Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మోదీ సర్కార్‌పై సమరం

2024 ఎన్నికలే లక్ష్యంగా ఏకమవుతున్న విపక్షాలు
20న వర్చువల్‌ భేటీకి సోనియాగాంధీ ఆహ్వానం
టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ, శివసేన అంగీకారం

న్యూదిల్లీ : ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతు న్నాయి. కనీసం పార్లమెంటును సైతం సక్రమంగా నిర్వహించలేక..విపక్ష ఎంపీలపై దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. పెగాసస్‌, రైతు వ్యతిరేక సాగు చట్టాలు వంటి అనేక సమస్యలు, మోదీ సర్కారు నియంతృత్వ పోకడలు విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చాయి. అచ్చేదిన్‌ అంటూ ప్రజలను మోసం చేసిన మోదీ సర్కారుపై యుద్ధానికి సమాయత్తమయ్యాయి. నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రతిపక్షాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ అనేకసార్లు సమావేశమై సమన్వయంతో పనిచేశాయి. బీజేపీపై సమరానికి భావసారూప్యతగల పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. విపక్ష ఐక్యతకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వేదికగా నిలిచాయి. ప్రజాసమస్యలపై ఉమ్మడి అజెండాతో ఐక్యవాణిని వినిపించగా ఉభయసభలు పెగాసస్‌ గూఢచర్యం, సాగు చట్టాలపై దద్దరిల్లాయి. విపక్షాల ఐక్యత మోదీ`షా ద్వయానికి తలనొప్పిగా మారింది. కమల దళాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. కాషాయ కండువా కప్పుకున్న ఇతర పార్టీల నేతలకూ ముచ్చెమటలు పట్టిస్తోంది. జులైలో మమతా బెనర్జీ దిల్లీలో పర్యటించి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో పాటు అనేకమంది ప్రతిపక్ష అగ్రనేతలను కలిసి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపై చర్చలు జరిపారు. రెండేళ్ల పరిపాలన కాలాన్ని పూర్తి చేసుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపే వ్యూహాలపై చర్చించారు. ఇదేవేడిలో సోనియాగాంధీ ఈనెల 20న ప్రతిపక్ష నేతలను వర్చువల్‌ సమావేశానికి ఆహ్వానించారు. టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, శివసేన చీఫ్‌, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సహా అనేకమంది ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొంటారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. అన్ని పార్టీల అధినేతలకు సోనియా ఆహ్వానం పంపారు. పార్లమెంటు లోపల, బయట ప్రతిపక్షాల వ్యూహాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే సోనియాగాంధీ ఆహ్వానం మేరకు తమ పార్టీల అధినేతలు వర్చువల్‌ సమావేశంలో పాల్గొంటారని టీఎంసీ, శివసేన, ఎస్సీపీ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ఇటీవల సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కమల్‌నాథ్‌, ఆనంద్‌శర్మ, అభిషేక్‌ మను సింఘ్వి, అరవింద్‌ కేజ్రీవాల్‌, శరద్‌ పవార్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌, కనిమొళితో మమత భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ ట్విట్టర్‌ ఖాతాల నిలుపుదలకు టీఎంసీ అభ్యంతరం తెలిపింది. ప్రతిపక్ష నేతలతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ వరుస భేటీలు నిర్వహించారు. వచ్చే ఏడాది జరిగే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు విపక్షాలు సర్వసన్నద్ధమవుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img