Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మోదీ ప్రసంగం లౌకిక స్ఫూర్తికి విరుద్ధం

హిందూ, ముస్లిముల వివాదాల ప్రస్తావన ప్రమాదకరం
ఆయన చెప్పేది ఒకటి.. ఆచరించింది మరొకటి
అంబానీ, అదానీలకు బీజేపీ రెడ్‌ కార్పెట్‌
దేశ వ్యాప్తంగా మోదీ వ్యతిరేక గాలి
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ

విశాలాంధ్ర బ్యూరో అమరావతి : స్వాతంత్య్రానికి ఒక సంవత్సరం ముందు హిందూ, ముస్లిముల మధ్య తలెత్తిన వివాద సంఘటనను.. మళ్లీ 75వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించడం దేశ లౌకికవాద స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని, తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ డిమాండు చేశారు. విజయవాడ దాసరి భవన్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నారాయణ మాట్లాడుతూ స్వాతంత్య్ర దిన వేడుకల్లో మోదీ సుదీర్ఘ ప్రసంగం మంచిగా ఉందని, అదే సందర్భంలో స్వాతంత్య్రానికి ఒక సంవత్సరం ముందు నాటి హిందూ, ముస్లిముల మధ్య తలెత్తిన వివాదాలను.. ఈ సమయంలో ప్రస్తావించడం అగ్గిమీద ఆజ్యం పోసినట్లుగా ఉందన్నారు. మోదీ ఉపన్యాసంలో చెప్పేది ఒకటి, ఆచరించేది మరొకటిలాగా ఉందన్నారు. లౌకికవాద దేశంలో ఆయన మతాల మధ్య చిచ్చురేపేలా ప్రసంగించారని విమర్శించారు. అయిపోయిన పీడక కలను మోదీ మళ్లీ గుర్తు చేయడం వెనుక అర్థమేమిటని ప్రశ్నించారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను చెప్పేందుకు మోదీకి ఇష్టంలేకే .. హిందూముస్లిముల మధ్య మతోన్మాదాన్ని రెచ్చగొట్టే సారాంశ సందేశాన్ని ప్రజలకు ఇచ్చారని అన్నారు. దీంతో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తికి, దేశ లౌకికవాదానికి, ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని, ఇది ప్రధాని మోదీ తిరోగమన, దివాలాకోరు చర్య అని మండిపడ్డారు. మోదీ అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక, వ్యాపార రంగం మొత్తాన్ని కార్పొరేట్‌లకు కట్టబెట్టి, ఒక్క పరిపాలననే ప్రభుత్వం అధీనంలో ఉంచుకునేలా చర్యలు ప్రారంభించారన్నారు. ఇందుకు నిదర్శనంగా చాలా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌లకు కట్టబెట్టడమేనన్నారు. కరోనా సమయంలోనూ అంబానీ, అదానీలకు మోదీ రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నారని విమర్శించారు. ఈ విధానాలతో దేశానికి కొత్త ఫలాలు రాకపోగా, స్వాతంత్య్ర ఉద్యమంతో వచ్చిన ఫలాలు హరించుకుపోతున్నాయని, దేశానికి పెను ప్రమాదం వచ్చి పడిరదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా మోదీ పాలనపై ప్రజల్లో వ్యతిరేక గాలి వీస్తోందన్నారు. నాడు స్వాతంత్య్ర ఉద్యమంలో ఆరెస్సెస్‌ పాల్గొనలేదని, బ్రిటీష్‌ పరిపాలకులకు మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు. అలాంటి మతోన్మాద ఆరెస్సెస్‌ కనుసన్నల్లో నేడు బీజేపీ పరిపాలన కొనసాగుతోందన్నారు. అఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ల ఘటనపై భారత్‌ అప్రమత్తంగా ఉండాలని, ఇదే సమయంలో మోదీ మతతత్వానికి ఆజ్యం పోసేలా చేసిన వ్యాఖ్యలతో మరింత ప్రమాదాన్ని తెచ్చిపెట్టేలా ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి, కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img