Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మోదీ… హోదా ఏది?

. విభజన హామీల అమలు ఇంకెన్నాళ్లు
. దిల్లీ జంతర్‌మంతర్‌ ధర్నాలో నిలదీసిన అఖిలపక్ష నేతలు
. బీజేపీ మోసపు పాలనకు మూల్యం తప్పదని డి.రాజా హెచ్చరిక

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : పార్లమెంటు సాక్షిగా ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక హోదా ఎందుకు అమలు చేయడం లేదంటూ అఖిలపక్ష నేతలు ప్రధాని నరేంద్ర మోదీని నిలదీశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్వర్యంలో శనివారం దిల్లీ జంతర్‌మంతర్‌లో అఖిలపక్ష నేతలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని, దాన్ని నెరవేర్చకుండా బీజేపీ ద్రోహం చేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీ ప్రజలకు బీజేపీ చేసిన ద్రోహంలో వైసీపీ, టీడీపీ భాగం అయ్యాయని, ద్రోహం చేసే పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దిల్లీ గద్దె వద్ద ఏపీ ప్రజల ఆత్మ గౌరవం తాకట్టు పెట్టారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా నిజమైన డిమాండని తెలిపారు. పార్లమెంటులో విభజన బిల్లుపై జరిగిన చర్చలో అన్ని పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని చెప్పాయని, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చిందని విమర్శించారు. పార్లమెంటులో ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారుతోందని అన్నారు. ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాన్ని దూకుడుగా అమలు చేస్తోందని, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ల శక్తులకు అప్పగిస్తోందని తెలిపారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు సిద్ధపడ్డారని, గంగవరం పోర్టును అదానీకి అప్పగించారని దుయ్యబట్టారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిజమైన డిమాండ్‌ ప్రత్యేక హోదాను ఎందుకు లేవనెత్తటం లేదని ప్రశ్నించారు. మరోవైపు మూడు రాజధానుల పేరుతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని, ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం రాజకీయ పోరాటాన్ని కొనసాగించాలని, ఏపీ ప్రజలను నిలువునా మోసగించిన బీజేపీ, వైసీపీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
బీజేపీ ద్రోహంలో వైసీపీ భాగస్వామ్యం : బీవీ రాఘవులు
ఏపీకి తీరని ద్రోహం చేస్తున్న కేంద్రంలోని బీజేపీకి రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ వత్తాసు పలుకుతూ ఆ ద్రోహంలో పాలుపంచుకుంటుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మండిపడ్డారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలు ఏపీ ప్రజల హక్కులని అన్నారు. ‘ఇటీవలి ప్రధాని మోదీ విశాఖను సందర్శించినప్పుడు ఆయన సమక్షంలో సీఎం వైఎస్‌ జగన్‌, తనకు ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి రాజకీయాలకు అతీతంగా ప్రత్యేకమైన సంబంధం ఉందని ప్రకటించారు. అయితే ఆ సంబంధమేమిటో మాత్రం చెప్పలేదు. బహుశా ఆ సంబంధం ఏపీకి సంబంధించినదై ఉండదు. ఏపీ ప్రత్యేక హోదాను వదులుకొని, ఏపీకి ద్రోహం చేసేవారితో అంత స్నేహం ఏమిటని ప్రశ్నించారు. ప్రధానిని ముఖ్యమంత్రి కలవడం తప్పులేదు. కానీ ఏపీకి మోసం చేసిన వారిపట్ల అంత సానుకూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఏపీ ప్రజల హక్కులను కూడా అడగలేని వారు ముఖ్యమంత్రిగా ఎందుకు ఉండాలి? ఏపీకి ద్రోహం చేసే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం మోచేతి నీళ్లు తాగుతూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తోంది. దీనివల్ల తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలగడంతో పాటు ఏపీ ప్రజలు, యువత ఆకాంక్షలకు తీవ్రమైన హాని కలుగుతోంది. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూడా బీజేపీ, మోదీ ప్రాపకం కోసం తహతహలాడుతున్నాయని విమర్శించారు. మతోన్మాద బీజేపీకి వంతపాడుతున్న వైసీపీ లాంటి పార్టీలకు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
మోదీ అంటే వైసీపీ, టీడీపీ, జనసేనకు వణుకు : రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూడా గతంలో ధర్నాలు చేశాయని, ప్రధాని మోదీకి భయపడి ఇప్పుడు మౌనంగా ఉన్నాయని విమర్శించారు. జనసేన పవన్‌ కల్యాణ్‌ ధర్నా చేశాడని, మోదీకి వినబడాలని హిందీలో కూడా గట్టిగా అరిచాడని, ఇప్పుడు బీజేపీ పంచన చేరాడని దుయ్యబట్టారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ నేతలకు కండకావరం పెరిగిందని, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని అంటున్నారని ధ్వజమెత్తారు. విభజన హామీలు నెరవేరకుండా ఏపీకి మంచి రోజులు వస్తాయా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో బీజేపీ వాళ్ల కంటే, వైసీపీ అతిగా స్పందించి యావత్తు యంత్రాంగాన్ని మోహరింపజేసిందని, కోట్లలో ఖర్చు చేసి, సీఎం జగన్‌ బంట్రోతులా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. కానీ ప్రధాని మోదీ విభజన హామీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. ఏపీని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన భయపడుతున్నాయని అన్నారు. ప్రజలే ముందుకొచ్చి పోరాడాలని ఆయన పిలుపు ఇచ్చారు.
