Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

యశ్వంత్‌సిన్హా నామినేషన్‌

ఇది సిద్ధాంతాల మధ్య పోరు: విపక్ష నేతలు

బీజేపీ పాత మిత్రుల మద్దతు కోరాను
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా

న్యూదిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి యశ్వంత్‌సిన్హా సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఆయన పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికను సిద్ధాంతాల మధ్య పోరాటంగా ప్రతిపక్ష నేతలు అభివర్ణించారు. యశ్వంత్‌సిన్హా వెంట ఆయన భార్య నీలిమ, రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌, అఖిలేశ్‌ యాదవ్‌, ఫరూక్‌ అబ్దుల్లా, కేటీ రామారావు సహా 15 ప్రతిపక్ష పార్టీల నేతలు ఉన్నారు. యశ్వంత్‌సిన్హా నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి అయిన రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీకి సమర్పించారు. మొదటి సెట్‌ నామినేషన్‌ పత్రాలను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గె ప్రతిపాదించగా రెండో సెట్‌ పత్రాలను తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సుదీప్‌ బందోపాధ్యాయ ప్రతిపాదించారు.
మిగిలిన రెండు సెట్లను డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ప్రతిపాదించారు. ప్రతి సెట్‌ నామినేషన్‌ పత్రాలను 60 మంది ప్రతిపాదించారు…మరో 60 మంది సమర్ధించారు. రాష్ట్రపతి ఎన్నిక కోసం సెక్యూరిటీ డిపాజిట్‌గా సిన్హా రూ.15 వేలు చెల్లించారు. నామినేషన్‌కు కొన్ని గంటల ముందు సిన్హాకు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు మద్దతు ప్రకటించారు. సిన్హా నామినేషన్‌ కార్యక్రమానికి కేటీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ బృందం హాజరైంది. సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతిచ్చినప్పటికీ జార్ఖండ్‌ ముక్తి మోర్చా నుంచి ఎవరూ హాజరు కాలేదు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కారణంగా శివసేన నేతలెవరూ నామినేషన్‌ కార్యక్రమానికి హాజరు కాలేదు. నామినేషన్‌ అనంతరం పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ, బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాలకు సిన్హా, ప్రతిపక్ష నేతలు పుష్పాంజలి ఘటించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతుగా ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా నిలిచాయని చెప్పారు. తాము వ్యక్తిగతంగా మద్దతిచ్చినప్పటికీ ఈ పోరాటం రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతోందన్నారు. ఆగ్రహం, విద్వేషానికి ప్రతిరూపంగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతం ఒకటైతే..ప్రతిపక్షాలది ప్రేమతత్వ సిద్ధాంతమని రాహుల్‌ వ్యాఖ్యానించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సౌగతారాయ్‌ మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడే ఉన్నత వ్యక్తిగా సిన్హాను అభివర్ణించారు. ఈ పోరు వ్యక్తిగతం కాదని, మతన్మాదంలౌకికవాదం, నియంతృత్వంప్రజాస్వామ్యం మధ్య యుద్ధమని పేర్కొన్నారు. యశ్వంత్‌సిన్హా రాష్ట్రపతి పదవికి ఉత్తమమైన అభ్యర్థి అని వ్యాఖ్యానించారు. వ్యక్తులుగా చూసినా ద్రౌపది ముర్ము కన్నా సిన్హా సరైనవారని రాయ్‌ అన్నారు. కేరళ నుంచి సిన్హా మంగళవారం ప్రచారం ప్రారంభిస్తారు. అక్కడి నుంచి తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌ మీదుగా ప్రచారం సాగుతుంది. నామినేషన్‌ కార్యక్రమానికి రాహుల్‌, పవార్‌ సహా ఖర్గె, జైరాం రమేశ్‌, అశోక్‌ గెహ్లాట్‌, అభిషేక్‌ బెనర్జీ, సౌగతారాయ్‌, అఖిలేశ్‌ యాదవ్‌, తిరుచి శివ, ఏ.రాజా, ఫరూక్‌ అబ్దుల్లా, సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాం ఏచూరి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img