Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

మోదీ సర్కారు వెనకడుగు..

కులప్రాతిపదికన ఉపాధి వేతన చెల్లింపుల విధానం రద్దు
ఇకపై అందరికీ ఒకేవిధానంలో చెల్లింపులు
విపక్షాలు, కార్మిక సంఘాల విజయం

న్యూదిల్లీ : ప్రతిపక్షాల ఒత్తిడికి మోదీ సర్కారు వెనక్కి తగ్గింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కింద కులాల ప్రాతిపదికన వేతన చెల్లింపులు చేయాలన్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. కేవలం ఓట్ల రాజకీయంలో భాగంగా కులప్రాతిపదికన ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించాలని ఈ ఏడాది ఆరంభంలో మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై వామపక్షాలు సహా అనేక విపక్ష పార్టీలు, వ్యవసాయ కార్మిక, రైతు సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వెలిబుచ్చాయి. దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. కేంద్రం నిర్ణయం కారణంగా సామాజిక ఉద్రిక్తతలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. కుల ప్రాతిపదికన ఉపాధి వేతనాలు చెల్లించాలన్న నిర్ణయంపై పెద్దఎత్తున సామాజిక ఉద్రిక్తతలు చెలరేగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఫిర్యాదులు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఆర్థికమంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు కుల ప్రాతిపదికన ఉపాధి వేతనాలు చెల్లించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ మార్చి 2వ తేదీన రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మూడు ప్రత్యేక ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్స్‌ లేదా ఎఫ్‌టీఓలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంచేసింది. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఇతరులకు వేర్వేరు ఎఫ్‌టీఓలు ఉండాలని తెలిపింది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పని ప్రదేశంలోనే కులాల వారీగా విభజన చేయాలని, హాజరు పట్టీలో నమోదు చేయాలని గట్టిగా చెప్పింది. కులాల ప్రాతిపదికనే కేంద్ర ప్రభుత్వం మూడు వేర్వేరు ఖాతాల్లో నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేస్తుంది. అక్టోబరు 11వ తేదీన ఆర్థికశాఖ కార్యదర్శితో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎన్‌ఎన్‌ సిన్హాతో జరిగిన సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. కుల ప్రాతిపదికన వేతనాలు చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక అభ్యంతరాలు ఉన్నాయని, ఈ మార్పుతో క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటున్నట్లు స్పష్టంచేశాయని సిన్హా వివరించారు. వివిధ కులాల మధ్య కూలి వేతనాలు పంపిణీ ఇబ్బందికరంగా మారినట్లు తెలిపాయన్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చాయి. కుల ప్రాతిపదికన ఉపాధి చెల్లింపుల విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తులు, డిమాండ్‌లు చేశాయి.
ఉపాధి కూలీలకు సంబంధించిన వేతన చెల్లింపులపై లిబ్‌ టెక్‌ ఇండియా ఓ సర్వే చేసింది. గడచిన ఆరుమాసాలుగా 10 రాష్ట్రాల్లోని 18 లక్షల ఎఫ్‌టీఓలను విశ్లేషించింది. ఇతర కులాలతో పోలిస్తే ఎస్‌సీ, ఎస్‌టీకి చెందిన ఉపాధి కూలీలకు వేగంగా చెల్లింపులు జరిగినట్లు గుర్తించింది. కొన్ని సందర్భాల్లో రెండు, మూడు మాసాల వరకూ ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించలేదని తెలిపింది. దీనిపై కార్మిక సంఘాలు అనేక పోరాటాలు నిర్వహించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని మండిపడ్డాయి. ఆందోళనలు చేశాయి. దీనివల్ల గ్రామాల్లో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఓ కులానికి కూలీ డబ్బులు చెల్లించి…మరో కులానికి ఇవ్వకపోవడంతో ఘర్షణలు చోటుచేసుకున్నట్లు లిబ్‌ టెక్‌ ఇండియా వివరించింది. ఈ పరిణామాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒకే మస్టర్‌, ఒకే ఎఫ్‌టీఓ విధానాన్ని అమలు చేయాల్సిందిగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖను కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ఆదేశించింది. ఇక నుంచి ఉపాధి నిధులన్నింటినీ ఒకే ఖాతాలో విడుదల చేస్తామని తెలిపింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్షలాదిమంది గ్రామీణ పేదలకు కొండంత అండగా నిలిచింది. ప్రత్యేకించి కోవిడ్‌19 కష్టకాలంలో పెద్దఎత్తున ఆదుకుంది. ఉపాధి హామీ పథకం కోసం ఈ ఏడాది(202122) బడ్జెట్‌లో కేంద్రం రూ.73 వేల కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది 34 శాతం తక్కువ. గతేడాది బడ్జెట్‌లో రూ.1.11 లక్షల కోట్లు కేటాయించింది. వాస్తవంగా ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయాలని మోదీ సర్కారు ఎప్పటి నుంచో భావిస్తోంది. దశలవారీగా ఈ పథకాన్ని రూపుమాపాలను కోరుకుంది. అందులో భాగంగా యేటా బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత విధించింది. చివరికి కుల ప్రాతిపదికన వేతనాలు చెల్లించాలని నిర్ణయిచింది. దీనిపై ఆగ్రహావేశాలు వ్యక్తంకావడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img