Friday, April 19, 2024
Friday, April 19, 2024

మోదీ విధానాలను వ్యతిరేకిద్దాం

. ఆయనకు వంతపాడుతున్నజగన్‌కు బుద్ధిచెప్పాలి
. ప్రచారభేరిలో సీపీఐ, సీపీఎం నాయకుల పిలుపు

విశాలాంధ్ర నెట్‌వర్క్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియంతలా వ్యవహారిస్తు న్నారనీ, ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని యథేచ్ఛగా అమ్మి వేస్తున్నారనీ, ఆయనకు ఇక ఏమాత్రం అధికారంలో కొనసాగే అర్హత లేదని సీపీఐ, సీపీఎం నాయకులు వక్కాణించారు. ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకించాలనీ లేకుంటే దేశ భవిష్యత్‌ ప్రశ్నార్థకమవుతుందన్నారు. ‘బీజేపీ హఠావోదేశ్‌ బచావో’ నినాదంతో సీపీఐ, సీపీఎం అధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారభేరి కార్యక్రమం సోమవారం నాలుగో రోజుకు చేరింది. సీపీఐ, సీపీఎం అధ్వర్యాన ప్రచార కార్యక్రమంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు హోరెత్తాయి. ఈ కార్యక్రమంలో ఉభయ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందనీ, సామాన్య ప్రజానీకంపై భారాలు మోపుతూ కార్పొరేట్లకు ప్రభుత్వరంగ సంస్థలను ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కేసులకు బయపడి మోదీ విధానాలకు వంతపాడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు. సీపీఐసీపీఎం ప్రచార భేరి కార్యక్రమంలో భాగంగా గుంటూరు గుజ్జనగుండ్ల పార్క్‌ సెంటర్‌లో సోమవారం రాత్రి సీపీఐ నగర నాయకులు ఆకిటి అరుణ్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, దేశంలో దుర్మార్గ పాలనను సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించకుంటే మన బిడ్డల భవిష్యత్‌ అంథకారమై పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండాల్సిన ప్రజల మధ్య మత విద్వేషపు చిచ్చును బీజేపీ రాజేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ, అమిత్‌ షా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. పేదలు, కష్టజీవుల హక్కుల పరిరక్షణ ఎర్రజెండాతోనే సాధ్యమని, ఎర్రజెండాను బలోపేతం చేయడంతో పాటు వారిని చట్టసభలకు పంపాలని విజ్ఞప్తి చేశారు. ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి హనుమంతరెడ్డి మాట్లాడుతూ మార్పు కోసం ప్రజలు ప్రయత్నం చేయాలన్నారు. మన కోసం పోరాటం చేసే వారిని గుర్తించాలని సూచించారు. సీపీఎం నగర కార్యదర్శి కె.నళినికాంత్‌, సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి దేశంలో దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి చిష్టి, సీపీఐ ఏరియా కార్యదర్శి గోగినేని వెంకటరావు, సీపీఎం ఏరియా కార్యదర్శి ఖాశింవలి, బాషా తదితరులు పాల్గొన్నారు.
మదనపల్లిలో: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ప్రచారభేరి కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. మార్గమధ్యంలో కరపత్రాలను పంచుతూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ తన మిత్ర బృందం అంబానీ, ఆదాని కంపెనీలకు దేశ సంపదను దోచి పెడుతున్నారని, కార్మిక హక్కులను హరిస్తూ కార్మిక చట్టాలను కోడ్‌ల రూపంలో తీసుకొచ్చి కార్పొరేట్లకు ప్రయోజనాలు చేకూరుస్తున్నారని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి బట్టలు విప్పి రోడ్లపై తరుముతున్నా నోరు మెదపలేని పరిస్థితులో ఈ రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన ఉన్నాయని అన్నారు. వైసీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి జగనే మానమ్మకం, జగనే మాతోడు అంటూ ప్రతి ఇంటికి స్టిక్కర్లు అతికిస్తున్నారనీ, జగన్‌ని ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు. సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు పీఎల్‌ నరసింహులు, పి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు బీజేపీి కనుసన్నలలో నడుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీిఐ జిల్లా సహాయ కార్యదర్శి మహేశ్‌, కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, సాంబశివ, సీపీఎం జిల్లా నాయకులు శర్మ, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కె.మురళి, తిరుమల, దేవా సూరి, సిద్దన్న, రెడ్డెప్ప, రవి అనసూయ తదితరులు పాల్గొన్నారు.