విభజన హామీలు అమలు చేయాలి : వై.వెంకటేశ్వరరావు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్లమెంటులో ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రజలను బీజేపీ నిట్టనిలువనా దగా చేసిందని విమర్శించారు. కేంద్రాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిలదీసిన పాపాన పోలేదని, టీడీపీ కూడా మౌనంగా ఉందని దుయ్యబట్టారు. దేశంలోని ఏ రాష్ట్రంలోని లేని పరిస్థితి ఏపీలో చోటు చేసుకుంటుందని, అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలోని అధికారంలో ఉన్న పార్టీకి వంతపాడుతున్నాయని విమర్శించారు. పార్లమెంట్‌ బీజేపీకి వైసీపీ, టీడీపీ సహకరిస్తున్నాయని, రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక వంటి అన్ని బిల్లులకు మద్దతు ఇస్తున్నాయని విమర్శించారు. ఇది రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమని అన్నారు. దిల్లీలో బీజేపీతో దోస్తీ చేస్తున్న వైసీపీ, టీడీపీ రాష్ట్రంలో విమర్శలు గుప్పించుకుంటూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని, వైసీపీ, టీడీపీ వెనకున్న శ్రేణులు ఆలోచన చేయాలని తెలిపారు. జాతీయ విద్యా సంస్థలకు నిధులు కేటాయించకుండా ఎలా ముందుకు సాగుతాయని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతో పరిశ్రమలు వస్తాయని, ఫలితంగా రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. దగా చేసిన వారిని ప్రజలు క్షమించరని, ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
విభజన హామీల అమలు సాధనలో వైసీపీ విఫలం : చలసాని శ్రీనివాస్‌
ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంటులో ఇచ్చిన హామీలను నిరాకరించి, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ఇటీవలి ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో రాష్ట్రంలోని ప్రధాన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆయన కాళ్ల పైన సాగిలాపడ్డారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేస్తే తమపై కేసులు పెడుతున్నారని, ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిరదని విమర్శించారు. 32 మంది ఎంపీలున్న వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే బాధ్యత ఉందని, అయితే అందులో వైసీపీ విఫలం అయిందని దుయ్యబట్టారు. పోలవరానికి నిధులు ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అంటున్నారని, ఆమె దేశ ఆర్థిక మంత్రిగా వ్యవహరించటం లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని పేర్కొంటున్న బీజేపీ నేతలు, ఈశాన్య రాష్ట్రాలకు 2017 వరకు ప్రత్యేక హోదా ఇస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై ఏమంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ కుల, మతాలను రెచ్చగొడుతుందని విమర్శించారు. ఉద్యమం ఆగేది లేదని, ఆపేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహిస్తామని అన్నారు.
కేంద్రం మెడలు వంచుతానన్న జగన్‌ మాటలు ఎక్కడికెళ్లాయి : లక్ష్మీనరసింహ యాదవ్‌
కాంగ్రెస్‌ నేత లక్ష్మీనరసింహ యాదవ్‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతానన్న సీఎం వైఎస్‌ జగన్‌ మాటలు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. పార్లమెంటు, తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని బీజేపీ అమలు చేయలేదని విమర్శించారు. ఏపీ ఆత్మ గౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర సీఎం జగన్‌ తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ అడగలేని దద్దమ్మ ఎంపీలు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కూడా నోరెత్తడం లేదని, బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ వినయ్‌ విశ్వం, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ సదాశివరెడ్డి, ఏఐకేఎస్‌ నేత రావుల వెంకయ్య, కుమార్‌ చౌదరి యాదవ్‌, సాకే నరేష్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.లెనిన్‌ బాబు, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్‌బాబు, రవీంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నేత పరమేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నేత సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img