రత్యేకించి మోదీ, ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్లు ప్రస్తావిస్తూ ఆరోపణలు చేశారు. ‘మోదీ, కేజ్రీవాల్‌ పంజాబ్‌ గురించి మాట్లాడుతున్నారు. ఇది నవ్వు తెప్పిస్తుంది. పంజాబ్‌ గురించి వారికేమి తెలుసు? అది అర్థం కావాలంటే ఇక్కడ జీవించాలి. పంజాబీయుడిగా ఉండటం ఒక సెంటిమెంట్‌’ అని ఆమె అన్నారు. మోదీ, కేజ్రీవాల్‌ పంజాబ్‌ గురించి… పంజాబ్‌ ప్రజల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మోదీ అయితే తన బిలియనీర్‌ మిత్రుల ముందు మోకరిల్లుతారని, కేజ్రీవాల్‌ రాజకీయం, అధికారం ముందు ఎవరి ముందైనా తలవంచుతారని ప్రియాంక ఆరోపించారు. ఇది వాస్తవమని ఆమె అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img