తెనాలిలో: గుంటూరు జిల్లా తెనాలి గాంధీనగర్‌లోని సీపీిఐ కార్యాలయం నుంచి ప్రారంభమైన ప్రచారయాత్ర శివాజీచౌక్‌, రైతు మార్కెట్‌ మీదగా గాంధీచౌక్‌ వరకు సాగింది. పట్టణంలోని శివాజీ చౌక్‌ సెంటర్‌లో కరపత్రాలు పంచుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారభేరి కొనసాగింది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, బీజేపీి పాలన అంతం కోసం కలిసి కట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైం దన్నారు. పేదలకు, సామాన్య ప్రజలకు అండగా ఉండాల్సిందిపోయి వారిమీదే మోయలేనంత భారాలను మోదీ ప్రభుత్వం మోపుతోందన్నారు. కార్యక్రమంలో సీపీిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్‌బాబు, ములకా సాంబిరెడ్డి, హుస్సేన్‌వలి, మహిళా నాయకురాలు రాజ్యలక్ష్మి, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పాశం వెంకటేష్‌, సీపీఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలో: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయకుండా, రాజధాని అమరావతి నిర్మాణానికి గుప్పెడు మట్టితీసుకువచ్చి ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజల నోట్లో, కళ్లల్లో కొట్టారనీ, ఇటువంటి బీజేపీ నాయకులకు బీజేపీకి ఓటు వేయాలని అడిగి అర్హత లేదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్‌ అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, నిరంకుశ విధానాలను నిరసిస్తూ సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార భేరి నాలుగవ రోజు సోమవారం కొనసాగింది. విజయవాడ చలసాని నగర్‌లో జరిగిన కార్యక్రమంలో శంకర్‌ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే అక్కడ బీజేపీకి ఎన్నికల నిధులు సమకూరుస్తున్నందున అదానికి ప్రయోజనం చేకూర్చేలా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోదీని విమర్శించినందుకు గుజరాత్‌ కోర్టు ద్వారా పార్లమెంటు సభ్యత్వానికి రాహూల్‌ గాంధీని అనర్హుడుగా తేల్చారని చెప్పారు. మోదీకి రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్‌ వంతపాడుతున్నారన్నారన్నారు. ప్రజలు వాస్తవాల్ని అర్థం చేసుకుని కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్న ప్రజాపోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌.బాబూరావు మాటా ్లడుతూ మోదీ ప్రభుత్వం ప్రశ్నించే వారిపైకి ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థల్ని ఊసిగొల్పుతున్నదని విమర్శిం చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శులు లంక దుర్గారావు, నక్కా వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.
నిడమర్రు మండలంలో: మోదీప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీిఐ, సీపీిఎం ఆధ్వర్యంలో ఏలూరుజిల్లా నిడమర్రు మండలంలో ప్రచార భేరీ యాత్రను సోమవారం నిర్వహించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి, అధిక ధరలు అరికట్టాలి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు.మండల కేంద్రమైన నిడమర్రు సెంటర్‌లో సీపీిఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్‌ ప్రచారభేరి యాత్రను ప్రారంభించారు.ఈ యాత్ర మండలంలోని నిడమర్రు, అడవికొలను,ఎనికే పల్లి, భువనపల్లి, మందలపర్రు గ్రామాల మీదుగా సాగింది.ఈ సందర్భంగా బండి వెంకటేశ్వరరావు,కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల వలన ధరలు విపరీతంగా పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, సీపీిఎం మండల కన్వీనర్‌ నారపల్లి రమణారావు, సీపీఎం నాయకులు కొక్కెరపాటి వెంకట్రావు, కోన శ్రీనివాసరావు, గవర సత్యనారాయణ, ఆర్‌. నాగరాజు, వెలగలేటి మోహన్‌, ఆలమండ రాము, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img